మీ పాలనపై తీర్పు అడిగే దమ్ముందా..?

  •  అభివృద్ధి చేయలేక వైయస్‌ జగన్‌పై విమర్శలా
  • రాష్ట్రంలో మహిళా ఐఏఎస్‌లకు రక్షణ లేదు
  • ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారా..?
  • నంద్యాల ప్రజలు టీడీపీ తగిన గుణపాఠం చెప్పాలి
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
నంద్యాల: తన పాలనపై తీర్పు ఇవ్వమనే దమ్ము, ధైర్యం లేక ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేసుకుంటూ చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు నంద్యాల నడిరోడ్డు మీద తిరుగుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. పలానా అభివృద్ధి చేశాం మాకు ఓట్లు వేయండి అని చెప్పుకునే దుస్థితికి టీడీపీకి లేదన్నారు. అమరావతిలో కూర్చున్నా.. నంద్యాలలో కూర్చున్నా.. వైయస్‌ జగన్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పొద్దున లేస్తే టీడీపీ నేతలు సోమిరెడ్డి, దేవినేని ఉమా, ఆదినారాయణ, వర్ల రామయ్య నంద్యాలలో ప్రెస్‌మీట్లు పెట్టి బూతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తి చేశారు. నంద్యాల ప్రజలకు వారి పాపాల పుట్ట బహిర్గతం అవుతుందని టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారు.

బాబు సిగ్గుతో తలదించుకోవాలి
మూడున్నరేళ్ల చంద్రబాబు పరిపాలనలో జన్మభూమి కమిటీలు గ్రామాల్లో చేసిన అరాచకం, ఇసుక దోపిడీ, లోకేష్‌కు సూట్‌కేసులు, ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భూ కుంభకోనాలు, విశాఖ భూభాగోతం, తాత్కాలిక సచివాలయం, పట్టిసీమ, రాజధాని పేరుతో పారించిన కమీషన్ల అవినీతి బండారం బయటపడకుండా టీడీపీ జాగ్రత్త పడుతుందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారని, మహిళలకు గౌరవం లేకుండా పోయిందన్నారు. చివరకు మహిళా ఐఏఎస్‌ అధికారులు టీడీపీ మంత్రుల భారి నుంచి రక్షణ కల్పించాలని కేంద్రానికి మొర పెట్టుకున్నారన్నారు. ఏపీలో ఐఏఎస్‌ మహిళా అధికారుల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందంటే చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. 

విద్యార్థులతో బాబు బెదిరింపు సర్వేలు
నంద్యాలలో సర్వేల పేరుతో కొంత మంది విద్యార్థులను పంపించి చంద్రబాబు ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నాడని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో చంద్రబాబు చేసిన అరాచకం అంతా ఇంతా కాదన్నారు. బాబు అన్యాయానికి గురి కానీ మనిషి ఎరైనా ఉంటే చూపించాలన్నారు. ఎన్నికలు రాగానే ఉన్న గోడలు పగులగొట్టడం తప్ప, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నంద్యాలకు ఇది చేశామని చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు.నంద్యాల ఎన్నికను మాటల యుద్ధంగా మార్చి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావ్‌ దేవినేని చిన్నజీయర్‌ స్వామికి దండం పెడితే.. తప్పుగా కనిపించిందా..తప్పుగా కనిపించిందా దేవినేని ఉమా అని విరుచుకుపడ్డారు. దళితుడు, రాష్ట్రపతి అభ్యర్థికి నమస్కరిస్తే వైయస్‌ జగన్‌ లొంగిపోయాడని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయడం కాదు.. ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అని నిలదీశారు. నంద్యాలలో వైయస్‌ఆర్‌ సీపీ పోటీ పెట్టకుంటే ఇన్ని వరాలు కురిపించి ఉండేవారా.. కుప్పం కంటే మించిన ప్రేమను చంద్రబాబు నంద్యాలపై చూపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గమైనా ఏం పాపం చేసిందని, అక్కడ ఎమ్మెల్యేలు బ్రతికి ఉండడమేనా అని ఆరోపించారు. చంద్రబాబు తాను చేసిన అభివృద్ధిని రెఫరెండంగా తీసుకొని నంద్యాల ఎన్నికలకు వెళ్లాలని సూటిగా ప్రశ్నించారు. 

తాజా ఫోటోలు

Back to Top