బాబు అండతో రెచ్చిపోతున్న కిరణ్

ఏన్కూరు (ఖమ్మం జిల్లా), 2 మే 2013: చంద్రబాబు నాయుడి అండ చూసుకుని సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి రెచ్చిపోతున్నారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న కిరణ్‌ ప్రజలకు ఏమీ చేయడంలేదని విమర్శించారు. ఒక పక్కన ప్రభుత్వాన్ని నోటికి వచ్చినట్టల్లా విమర్శలు చేస్తూనే చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం సమయంలో దానికి కొమ్ముకాసిన వైనాన్ని ఆమె తూర్పారపట్టారు. మహానేత వైయస్‌ జీవించి ఉంటే వైరా రిజర్వాయర్‌ నుంచి పైపులైన్‌ ద్వారా నీరు అందించేవారన్నారు.  అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచకుండా జనరంజకంగా వైయస్‌ఆర్‌ పరిపాలన సాగించారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె గురువారం రాత్రి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని ఏన్కూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.

మహానేత వైయస్‌ హయాంలో రైతు రాజులా బతికాడని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల బాగు గురించే ఆయన ఆలోచించారన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని వైయస్‌ అద్భుతంగా నిర్వహించారన్నారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఫోన్‌ చేసిన 20 నిమిషాలకే కుయ్..కుయ్..కుయ్ అంటూ 108 వాహనం వచ్చేదన్నారు. ఆయన హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. గూడు కూడా లేని నిరుపేదలకు పక్కా ఇళ్ళి నిర్మించి ఇచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదవాలన్నది మహానేత వైయస్ కల అని శ్రీమతి షర్మిల అన్నారు. ఆయన బ్రతికి ఉంటే ఇప్పుడు 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా చేసేవారన్నారు.

అయితే, ఆరోగ్యశ్రీకి కిరణ్‌ కుమార్‌రెడ్డి పాడె కట్టారని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. కిరణ్‌రెడ్డి ఇప్పటికి మూడుసార్లు ఆర్టీసీ చార్జీలు పెంచారని, గ్యాస్‌ ధరలు పెంచారన్నారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి 'వసూల్‌ రాజా'గా మారారన్నారు. కరెంట్‌ చార్జీలు పెంచిన కిరణ్‌ రాష్ట్ర ప్రజలపై రూ. 30 వేల కోట్ల ఆర్థిక భారం వేశారని ఆవేదన వ్యక్తంచేశారు.  కిరణ్‌ చెబుతున్న పెట్టుబడుల జాబితా పేరుకే పరిమితం అవుతున్నదని విమర్శించారు.

చంద్రబాబు తీరు వల్ల వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, అనేక మంది పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్ళిపోయారని శ్రీమతి షర్మిల విమర్శించారు. ఎనిమిదేళ్ళ పాలనలో ఎనిమిది సార్లు విద్యుత్‌ చార్జీలను చంద్రబాబు పెంచారన్నారు. చంద్రబాబుకు పదవి మీద ఆశ లేదంటే భూమి గుండ్రంగా లేదన్నట్లు ఉంటుందని ఆమె ఎద్దేవా చేశారు. బాబుకు పదవీ వ్యామోహం లేదంటే ఆయన పార్టీ నాయకులే నమ్మరని అన్నారు.

చంద్రబాబుకు ఉచ్ఛ నీచాలు లేవని, మోసగించడం, రంగులు మార్చడం ఆయన రక్తంలోనే ఉన్నదని ఎన్టీ రామారావు అన్నారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని పనిచేయమని కార్యకర్తలకు పిలుపునిచ్చిన చంద్రబాబు తన ఆస్తులను మాత్రం అమ్మరని విమర్శించారు. ధర్మయుద్ధం చేస్తున్నానంటూ చంద్రబాబు చెప్పిన మాటలను శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. పక్కన ఉన్న వాళ్ళను తొక్కేసి పైకి వెళ్ళిపోయే రకం చంద్రబాబు అని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా, కారు చౌకగా తన బినామిలకే అమ్మేసిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు.

ప్రధాని కార్యాలయంలో తమ రిపోర్టులు చూపించే సిబిఐ దర్యాప్తు ఎంత చక్కగా జరుగుతున్నదీ ఊహించుకోవచ్చని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. సిబిఐ తీరుపై అందరూ భగ్గుమంటున్నా చంద్రబాబు మాత్రం నోరు విప్పడంలేదేమని నిలదీశారు. ఈ విషయంలో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ విలీనం కావాలంటూ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి బహిరంగంగా అన్నారంటే ఎంతెంత కుట్రలు పన్నుతున్నారో అర్థం అవుతోందన్నారు. ఒక అమాయకుడిని అన్యాయంగా 11 నెలలుగా జైలులో నిర్బంధించారని శ్రీమతి షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం చేతిలో సిబిఐ కీలుబొమ్మగా మారిపోయిందని దుమ్మెత్తిపోశారు.

తాజా వీడియోలు

Back to Top