ఛార్జీలపై కదం తొక్కిన వైయస్ఆర్ సీపీ

పిఠాపురం: బస్సు చార్జీలపెంపుపై వైయస్ఆర్‌ సీపీ నేతలు మంగళవారం పిఠాపురంలో వినూత్న నిరసన నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి రిక్షాలతో మున్సిపల్ కార్యాలయం, కోటగుమ్మం, ఉప్పాడ సెంటర్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రాస్తారోకో, ధర్నా కార్యక్రమాల్లో వైయస్ఆర్‌ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని బస్సు చార్జీల పెంపుపై నిరసన గళమెత్తారు. ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని, బస్సు చార్జీలను తగ్గించాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం వెంటనే గద్దెదిగాలని డిమాండ్ చేశారు. ప్రజల బాధలు పట్టని ప్రభుత్వాలు పతనం కాక తప్పదన్నారు. ఈ ఆందోళనకు మద్దతుగా పలువురు ప్రయాణికులు కూడా ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం వారంతా ఆర్టీసీ బస్‌కు ఒక వినతిపత్రం అందజేశారు.

Back to Top