గురువులకు బాబు పంగనామాలు

అధికారంలోకి వస్తే అవిచేస్తాం ఇవి చేస్తాం అంటూ అనేక కబుర్లు
చెప్పిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గద్దెనెక్కగానే వాగ్దానాలన్నిటినీ
బుట్టదాఖలా చేసేశారు. ఏడాది గడిచిపోయినా ఇంతవరకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఒక్క
చర్య తీసుకున్న దాఖలా లేదు. తనను నమ్ముకుని ఓటేసిన గురువులకు చంద్రబాబు అలా పంగనామాలు
పెట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉపాధ్యాయులు సోమవారం నాడు అన్నిజిల్లాల కలెక్టరేట్ల
ఎదుట ధర్నాలు చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలలో
ఉపాధ్యాయులు విశేషంగా పాల్గొన్నారు. ధర్నా అనంతరం ఉపాధ్యాయుల సమస్యలపై కలెక్టర్లకు
వినతిపత్రాలను సమర్పించారు. ఉపాధ్యాయుల ప్రధానమైన డిమాండ్లు ఏమిటంటే...
 • ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు,
  పెన్షనర్లు 10వ పీఆర్‌సీ కోసం ఎదురుచూస్తున్నారు.
  2013 జులై 1 నుంచి పీఆర్‌సీ అమలు కావలసి
  ఉంది. దానిపై రాష్ర్టప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదే తప్ప స్పష్టమైన ఆదేశాలు జారీ
  చేయడం లేదు.
 • తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆర్భాటంగా
  43శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు
  నాయుడు ఆరునెలలవుతున్నది. ఫిబ్రవరిలో ప్రకటన చేసి ఊరుకున్నారు తప్ప ఇంత వరకు జీవో జారీ
  చేయలేదు. వెంటనే జీవో జారీ చేసి ఉంటే కనీసం ఏప్రిల్‌నెల జీతాలతోనైనా పెరిగిన మొత్తాన్ని
  ఉపాధ్యాయులు అందుకునేవారు. కానీ కావాలనే రాష్ర్టప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
 • వేసవి సెలవుల్లో బదిలీ ప్రక్రియ
  పూర్తి చేస్తామని రాష్ర్టప్రభుత్వం ఏటా ప్రకటించడమే తప్ప అమలు చేసిందే లేదు. రెండేళ్ల
  నుంచి బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. 2013లో రాష్ర్టప్రభుత్వం
  పెట్టిన రిలీవర్ నిబంధన వల్ల తీవ్ర గందరగోళం నెలకొంది. రిలీవర్ వచ్చిన తర్వాతే రిలీవ్
  కావాలన్న నిబంధన వల్ల చాలాచోట్ల బదిలీలు నిలిచిపోయాయి. ఇంతవరకు రాష్ర్టవ్యాప్తంగా 1200 మంది వరకు ఉపాధ్యాయులు రిలీవ్ కాకుండా నిలిచిపోయారు. వారికోసం ప్రత్యేకంగా
  ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉన్నా రాష్ర్టప్రభుత్వం పట్టించుకోవడమే లేదు.
 • ఎన్ని విజ్ఞప్తులు చేసినా 2014లో బదిలీలు జరపలేదు. 2015 వేసవిలో బదిలీలు, రేషనలైజేషన్ పూర్తిచేస్తామని చెప్పినా ఇంతవరకు షెడ్యూల్ విడుదల కాలేదు. ఈ బదిలీల
  ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని రాష్ర్టంలోని 2.5 లక్షల
  మంది ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. అయితే పూర్తిస్థాయి బదిలీలను ఆపేసి ఓ వెయ్యిమంది
  బదిలీల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. తమకు
  కావలసినవారిని, కావలసిన చోటకు బదిలీ చేసే ఈ వెయ్యి దొడ్డిదారి
  బదిలీలను వెంటనే నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలెదురవుతాయని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
 • ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులకు హెల్త్
  కార్డులు వెంటనే మంజూరు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది. జబ్బు చేస్తే
  చికిత్స చేయించుకుని ఆ బిల్లులో అర్హతను బట్టి కొంత మొత్తాన్ని మెడికల్ రీయింబర్స్‌మెంట్
  ద్వారా తిరిగి పొందే సదుపాయం ఉంది. అయితే ముందు చికిత్సకు డబ్బు కట్టలేనివారే ఎక్కువమంది
  ఉన్నారు. బిల్లుల మంజూరు, రీయింబర్స్‌మెంట్ కోసం కార్యాలయాల చుట్టూ
  తిరగాల్సి వస్తున్నది. ఆ విధానానికి స్వస్థి చెప్పి ఉద్యోగులతో పాటు తమకూ హెల్త్ కార్డులు
  మంజూరు చేయాలని, కార్పొరేట్ ఆసుపత్రులతో ఉచిత వైద్యసదుపాయాన్ని
  కల్పించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
Back to Top