ప్రతీ అడుగు దుష్టపరిపాలనకు చరమగీతం పాడేందుకే

విశేష ప్రజాధరణతో ముందుకు సాగుతున్న జననేత పాదయాత్ర
వైయస్‌ఆర్‌ ప్రజాప్రస్థానాన్ని మించిన ప్రజాసంకల్పయాత్ర
యాత్ర మొదటి రోజు మాటకు బాబుకు ఎందుకు కట్టుబడడం లేదు
వైయస్‌ జగన్‌ అడుగులకు టీడీపీ కోటలు బీటలుబారుతున్నాయ్‌
టీడీపీ విసృతస్థాయి సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరం
పట్టాలెక్కింది పరిపాలనను కాదు.. లోకేష్‌ను 
చంద్రబాబులో కాంగ్రెస్‌ రక్తం ఎంత పర్సెంటో చెప్పాలి
టీడీపీని మళ్లీ గెలిపించడం చరిత్రాత్మక అవసరం కానేకాదు
చిత్తుచిత్తుగా ఓడించి భూస్థాపితం చేయడమే చరిత్రాత్మక అవసరం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

విజయవాడ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేసే ప్రతీ అడుగు చంద్రబాబు దుష్టపరిపాలనకు చరమగీతం పాడే విధంగా ముందుకు సాగుతుందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర ప్రజలతో మమేకమవుతూ.. రోజు రోజుకీ ప్రజల నుంచి విశేష ఆదరణ సాధించిందన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతూ.. వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఒక మైలురాయిని అధిగమించి.. రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకునే ఒక చారిత్రక సంఘటన ఆంధ్రరాష్ట్ర రాజకీయాల్లో నిలిచిపోయే విధంగా ముందుకు సాగుతుందన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టి ప్రజా ప్రస్థానం యాత్రను మించిందిగా ప్రజా సంకల్పయాత్ర ముందుకు సాగుతుందన్నారు. తండ్రి రికార్డును దాటుకుని వైయస్‌ జగన్‌ ముందుకు సాగడం శుభ సూచికమన్నారు. వైయస్‌ జగన్‌ వేసే ప్రతీ అడుగు వైయస్‌ఆర్‌ సీపీ విజయం వైపు నడుస్తుందన్నారు. ఎక్కడకు వెళ్లినా ప్రేమానురాగాలు కురిపిస్తున్న ప్రజలంతా ఇలాగే వైయస్‌ జగన్‌కు తోడుగా, అండగా ఉండాలని అంబటి రాష్ట్ర ప్రజానికాన్ని కోరారు. 

ప్రజా సంకల్పయాత్ర ప్రారంభంలో మాట్లాడిన మాటపై చంద్రబాబుకు ఎందుకు నిలబడడం లేదో సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్‌ చేశారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడిన మా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించరని చెప్పారన్నారు. కానీ ఇవాళ రోజుకు ఇద్దరు, ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి వైయస్‌ జగన్‌ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక తలలు పట్టుకుంటున్నారన్నారు. వైయస్‌ జగన్‌ మాటలను వక్రీకరిస్తూ దూషణలు చేస్తున్నారన్నారు. పాదయాత్రను మొదట టీడీపీ అణచివేయాలని చూసిందని, అది దేదీప్యమానంగా ముందుకు సాగుతుంటే.. టీడీపీ కోటలకు బీటలుబారుతుండడంతో పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 

టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు అనేక కామెంట్లు చేశారని, కాంగ్రెస్‌ హయాంలో గాడితప్పిన యంత్రాంగాన్ని పట్టాలెక్కించానని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ నాలుగేళ్లలో పరిపాలనను కాదు.. చంద్రబాబు ఆయన కొడుకును మాత్రమే పట్టాలెక్కించారని, కానీ లోకేష్‌ పట్టాలెక్కినా ముందుకు సాగడం లేదన్నారు. అంబేద్కర్‌ను ఓడించిన కాంగ్రెస్‌ పార్టీ వైయస్‌ఆర్‌ సీపీలో ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబే కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చారని, గతంలో నాలో 70 శాతం కాంగ్రెస్‌ రక్తం ప్రవహిస్తుందని చెప్పిన మాటలు మరిచావా...? ప్రస్తుతం ఎంత పర్సెంట్‌ కాంగ్రెస్‌ రక్తం ప్రవహిస్తుందో చంద్రబాబు చెప్పాలన్నారు. 

ప్రభుత్వ పథకాలు బాధ్యతతో ఇస్తే మంచి ఫలితాలు వస్తాయన్న చంద్రబాబు అహంకారంతో ఇస్తున్నారా.. బాధ్యతతో ఇస్తున్నారో.. ఆలోచించుకోవాలని అంబటి సూచించారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ‘నేను వేసిన రోడ్లు.. నేను ఇస్తున్న బియ్యం.. నా రోడ్లపై తిరిగేవారు నాకే ఓట్లు వేయాల’న్న చంద్రబాబుకు ఇవాళ జరుగుతున్న కొత్త పరిణామాల వల్ల అహంకారం తగ్గిందా అని ప్రశ్నించారు. 

తెలుగుదేశం పార్టీని మళ్లీ గెలిపించడం చరిత్రాత్మక అవసరం అని చంద్రబాబు అనడం సిగ్గుచేటన్నారు. ఎప్పుడైనా మాటపై నిలబడిన సందర్భం ఒక్కటైనా చూపించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చి 650  హామీల్లో ఒక్కటైనా పరిపూర్ణంగా నెరవేర్చారా అని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఎన్ని పిల్లమొగ్గలు, మెలికలు తిరిగిన చంద్రబాబు గెలవాల్సిన అవసరం లేదన్నారు. మాట మీద నిలబడే లక్షణం లేదు.. అంతరాత్మ లేదు.. అలాంటి వ్యక్తి టీడీపీని నడిపిస్తున్న దౌర్భాగ్య స్థితిలో మళ్లీ గెలిపించాల్సిన అవసరం విలువలు కలిగిన తెలుగు ప్రజలకు లేదన్నారు. తెలుగుదేశం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించడం, భూస్థాపితం చేయడం.. సమాధానం కట్టడం చరిత్రాత్మక అవసరం అన్నారు. భూస్థాపితం చేసే అవకాశం తెలుగు ప్రజలకు వచ్చిందన్నారు. 
Back to Top