పత్రికా స్వేచ్ఛపై అవగాహనుందా బాబూ!

హైదరాబాద్, 13 జూన్ 2013:

సాక్షి మీడియాను తన సమావేశాలకు రావద్దని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు తప్పుపట్టారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో చంద్రబాబుకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కు అలవాటు పడ్డ  చంద్రబాబు మాట్లాడే హక్కు ఎక్కడినుంచి వస్తుందో చెప్పబోయిన ధోరణిలో మాట్లాడిన విధానం తప్పని ఎత్తిచూపారు. సాక్షి  ప్రెస్ తన సమావేశాలకు రానవసరం లేదనడాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా విఖ్యాత నాయకులు చెప్పిన 200 ఏళ్ళ నాటి మాటలను చదివి వినిపించారు.  జూపూడి విలేకరుల సమావేశం  ఆయన మాటల్లోనే...'చరిత్ర తెలియకపోతే.. అది బాబు  ఇష్టం. ప్రతిపక్షనేతగా, ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోనూ, దేశంలోనూ చక్రం తిప్పానని చెప్పుకుంటున్న మీరు  సాక్షిని చూసి బెంబేలెత్తారు.. వ్యతిరేకించారు.. అని మండిపడ్డారు. సాక్షి పత్రిక రావడానికి, ఇలాంటి పత్రికలు ఉండడానికి వీల్లేదన్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తేనా! ఆయనకు పత్రికా స్వేఛ్చ మీద అవగాహన ఉందా. సాక్షిని నిషేధించాలనడం దేనికి సంకేతం. వార్తలు సేకరించే వారు ఎన్నో ప్రశ్నలు వేస్తారు. అందుకు బెంబేలు పడి చంద్రబాబు ఇలా వ్యవహరించడం ఆశ్చర్యం కాదు. ఈ సంఘటనతో బాబుకు సాక్షి మీద ఎంత కక్ష ఉందో వెల్లడైంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అందరితోనూ నవ్వుతూ మాట్లాడేవారు. తెలియనిది చెబితే నేర్చుకుంటాననేవారు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా తెలిసిన వారు తెలియచెబితే నేర్చుకోవాలి. మిమ్మల్ని కొన్ని పత్రికలు ఆకాశానికి ఎత్తి ఉండవచ్చు. కాని అది నిజం కాదు. ప్రజాస్వామ్య విలువల్ని తోసిరాజని సాక్షిని రావద్దనడం మీ అవివేకానికి నిదర్శనం. ప్రతిపక్షంలో  ఉన్న మీకు అధికారంలోకి రావాలనే యోచన ఉంటే.. ఇలా వ్యవహరించకూడదు.

అధికారంలో లేని పార్టీకి చెందిన పత్రికని చంద్రబాబు టార్గెట్ చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. ఐ న్యూస్ చానెల్నో, జీ 24 గంటలు చానల్నో లక్ష్యంగా చేసుకుంటే బాగుండేది. చంద్రబాబు తీరు సరి  కాదు. నీళ్ళు చల్లుకుంటూ చేసిన మీ పాదయాత్రను సాక్షి ప్రచురించిందా లేదా. మినీ మహానాడు వార్తలను చూపించలేదా. వ్యాఖ్యానాలు వేరు.  వార్తలు వేరు. జర్నలిజం లోని ఈ వ్యత్యాసాన్ని బాబు గమనించాలి. తెలుసుకోకలేకపోతే అది ఆయన విచక్షణకే విడిచిపెపడుతున్నాం.  పత్రికలో మీకు నచ్చిన వార్తే రావాలనుకోకూడదు. మీకు అవసరం లేని వార్త సమాజానికి అవసరం కావచ్చు. దీనిని చంద్రబాబు గమనించాలి. జర్నలిజం ఓ నిరంతర యంత్రం. సాక్షి పత్రిక మీకు నచ్చినదే  రాయాలనుకోవడం అవివేకం. సాక్షి మీద మీకు పగ, కక్ష ఉంటే అది వేరు. దానిని మూసివేయడం మీ వల్ల కాదు కదా మీ తాత వల్ల కూడా కాదు. అబ్రహం లింకన్ let the people know the facts.. the country will be safe(ప్రజలకు వాస్తవాలు తెలియాలి.. దానివల్ల దేశం పటిష్టంగా ఉంటుంది) అన్నారు.  ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి.

పత్రికలు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదా చంద్రబాబు. కొన్నిసార్లు వాళ్ళు మీకు నచ్చని విషయాలను  చెప్పచ్చు ...అలాంటి పత్రికలు ఉండకూడదనుకోకూడదని చర్చిల్ చెప్పిన విషయం మీకు తెలుసా?. ఈ వార్త రాయాలి అని చెప్పడం తప్పు బాబూ! నిజాన్ని చెప్పడాన్ని పాత్రికేయులు బాధ్యతగా తీసుకోవాలి. ఈ విషయంలో టీడీపీ వాళ్ళు పాఠం నేర్చుకోకపోతే ప్రజలే వాళ్ళకు బుద్ధి చెబుతారు. మొదట్లో సాక్షి పత్రికకి ప్రకటనలు ఇవ్వద్దని బాబు చెప్పారు. దివంగత మహానేత వైయస్ఆర్ ఎప్పడూ అలా చెప్పలేదు. తెలియని విషయాలు చెప్పండి పాటిస్తాననన్నారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. అలాంటి వ్యక్తికి రాజకీయ పార్టీకి నాయకత్వం వహించే అర్హత లేదు. సాక్షిపై మీ పెత్తనం కుదరదు. అహంకార పూరిత, అప్రజాస్వామిక విధానం ఎక్కడున్నా ఖండనీయం. జర్నలిజం గొంతు నొక్కే ప్రయత్నం శోచనీయం.  పార్టీ వేరు.. సాక్షి వేరు..మీరు అనుసరిస్తున్నది ప్రజాస్వామ్య పద్ధతి కాదని చెబుతున్నాం. మీకు అవగాహన కల్పించాల్సని బాధ్యత మాపై ఉంది. '

Back to Top