సీఎన్ఎన్‌- ఐబీఎన్ సర్వే మోసపూరితం

హైదరాబాద్, 2 ఏప్రిల్ 2014:

మొత్తం 23 లోక్‌సభా నియోజకవర్గాల్లో కేవలం 1300 మంది నుంచి మాత్రమే అభిప్రాయాలు తీసుకుని సీఎన్ఎన్- ఐబీఎన్- సీఎస్‌డీఎస్‌ చేసిన సర్వే మోసపూరితం, కుట్రపూరితం అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి నిప్పులు చెరిగారు. ఈ సర్వే ద్వారా ఆ సంస్థ ప్రజలను ఏప్రిల్‌ ఫూల్సును చేసిందని దుయ్యబట్టారు. పతన దశలో ఉన్న టీడీపీని, చంద్రబాబు నాయుడిని భూతద్దంలో చూపించి హైప్‌ సృష్టించేందుకే సీఎన్ఎన్- ఐబీఎన్‌ సర్వే ప్రయత్నించిందన్నారు. వాస్తవాలకు దగ్గరగా ఈ సర్వే ఫలితం లేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మైసూరారెడ్డి మాట్లారు.

సీఎన్ఎన్- ఐబీఎన్- సీఎస్‌డీఎస్ సంస్థ సర్వేకు ఏమాత్రం విశ్వసనీయత లేదన్నారు. ఇంత దగా సర్వేను తానెప్పుడూ చూడలేదన్నారు. సీఎన్ఎన్- ఐబీఎన్‌ సర్వే తప్పులతడక అని ఆ చానల్‌ చర్చలో పాల్గొన్నవారే అన్నారని ఆయన ప్రస్తావించారు. ఇదంతా కుట్రపూరిత సర్వే అన్నారు. ఇది అసలు సర్వేనే కాదు.. ఏసీ రూముల్లో కూర్చుని చేసిన అంకెల గారడీ అని మైసూరారెడ్డి అభివర్ణించారు. ఇతరులకు 14 శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వే పేర్కొందని, అయితే ఆ ఓట్లు ఏ పార్టీకి వస్తాయో సీఎన్ఎన్- ఐబీఎన్- సీఎస్‌డీఎస్‌ సంస్థ వెల్లడించగలదా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తే.. ఈ సారి ఒకేసారిగా 14 శాతం వస్తాయని చెప్పడమే మోసపూరితం అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నంలో భాగమే ఈ సర్వే అన్నారు.

గత సర్వేలో లోక్‌సభ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీకి 45 శాతం, టీడీపీకి 33 శాతం ఓట్లు వస్తాయని సీఎన్ఎన్‌- ఐబీఎన్‌ పేర్కొన్న వైనాన్ని మైసూరారెడ్డి గుర్తుచేశారు. ఈ రెండు పార్టీ మధ్య 12 శాతం తేడా ఉందన్నారు. సీఎన్ఎన్- ఐబీఎన్‌ సర్వేలో ఒక్క శాతం కూడా వాస్తవం లేదన్నారు.

సీఎన్ఎన్- ఐబీఎన్, ఈనాడులో పెట్టుబడులు పెట్టింది ఒక్కరే అని అందరికీ తెలిసిందే అన్నారు. టీడీపీకి పెద్ద ఎత్తున ఓట్ల శాతం పెరిగితే జనసేన, లోక్‌సత్తా పార్టీల కలుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఛీ పొమ్మని బీజేపీ అంటున్నా ఎందుకు ఆ పార్టీ కాళ్ళా వేళ్ళా పడుతోందని మైసూరారెడ్డి ప్రశ్నించారు. నీల్సన్‌ సర్వే వాస్తవానికి దగ్గరగా ఉంటే టీడీపీ నాయకులు బురద జల్లుతున్నారని మైసూరారెడ్డి విమర్శించారు.

Back to Top