అప్పుడే ఎందుకు వేటు వేయలేదు?

మండపేట (తూ.గో.జిల్లా),

9 జూన్‌ 2013: కాంగ్రెస్‌ ప్రభుత్వం దుర్మార్గపు పాలనతోను, కరెంటు చార్జీల బాదుడుతోను, చార్జీల మోతతోను విసుగెత్తిపోయిన ప్రతిపక్షాలన్నీ ఒక్కటై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయని వైయస్‌ఆర్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. వేటు పడుతుందని తెలిసి కూడా తమను ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్న ప్రజల పక్షాన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 9 మంది, టిడిపికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు నిలబడి, జగనన్న మాటకు కట్టుబడి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారని శ్రీమతి షర్మిల తెలిపారు. మార్చి నెల 15న వారు తమ పార్టీల విప్‌లు ధిక్కరించి ఓటు వేస్తే వారిని స్పీకర్ అప్పుడే అనర్హులుగా ప్రకటించ‌లేదన్నారు.

అప్పుడే వేటు వేస్తే.. ఉప ఎన్నికలు వస్తే.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అన్నింటినీ కైవసం చేసుకుంటుందని కాంగ్రెస్‌, టిడిపిలకు భయం అన్నారు. కాంగ్రెస్‌, టిడిపిలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవని తెలిసి.. ఆ పార్టీలకు వంతపాడి స్పీకర్‌ కావాలనే జాప్యం చేశారని ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేదని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే నిన్న వారిపై అనర్హత వేటు వేయడమేమిటని శ్రీమతి షర్మిల నిలదీశారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 174వ రోజు ఆదివారం నాడు తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా మండపేట కలువపువ్వు సెంటర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు తరలి వచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

కాంగ్రెస్‌, టిడిపి నాయకులకు ఉప ఎన్నికలంటే ఎంత భయమో అంతే లేదని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలంటేనే భయపడే వారిని నాయకులంటారా? లేక పిరికిపందలంటారా? అని ఆమె ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు చెప్పే తీర్పును స్వాగతించే ధైర్యం ఈ కాంగ్రెస్‌, టిడిపి నాయకులకు లేదని తూర్పారపట్టారు. మరి కొద్ది నెలల్లో 2014లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయని, అప్పుడెలా వ్యవహరిస్తారో ఈ పిరికిపందలు అని ఆమె నిప్పులు చెరిగారు. వీళ్ళు భయపడకపోతే మార్చిలోనే విప్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై ఎందుకు వేటు వేయలేదని శ్రీమతి షర్మిల సూటిగా నిలదీశారు. వీళ్ళకు భయం కాకపోతే రాబోయే స్థానిక ఎన్నికలను పార్టీల గుర్తుల మీద నిర్వహిస్తామని ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు.

అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో చంద్రబాబుకు తెలుసట.‌ అవిశ్వాసం పెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోదు అన్న ధైర్యం వచ్చాక మాత్రమే అవిశ్వాసం పెడతారట. అందుకే చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌లో చేరిన తరువాత ఇక కాంగ్రెస్‌కు ఢోకా లేదన్న తరువాత మాత్రమే అవిశ్వాస తీర్మానం పెట్టారని ఎద్దేవా చేశారు. ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాసం పెట్టినప్పుడు నిస్సిగ్గుగా విప్‌ జారీ చేసి మరీ దానికి చేతులు అడ్డు పెట్టి నిలబెట్టారని చంద్రబాబును దుయ్యబట్టారు.

ఐఎంజి లాంటి కేసులలో తనపై విచారణ జరగకుండా ఉండడానికి, సిబిఐని ఉసిగొల్పకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కై నీచమైన రాజకీయాలు చేస్తున్నారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. నిజాయితీగా రాజకీయాలు చేసే ధైర్యం చంద్రబాబుకు ఎప్పుడూ లేదన్నారు. విశ్వసనీయతకు, విలువలకు కట్టుబడే లక్షణాలు ఆయనకు అసలే లేవన్నారు.

సిఎం కిరణ్‌రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడా కరెంటు లేదన్నారు. విద్యుత్‌ చార్జీలు, ధరల మోతతో ప్రజలు అల్లాడిపోతున్నా ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్షానికి చీమ కుట్టినట్లయినా ఉండదన్నారు.

ఈ ప్రజా కంటక ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాసం పెట్టినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలుస్తుందని ప్రజల సాక్షిగా చెబుతున్నానని శ్రీమతి షర్మిల తెలిపారు. రాజన్న రాజ్యంలో ప్రతు రైతు, ప్రతి పేదవాడికి, ప్రతి విద్యార్థికి గుండె నిండా భరోసా ఉంటుందన్నారు. ప్రజల పక్షాన నిలబడడమే జగనన్నలక్ష్యం అన్నారు. మళ్ళీ రాజన్న రాజ్యం స్థాపించడమే ఆయన ధ్యేయం అన్నారు. త్వరలోనే రాజన్న రాజ్యం దిశగా మనందర్నీ జగనన్న నడిపిస్తారని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. రైతుల పంటకు మద్దతు ధర లభించేలా రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పటు చేస్తారన్నారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పెంచుతారన్నారు. విద్యార్థులను చదివించేందుకు తల్లుల ఖాతాలోకే నేరుగా డబ్బులు జమచేస్తారన్నారు. శ్రీమతి షర్మిల ప్రతి మాటకు మండపేట ప్రజలు హర్షధ్వానాలతో తమ మద్దతు ప్రకటించారు.

Back to Top