అబద్ధాల చంద్రబాబు ఢిల్లీలో ప్రగల్భాలు

హైదరాబాద్, 3 అక్టోబర్ 2013:

చంద్రబాబు నాయుడు తన పరిపాలన గురించి బుధవారంనాడు ఢిల్లీలో ఎన్నో ప్రగల్భాలు చెప్పుకున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ. సోమయాజులు వ్యాఖ్యానించారు. భారతదేశానికి తానే సెల్‌ఫోన్లు తీసుకువచ్చినట్లుగా.. తన హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ మిగులు స్థితిలో ఉన్నట్లుగాను, తన పాలనలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందినట్లే ఇప్పుడు గుజరాత్‌లో మోడి చేస్తున్నట్లుగా చంద్రబాబు చెప్పుకోవడం లాంటి విచిత్రమైన చాలా విషయాలను ఆయన చెప్పుకుంటూ వచ్చారన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఆయన గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రరాష్ట్రం అవతరించిన తరువాత చంద్రబాబు అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ళలోనే ప్రభుత్వానికి రూ.22 వేల కోట్లు రెవెన్యూ లోటు వచ్చిందని సోమయాజులు గుర్తుచేశారు. అంత భారీగా విద్యుత్‌ చార్జీలు, పన్నులు, నీటి పన్నులు, మున్సిపల్‌ చార్జీలు పెంచినా ఇంత పెద్ద మొత్తంలో రెవెన్యూ లోటు రావడం గమనించాల్సిన విషయం అన్నారు. ఇంత భారీ లోటును తీసుకువచ్చి, తన బాటలోనే నరేంద్ర మోడీ నడుస్తున్నారని చెప్పుకోవడం చంద్రబాబుకు సిగ్గుచేటు అన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సహనం కోల్పోయి, తీవ్ర ఒత్తిడికి లోనవడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారని సోమయాజులు అన్నారు.

ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువని చంద్రబాబు భావిస్తున్నట్టున్నారని అన్నారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిగా సుఖ్‌రామ్‌ ఉన్నప్పుడు గ్లోబల్‌ కాంపిటేటివ్‌ బిడ్లు పిలిచి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సర్వీస్‌ ప్రొవైడర్‌ ఉండేలా చేసిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. మన దేశంలో సెల్‌ఫోన్‌ సేవలు అందుబాటులోకి రావడంలో చంద్రబాబు నాయుడి ప్రమేయం అసలేమీ లేదన్నారు. సర్వీస్‌ ప్రొవైడర్ల మధ్య మొదట్లో రెవెన్యూ పంపకంగా ఉన్న విధానాన్ని చంద్రబాబు మద్దతిచ్చిన ఎన్డీయే ప్రభుత్వం లాభం పంపకంగా మార్చిందన్నారు. ఈ లోపాయికారీ ఒప్పందం చంద్రబాబు నాయుడి ధర్మమే అని ఆయన ఒప్పుకుని తీరాల్సిందే అన్నారు. అందుకే చంద్రబాబు నాయుడి కాలంలో సెల్‌ఫోన్‌ అంటే ఒక ఎలక్ట్రిక్‌ షాక్‌లా ఉండేదన్నారు. సెల్‌ఫోన్‌ కాల్‌ రిసీవ్‌ చేసుకోవాలంటే నిమిషానికి రూ.8, ఫోన్‌ చేయాలంటే రూ.8 ఉండేదని సోమయాజులు గుర్తుచేశారు.

చంద్రబాబు హయాం 1999 - 2004 మధ్యలో కనీసం ఐదారు సార్లు విద్యుత్ ఛార్జీలు‌ పెంచిన విషయం మరిచారా అంటూ చంద్రబాబు నాయుడిని సోమయాజులు ప్రశ్నించారు. ప్రజలు కొనుక్కోలేని ధరలు పెడితే ఏదైనా మిగులు ఉంటుందన్నారు. దానికి ఉదాహరణగా బియ్యం కిలో రూ. 300 చేస్తే అది తప్పకుండా మిగులు ఉంటుందన్నారు. చంద్రబాబు నాయుడి హయాంలో విద్యుత్‌ను ఎవరూ కొనుక్కోలేని విధంగా ధరలు పెంచేశారని సోమయాజులు విమర్శించారు. కరెంట్ ఛార్జీలు పెంచిన‌ందువల్లే 2009 తరువాత ఏ ఎన్నికల్లో కూడా టిడిపి గెలవడం లేదనే అంశాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు.

తెలంగాణ రావాలని ప్రణబ్‌ ముఖర్జీ కమిటీని చంద్రబాబు కోరారని, దానికి అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చారని, 2009 డిసెంబర్ 7న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక తెలంగాణ రావాలని కోరుకున్నారని సోమయాజులు గుర్తుచేశారు. 2012 డిసెంబర్ 20 నాటి అఖిలపక్ష సమావేశంలో కూడా అదే కోరాన్నారు. తన కోరిక మేరకు ఢిల్లీలో ఉండి చక్రం తిప్పి ఈ రోజు తెలంగాణ నోట్‌ను కేంద్ర కేబినెట్‌ పెట్టిస్తున్న చంద్రబాబును ప్రశంసించక తప్పదని ఎద్దేవా చేశారు.

Back to Top