జిఒఎం గోబ్యాక్ అనే దమ్ము బాబుకు ఉందా?

హైదరాబాద్ :

రాష్ట్రాన్ని అడ్డగోలుగా, నిరకుశంగా విభజించే ప్రక్రియను ఖరారు చేసేందుకే కేంద్రం ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందా (జిఒఎం)న్ని గో బ్యాక్ అనే దమ్ము ‌టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఉందా అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ సవా‌ల్ చేసింది. రాష్ట్ర విభజనకు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పకుండా దీక్ష చేయడంలో అర్థమేమిటని ప్రశ్నించింది. తమ పార్టీలాగా స్పష్టమైన వైఖరి తీసుకోకుండా దీక్షలు, ప్రసంగాలతో దాటవేయడం ఎందుకని చంద్రబాబును నిలదీసింది.

పార్టీ అధినే శ్రీ ‌వైయస్ జగన్మోహన్‌రెడ్డి సమైక్య దీక్షను పోలీసులు బుధవారం అర్ధరాత్రి భగ్నం చేసి నిమ్సు ఆస్పత్రిలో వైద్యం అందజేస్తున్న విషయం తెలిసిందే. ఆస్పత్రిలో ఉన్న శ్రీ జగన్‌ను పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గురువారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేస్తున్నది ఎందుకోసమో ఆయనతో కూర్చున్న వారికైనా స్పష్టంగా తెలుసా? అని ఈ సందర్భంగా అంబటి ప్రశ్నించారు. తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం అన్నట్లుంది బాబు వైఖరి అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మేం జిఒఎంను గో బ్యాక్ అన్నాం. అలా అనే దమ్ముందా చంద్రబాబూ? అని సవాల్‌ చేశారు. ‌జిఒఎంపై చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీలాగా ఎందుకు స్పష్టంగా వైఖరి ప్రదర్శించరన్నారు? బాబూ.. విభజనకు వ్యతిరేకం అనవు, సమర్థించవు... మరి ఎందుకు దీక్ష చేస్తున్నట్లు? అని నిలదీశారు. విభజన అనే పెద్ద సమస్యపై స్పందించవు.. నోరు విప్పితే శ్రీ జగన్‌కు బెయిల్ ‌వచ్చిందనే అక్కసును వెళ్ళగక్కడమేమిటన్నారు.

‌'శ్రీ జగన్ బెయిల్‌‌ రావడంతో టిడిపి ఖాళీ అవుతుందనే భయపడుతున్నావా చంద్రబాబూ? అలాగైతే ఆ పార్టీ ఎందుకు? దానికి అధ్యక్షుడిగా నువ్వు ఎందుకు? ఒక వ్యక్తికి బెయిల్ దొరికితే ఇంత కంగారు అవసరమా?’ అని అంబటి నిలదీశారు.

నెల వ్యవధిలోనే రెండుసార్లు నిరాహార దీక్ష చేయడంతో శ్రీ జగన్ చాలా నీరసంగా ఉన్నారని‌ అంబటి రాంబాబు చెప్పారు. నిరంకుశంగా దీక్షను భగ్నం చేసిన కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల వైఖరి సరికాదన్నారు. దీక్ష చేస్తున్నవారి ఉద్దేశాన్ని పరిశీలించి, అందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాలే తప్ప దౌర్జన్యంగా భగ్నం చేయడం సరికాదన్నారు. శ్రీ జగన్ దీక్షను భగ్నం చేసినప్పటికీ ఆయన సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తారని అంబటి చెప్పారు.

‌ఈ నెల 19వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో తమ పార్టీ తలపెట్టిన సమైక్య శంఖారావం సభను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహిస్తామని అంబటి స్పష్టం చేశారు. ఆ సభతో కేంద్రం మెడలు వంచుతామని అన్నారు. 60- 70 శాతం మంది ప్రజలు సమైక్యాంధ్ర కోరుతున్నా పట్టించుకోకుండా.. 17 ఎం.పి. స్థానాల కోసం రాష్ట్రాన్ని విడదీయడం ఏమిటని అంబటి ప్రశ్నించారు.

సమైక్య శంఖారావం సభతో సమైక్య ఆవశ్యకతను చాటుతాం: వాసిరెడ్డి

వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ఈ నెల 19న నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభతో ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా కొనసాగించాల్సిన ఆవశ్యకతను చాటుతామని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ చెప్పారు. శ్రీ జగన్‌ను నిమ్సులో పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి దీక్షను భగ్నం చేయగలిగారే తప్ప రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ఆయన సంకల్పాన్ని భగ్నం చేయలేరని అన్నారు.

పలువురు పార్టీ నాయకుల పరామర్శ :
నిమ్సులో ఉన్న శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు పార్టీ నాయకులు బుధవారంనాడు పరామర్శించి.. ఆయన ఆరోగ్య స్థితి గురించి వాకబు చేశారు. శ్రీ జగన్‌ మాతృమూర్తి శ్రీమతి విజయమ్మ, సతీమణి శ్రీమతి భారతి, సోదరి శ్రీమతి షర్మిల, పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ,‌ బి. జనక్ ప్రసాద్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

Back to Top