బైరెడ్డి ఉద్యమం: బాబుకు సంకటం

తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా తెలుగు దేశం పార్టీ లేఖ ఇస్తుందని  చెప్పిన అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మింగుడుపడని పరిణామమిది. ఈ ప్రకటన చేసి అలా విదేశీ పర్యటనకు వెళ్ళారో లేదో రాయలసీమకు చెందిన ఆ పార్టీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంచుమించుగా ఆయనను సవాలు చేసినట్లుగానే వ్యవహరించారు. ఉంటే రాష్ట్రం సమైక్యంగా ఉండాలి.. లేదా తెలంగాణతో పాటు రాయలసీమ రాష్ట్రం కూడా ఏర్పడాలి.. స్థూలంగా చూస్తే తెలుగు మాట్లాడే ప్రజలు మూడుగా విడిపోవాలి. అని ఆయన డిమాండు చేస్తున్నారు. ఇకపై త్యాగాలను చేయదలచుకోలేదన్నదీ కూడా ఆయన స్పష్టంచేస్తున్నారు. ఇదీ ఈ పరిణామపు గూఢార్థం.

రాజధానిలో నిర్వహించిన రాయలసీమ ప్రాంతీయుల సదస్సులో ఆయన వైఖరి దీనినే ఆవిష్కరించిందనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.  1956లో కర్నూలు రాజధానిగా ఉన్న రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఇప్పటికే తప్పు చేశామనీ, మరోసారి అటువంటి తప్పిదానికి తావీయమనీ సదస్సులో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి బైరెడ్డి కుండబద్దలుకొట్టారు. తెలంగాణ రాష్ట్ర మద్దతుదారుడు, ఎమ్మెల్సీ అయిన కె. దిలీప్­కుమార్, రాయలసీమ ప్రాంతానికి చెందిన పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రమణారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవడం ఆసక్తిని రేకెత్తించింది.

రాయలసీమకు ఇంతవరకూ జరిగిన అన్యాయం చాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కూడా అయిన రాజశేఖరరెడ్డి స్పష్టం చేస్తున్నారు.  కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేయాలనేది ఆయన డిమాండు. తిరుపతి, నంద్యాల, ప్రొద్దుటూరు, గుంతకల్, హిందూపూర్­లను జిల్లాలుగా మార్చాలనేది  ఆయన అభిప్రాయం. ఈ ప్రాంతంలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టులనూ పూర్తిచేసి, తెలుగు గంగ పథకానికి అదనంగా 32 టీఎంసీల నీటిని కేటాయించాలనీ, భారత సైనిక దళంలో రాయలసీమ విభాగాన్ని ప్రారంభించాలనీ, మదనపల్లెలో ఐటీ పార్కు, అనంతపురంలో సైన్సు సిటీ, మదనపల్లె, బెంగళూరు మధ్య రైల్వే లైను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వాన్ని కోరుతూ సదస్సులో తీర్మానించారు.  ఈ నెలారంభంలో నాలుగురోజుల పాటు   'రాయలసీమ అవగాహన దీక్ష'ను చేసిన రెడ్డి ఈ ప్రాంతంలో 40రోజుల పాటు 800 కిలోమీటర్లు పాదయత్ర నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు. పాదయత్ర అనంతపురంలో ముగుస్తుంది. ఈ సందర్భంగా పెద్ద బహిరంగ సభనూ నిర్వహించనున్నారు.

చంద్రబాబు విదేశీ పర్యటననుంచి వచ్చీ రాగానే ఎదురయ్యే బైరెడ్డి పాదయాత్ర పరిణామాన్ని ఎలా ఎదుర్కోబోతారనేది ప్రస్తుతం ఆసక్తిరేకెత్తిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా మరోలేఖ ఇస్తానన్న ఆయన  ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర డిమాండును లేవనెత్తిన రాజశేఖరరెడ్డిపై చర్య తీసుకుంటారా... లేక రెండు కళ్ళ సిద్ధాంతానికి మరో కంటిని కూర్చి త్రినేత్ర విధానాన్ని పాటిస్తారా వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఈయనపై చర్య చేపడితే రాయలసీమలో ఇబ్బంది, కూడదంటే తెలంగాణ ప్రాంతంలో తంటా వచ్చి పడుతుంది. ఈ దశలో బాబు రాయలసీమ అడుగులకు మడుగులొత్తుతారా.. లేక తెలంగాణలో కోటి రతనాల వీణను మీటుతారా.. త్వరలోతేలిపోతుంది.  ఇది బాబు మార్కు మరో ఎత్తుగడ కాదు కదా... అనే వారూ లేకపోలేదు.

Back to Top