వైయస్ఆర్‌సీపీలో మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి

హైదరాబాద్:

మాజీ డీజీపీ వి.దినేశ్‌రెడ్డి సోమవారంనాడు భారీ సంఖ్యలో తన అనుచరులు, మిత్రులతో సహా వచ్చి వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నివాసంలో ఆయనను కలుసుకుని పార్టీలో చేరాలన్న తన అభిలాషను వెల్లడించారు. దినేశ్‌రెడ్డికి శ్రీ జగన్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు.

‌అనంతరం దినేశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి విధానాల పట్ల ఆకర్షణతో, ప్రజాసేవ చేయాలన్న ఆకాంక్షతో వైయస్ఆర్‌సీపీలో చేరినట్లు చెప్పారు. మహానేత వైయస్ఆర్ ‌పేదల పాలిట పెన్నిధిగా సామాన్యులకు సాధ్యమైనంత ఎక్కువ మేలు చేయాలని నిరంతరం తపనపడే వారన్నారు. డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిని తాను చాలా దగ్గరగా చూశానని చెప్పారు.

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం ఆయన తనయుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంద‌ని దినేశ్‌రెడ్డి అన్నారు. శ్రీ జగన్ మంచి నాయకత్వ లక్షణాలున్న వ్యక్తి అని, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్లలో తానూ ఒకడినని చెప్పారు. తాను ఈ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని, పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా సిద్ధమేనని తెలిపారు. 36 ఏళ్ల తన పోలీసు శాఖ సర్వీసులో అనేక కీలకమైన పదవులను నిబద్ధతతో, నిజాయితీతో నిర్వహించానని చెప్పారు. దీర్ఘకాలం పాటు రాష్ట్ర పోలీసు అధిపతిగా పనిచేశానని, తన సర్వీసులో ఎన్నో సంస్కరణలు తేగలిగానని తెలిపారు. వైయస్ఆర్ మెడిక‌ల్ ఎమర్జెన్సీ సర్వీసులను వారంలో 24 గంటలూ సామాన్యులకు అందుబాటులోకి తెచ్చిన విధంగానే తాను వారంలో 24 గంటలూ పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్న‌ట్లు చెప్పారు.

శ్రీ వైయస్ జగ‌న్‌పై మోపిన అవినీతి ఆరోపణలు, కేసుల విషయంలో మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ‘జగన్‌పై మోపినవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఏమీ రుజువు కాకుండా ఆయనను అవినీతిపరుడనడం అన్యాయం. ఆరోపణలనేవి ఎవరి మీదైనా చేయొచ్చు. నీ మీద కూడా చేయొచ్చు. దారిన పోయే దానయ్య మీద కూడా చేయొచ్చు. ఒక వ్యక్తిపై ఆరోపణలు చేసినంత మాత్రాన అతను తప్పు చేసినట్లు కాదు. రుజువయ్యేంత వరకూ వాటిని పరిగణనలోకి తీసుకోకూడదు. రుజువు కాని ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని జగన్‌కు అంటగట్టడం చాలా దారుణం, గలీజైన విషయం, జగన్‌పై రాజకీయ దురుద్దేశాలతో, రాజకీయ కుట్రలతో ఈ ఆరోపణలు చేశారు’ అని దినేశ్‌రెడ్డి స్పష్టంచేశారు. కోర్టులో ఉన్న విషయాలపై ఈ దశలో ఇంకా చర్చించడం మంచిది కాదన్నారు.

తాజా ఫోటోలు

Back to Top