రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటుకు పంపొద్దు

హైదరాబాద్:

విభజన బిల్లును పార్లమెంట్‌కు పంపవద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి విజ్ఞప్తి చేస్తామని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ శాసనసభా‌ పక్ష నాయకురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ తెలిపారు. త్వరలో పార్టీ అధ్యక్షుడు ‌శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీ వెళ్లి రాష్ర్టపతిని కలుసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు శాసనసభ వేదికగా తాము శక్తి వంచన లేకుండా పోరాడామని, ఇక బిల్లు కేంద్రానికి వెళుతుంది కనుక ఢిల్లీ వెళ్లి విభజనను అడ్డుకునేందుకు గల ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటామని ఆమె చెప్పారు. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన తరువాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి వైయస్ఆర్ సీఎల్పీ కార్యాలయంలో‌ శ్రీమతి విజయమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

విభజన బిల్లు రాష్ట్రానికి రావడానికి, ఇప్పుడిలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారణం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే కారణం అని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. యుద్ధ విమానంలో ఆగమేఘాల మీద రాష్ట్రానికి వచ్చిన బిల్లును  ముఖ్యమంత్రి 17 గంటల వ్యవధిలోనే అసెంబ్లీకి వచ్చేలా చేశారని ఆమె గుర్తుచేశారు. బిల్లును అసెంబ్లీకి పంపేటపుడు ముఖ్యమంత్రికి అందులో లోపాలున్నాయనే సంగతి తెలియదనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంత ముఖ్యమైన విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే రోజున సీఎం తనకు ఆరోగ్యం బాగాలేక సభకు రాలేకపోయానని చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని శ్రీమతి విజయమ్మ దుయ్యబట్టారు. చంద్రబాబు అయితే వరుసగా వారం రోజుల పాటు మీడియా ముందు బిల్లులో లోపాలున్నాయని చెప్పానని అన్నారని, మరి శాసనసభ వేదికగా ఆ మాట ఎందుకు చెప్పలేకదని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. ఈ బిల్లుపై చర్చ వద్దని ఎందుకు డిమాండ్ చేయలేకపోయారని సూటిగా ప్రశ్నించారు.

నిజంగా ఇలాంటి నేతలు‌ రాష్ట్రంలో ఉండటం ప్రజల దౌర్భాగ్యం, దురదృష్టం అని శ్రీమతి విజయమ్మ వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరి కుమ్మక్కు, కుట్రల ఫలితంగానే రాష్ట్రానికి ఇలాంటి దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. బిల్లుపై చర్చించడం అంటే విభజనకు అంగీకరించినట్లే అని తొలి నుంచీ తమ పార్టీ నెత్తీ నోరూ బాదుకుని చెప్పినా పట్టించుకోకపోగా తమదే తప్పన్నట్లుగా నిందించారన్నారు.

అంతకు ముందు రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ ‌నిర్వహించాలని, బిల్లును తిరస్కరించి తిప్పి పంపాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ శాసనసభా‌ పక్ష నాయకురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం ఉదయం తెలుగుతల్లి విగ్రహం నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్ర చేశారు. విజయమ్మతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సచివాలయం, రవీంద్రభారతి, గన్‌పా‌ర్కు మీదుగా అసెంబ్లీ ఆవరణకు చేరుకున్నారు.

ఈ విలేకరుల సమావేశంలో ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత, బాలినేని శ్రీనివాసరెడ్డి, తెల్లం బాలరాజు, కొరుముట్ల శ్రీనివాసులు, భూమా శోభా నాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కె.చెన్నకేశవరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పినిపె విశ్వరూప్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకర్‌రావు, చదిపిరాళ్ల నారాయణరెడ్డి పాల్గొన్నారు.

Back to Top