చిరంజీవి హోల్‌సేల్! బాబు రిటేల్!!


కర్నూలు 21 నవంబర్ 2012 : పార్టీని చిరంజీవి "హోల్‌సేల్‌"గా అమ్ముకున్నారనీ, ఆ డబ్బు రూ.80 కోట్లు మంచం కింద దొరికినా కేసులు, అరెస్టులూ ఉండవనీ వైయస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్.విజయమ్మ విమర్శించారు. పైగా "బహుమానం"గా చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారని ఆమె వ్యంగ్యంగా అన్నారు. ఇక చంద్రబాబు "రిటేల్‌"గా పార్టీని కాంగ్రెస్‌కు అమ్ముకున్నారన్నారు. షర్మిల పాదయాత్ర సందర్భంగా కర్నూలులో బుధవారం రాత్రి జరిగిన ఒక భారీ బహిరంగసభలో ఆమె ప్రసంగించారు. 1999 నుండి 2012 వరకూ గడచిన పదమూడేళ్లలో ప్రజలు శిక్ష విధిస్తున్నా చంద్రబాబుకు అది అర్థం కావడం లేదనీ, బుద్ధి రావడం లేదనీ ఆమె వ్యాఖ్యానించారు. 2012లో యాభై అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే సగం స్థానాల్లో చంద్రబాబు పార్టీకి డిపాజిట్లు రాలేదని ఆమె గుర్తు చేశారు. ప్రజానాయకులను గురించి చంద్రబాబు అన్యాయంగా మాట్లాడుతున్నారన్నారు. జగన్ బాబు టన్నుల కొద్దీ డబ్బు పెట్టి ఎమ్మెల్యేలను కొంటున్నాడంటున్నారనీ, మరి ఆనాడు ఎన్టీఆర్ పార్టీలో చేరిన చంద్రబాబు ఎన్ని కోట్లు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. వైస్రాయ్ కుట్రలో ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లు పెట్టి కొన్నారని ఆమె నిలదీశారు. 'అవిశ్వాసం' పెట్టకుండా ఉండేందుకు అంటకాగి, లాలూచీ పడి కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్ని కోట్లు తీసుకున్నారని విజయమ్మ ప్రశ్నించారు.
"ఆ రోజు చక్రం తిప్పానన్నాడు. అప్పుడు చక్రం తిప్పాడో లేదో కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ చక్రమైతే చంద్రబాబే తిప్పుతు న్నాడు" అని ఆమె ఎగతాళి చేశారు. విశ్వసనీయత గురించి చంద్రబాబుకు చెప్పాలనుకుంటున్నాననీ, బిడ్డలకు తల్లిదండ్రుల మీద ఉండే నమ్మకంలాంటిది విశ్వసనీయత అనీ ఆమె అన్నారు. రాజశేఖర్ రెడ్డిగారు ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకున్నారనీ, ఆయన లేడని తెలిశాక 700 మంది చనిపోయారనీ, అదీ ప్రజల కుండే విశ్వసనీయత అనీ ఆమె వ్యాఖ్యానించారు. నల్లకాలువ మాటకు కట్టుబడి ఓదార్చారనీ, ప్రజల కోసం దీక్షలు చేశారనీ అది జగన్ బాబుకు ఉండే విశ్వసనీయత అనీ ఆమె అన్నారు. రాష్ట్రానికి జగన్ బాబు దశ, దిశ నిర్దేశిస్తారనే వివిధ పార్టీల నుండి నాయకులు వచ్చి చేరుతున్నారని విజయమ్మ పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుని, మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తానని చెప్పి ఆ తర్వాత ప్లేటు ఫిరాయించాడన్నారు. ఎన్టీఆర్ రెండు రూపాయల కిలోబియ్యం, మద్య నిషేధం పథకాలను చంద్రబాబు నీరుగార్చారని ఆమె గుర్తు చేశారు. జగన్‌బాబును అన్యాయంగా జైలులో పెట్టారన్నారు. అయితే త్వరలోనే బయటకు వచ్చి జగన్‌బాబు రాజశేఖర్ రెడ్డిగారి సువర్ణయుగాన్ని తిరిగి తెస్తాడన్నారు. వైయస్ ప్రతి కలా నెరవేరుతుందని భరోసా ఇచ్చారు.
"నీ కొడుకు ఎందుకు జైలులో ఉన్నారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతున్నారు. నేనూ అదే అడుగుతున్నా. నా కొడుకు ఏ నేరం చేశాడని జైలు పాలు చేశారు. ఏ కోర్టు జగన్‌బాబు దోషి అని చెప్పింది?" అని విజయమ్మ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో నే ఉండి ఉంటే జగన్ కేంద్రమంత్రి అయ్యేవాడనీ, సిఎం కూడా అయ్యుండేవాడనీ సాక్షాత్తూ గులాం నబీ ఆజాద్ చెప్పింది వీళ్లు వినలేదా?" అని ఆమె వ్యాఖ్యానించారు.
పద్దెనిమిది అంశాలపై తాను ప్రజాప్రయోజన వ్యాజ్యం వేస్తే నెల రోజుల్లోపు దర్యాప్తు జరిపి నివేదిక ఇమ్మంటూ కోర్టు ఆదేశించిందనీ, అయితే సిబ్బంది లేదంటూ సిబిఐ తాత్సారం చేయడంతో బాబు మద్దతుదారులు ఆ లోపు స్టే తెచ్చుకున్నారనీ ఆమె గుర్తు చేశారు. బతుకంతా స్టే తెచ్చుకుని చీకట్లో మేనేజ్ చేసుకుంటే నిర్దోషి అయినట్లేనా? అని ఆమె ప్రశ్నించారు.నిప్పులాంటివాడినని చెప్పుకుంటున్న చంద్రబాబును ఏ కోర్టు విచారించి నిర్దోషి అని తేల్చిందో చెప్పాలని ఆమె నిలదీశారు.జగన్‌బాబు విషయంలో కోర్టు ఆదేశాలు వెలువడిందే తరువాయి 24 గంటల్లోనే 28 టీములతో సిబిఐ విరుచుకుపడిందన్నారు.
వెన్నుపోటు అనగానే గుర్తొచ్చే పేరు చంద్రబాబేనని ఆమె ఎద్దేవా చేశారు. నిజం చెప్పండి! తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌దా? మీదా? అని విజయమ్మ సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు.చంద్రబాబు పాత్ర ఉన్న ఐఎంజి, ఎమ్మార్, రిలయన్స్ గ్యాస్ తదితర కుంభకోణాలను ఆమె ప్రస్తావించారు. మళ్లీ అధికారం కోరుతున్న చంద్రబాబు మళ్లీ తన వెనుకటి పాలన అందిస్తాడేమోనని జనం భయపడుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి ఆమె గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వైయస్ సంక్షేమపథకాలకు తూట్లు పొడుస్తోందని ఆమె విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ప్రజాకంటకంగా మారిందన్నారు. ఆర్టీసీ, కరెంటు చార్జీలు, గ్యాస్ ధర పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగిపోయాయన్నారు.
సభకు భారీ యెత్తున జనం హాజరయ్యాయి. జగన్ పేరు ప్రస్తావించినప్పుడల్లా జనం కేరింతలు కొట్టారు. చంద్రబాబును విజయమ్మ పదునైన మాటలతో విమర్శించినప్పుడూ జనం ఈలలు వేశారు. చప్పట్లు కొట్టారు.

Back to Top