దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర రైతాంగం

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటే వారంతా పండుగ చేసుకుంటున్నారని టీడీపీ మంత్రులు, వారి ప్రభుత్వ ప్రతినిధులు ప్రచారం చేసుకోవడం ఆత్మవంచనేనని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ‘‘రైతుల రుణ మాఫీ జరుగలేదు, కొత్త రుణాలు రాలేదు, పూర్తి స్థాయిలో సాగు జరగడం లేదు, మద్దతు ధర కూడా నామమాత్రంగా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు పండుగ ఎలా చేసుకుంటారు?’’ అని సూటిగా ప్రశ్నించారు.

సకాలంలో విత్తనాలు, రుణాలు, ఎరువులు లభించడంతో పాటుగా పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర దొరికినపుడే కదా రైతులు పండుగ చేసుకునేది, ఇపుడవన్నీ వారికి సకాలంలో అందుబాటులోకి వచ్చాయా? మరెందుకు వారు పండుగ చేసుకుంటున్నారని నిలదీశారు. ఏపీ మొత్తంలో అన్ని పంటలూ కలిసి 41.72 హెక్టార్లలో సాగు చేస్తూ ఉంటే ఈ ఖరీఫ్‌లో ఈ నెల 17వ తేదీ వివరాల ప్రకారం 74 శాతం మేరకు ఆహారధాన్యాల పంటసాగు, 59 శాతం మేరకు పప్పు ధానాలు, 66 శాతం మేరకు వంట నూనె ఉత్పత్తుల సాగు జరిగిందని వివరించారు.

ఖరీఫ్ సీజన్ పూర్తి కావస్తున్నా ఇప్పటికీ పూర్తిగా సాగు కాని పరిస్థితి నెలకొందన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు బ్యాంకుల నుంచి కొత్త రుణాలు లభించక వడ్డీ వ్యాపారులనుంచి మూడు రూపాయల చొప్పున అప్పు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అనుకరించి పంటలకయ్యే ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధరను నిర్ణయిస్తామని ఎన్డీయే ఎన్నికల ముందు చెప్పిందని, ఇప్పటికీ అమలుచేయలేదని ఆయన విమర్శించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా టీడీపీ అందుకోసం ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ ఏడాదికి వరికి రూ.50, కందులకు 50, పెసలకు 100, మినుములకు 50, ప్రత్తికి రూ.50 మాత్రమే మద్దతు ధర పెంచారని తెలిపారు. వేరుశనగ, సజ్జలు పంటకు ఒక్క రూపాయి కూడా మద్దతు ధర పెరగలేదన్నారు.

విద్యుత్ సరఫరా మెరుగుపడటాన్ని తెలుగుదేశం పార్టీ వారు తమ ఘనతగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో విద్యుత్ డిమాండ్ తక్కువ ఉంటుందని, పైగా జలాశయాలు నిండి పుష్కలంగా జల విద్యుత్ వస్తోందని అదే దీనికి కారణమని ఆయన వివరించారు.

తాజా వీడియోలు

Back to Top