అన్ని వర్గాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ అండ

హైదరాబాద్ 12 మార్చి 2013:

అన్ని వర్గాలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పార్టీ గౌరవాధ్యక్షురాలు భరోసా ఇచ్చారు. పార్టీ రెండో ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో వైయస్ఆర్ కాంగ్రెస్ జెండాను ఎగరేశారు.  ప్రజల గురించి ఆలోచించే స్థితిలో ప్రభుత్వం లేదని విమర్శించారు. ప్రజలపై భారం మోపడమే దాని ఉద్దేశమన్నారు.

ఎకనమిక్ టైమ్సు ఇంటర్వ్యూలోని అంశాలకు ఎల్లో మీడియా వక్రీకరణ
నేను ఎకనమిక్ టైమ్సు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూను ఎల్లో మీడియా వక్రీకరించిందని శ్రీమతి విజయమ్మ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అందులో చెప్పానని ఆమె స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్రంలో మద్దతిస్తామని చెప్పానన్నారు. కేంద్రంలో వచ్చేసారి యూపీఏ అధికారంలోకి వస్తుందో, మూడో ఫ్రంటు అధికాంలోకి వస్తుందో ఎవరికి తెలుసని ప్రశ్నించారు. శ్రీ వైయస్ జగన్ కూడా ఇదే విషయాన్ని గతంలో చెప్పారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన అంశాలకు కట్టుబడి ఉంటామని స్పష్టంచేశారు. ఆ పత్రిక రెండో పేజీలో నేను చెప్పిన అంశాలనే రాశారనీ, మమ్మల్ని విమర్శించే వారు ఆ పేజీని చదవలేదనీ ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పిన విజయమ్మ
పార్టీ ఆవిర్భవించి రెండేళ్ళు పూర్తయిన సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ళలో ఎన్నో మార్పులు సంభవించాయి. 2009లో మహానేత రాజశేఖరరెడ్డిగారు కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఆ కుటుంబాన్నే కేంద్రం రో డ్డుకీడ్చింది. ప్రజల అభిమానాన్ని చూరగొన్న శ్రీ జగన్మోహన్ రెడ్డిని  జైలులో పెట్టించారని ఆవేదన చెందారు. మా కుటుంబాన్ని అనేక బాధలు పెడుతున్నారు. కుటిల రాజకీయాలు చేస్తున్నారు. రాజశేఖరరెడ్డిగారు వెళ్ళిపోయిన తర్వాతి పరిణామాలు ప్రజల గుండెల్ని పిండేస్తున్నాయి.

కష్టాలు పట్టించుకునే వారేరీ!
రాజశేఖరరెడ్డిగారు ప్రజల కష్టం తెలిసిన వ్యక్తనీ, దాదాపు ఇరవైఐదు సంవత్సరాలు ప్రజల మధ్య గడిపారనీ ఆమె పేర్కొన్నారు. ఆయన లేకపోయేసరికి చాలా బాధాకరమైన పరిస్థితులను చూడాల్సి వస్తోందని శ్రీమతి విజయమ్మ చెప్పారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం అధోగతి పాలైంది. సర్చార్జీల పేరిట రూ. 32వేల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్తు వినియోగదారులపై మోపారనీ, ఇలా ఏ రాష్ట్రంలోనూ చేసి ఉండరనీ ఆమె చెప్పారు. ఆర్టీసీ చార్జీలు కూడా అలాగే ఉన్నాయి. భూముల ధరలు తగ్గాయి కానీ రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారన్నారు. మద్యం ఏరులైపారుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. కరెంటు లేక పరిశ్రమలు మూతపడ్డాయి. పవర్ హాలిదే.. మిల్కు హాలిడే కూడా ప్రకటిస్తున్నారు. అభాగ్యులకు పింఛన్లు అందడం లేదు. లక్ష 85 వేల వికలాంగుల పింఛన్లు తొలగించారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది. 108 డీజిల్ కొరతతో అల్లాడుతోంది. 104 కనుమరుగైంది. ఫీజు రీయింబర్సుమెంటు సక్రమంగా అమలుకాక తల్లిదండ్రులు అల్లల్లాడుతున్నారు. ఏతావాతా చూసుకుంటే రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని తేలుతోంది. ప్రభుత్వంలో ఉన్నవారికి తమ పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీకి తిరగడానికే సమయం సరిపోతోంది తప్ప ప్రజల బాధలు పట్టించుకునే అవకాశమే ఉండటం లేదు.


పారిపోతున్న ప్రతిపక్షనేత
నిలదీయాల్సిన ప్రతిపక్షం అసెంబ్లీ నుంచి పారిపోతోందన్నారు. అసెంబ్లీ సమావేశానికే రానని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించడాన్ని శ్రీమతి విజయమ్మ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రజలు మనకెందుకు ఓటేశారో ఓసారి గుర్తుచేసుకుంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోరని ఆమె సూచించారు. చంద్రబాబు నాపైనా, షర్మిల యాత్రపైనా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.  ప్రతిపక్షంలో ఉండగా గమనించిన ప్రతి సమస్యకూ రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రయిన తర్వాత పరిష్కారం చూపిన అంశాన్ని ఆమె జ్ఞప్తి చేసుకున్నారు. ప్రజలు అడగకపోయినా ఆయన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆహార, ఆవాస భద్రత కల్పించారు. ఎన్నికల ప్రణాళికలోపెట్టినవీ.. పెట్టనివీ కూడా చేసి చూపారు. రాష్ట్రంలో పేదరికం కేవలం ఇరవై శాతమే ఉందని ప్రణాళికా సంఘం చెబుతోందనీ, కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉందనీ చెప్పారు. దీనిని గుర్తించి రాజవేఖరరెడ్డిగారు చర్యలు చేపట్టారన్నారు. అడగకపోయినా బిడ్డ అవసరాన్ని తెలుసుకుని తల్లి తీరుస్తుందనీ, రాజశేఖరరెడ్డి గారు తన 5 ఏళ్ళ 3 నెలల పాలనలో ప్రజల కష్టాలు తెలుసుకుని మరీ తీర్చారనీ వివరించారు. రాజన్న యుగంలో దేని ధరా ఒక్క పైసా కూడా పెరగలేదు. గ్యాస్ ధర పెంచితే రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చర్యలు చేపట్టారన్నారు. ధాన్యం మద్దతు ధరను పెంచారు. ఏ కాంగ్రెస్ పాలిత ప్రాంతంలోనూ లేని రైతుకు ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేసి చూపించారని చెప్పారు. రైతుకు ఓ విధమైన భరోసాను రాజన్న కల్పించారన్నారు. పేదల పిల్లలు చదువుకు పేదలు కాకూడదనే అంశాన్ని గుర్తించి ఆయన ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రతి పథకానికీ సాట్యురేషన్ విధానాన్ని తెచ్చారన్నారు. మహిళలకు పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టి మహిళా సాధికారతకు ప్రయత్నించారన్నారు.


రెండేళ్ళలో ఇంటింటి పార్టీగా వైయస్ఆర్ కాంగ్రెస్
జగన్ బాబు ఎందుకు పార్టీ పెట్టాల్సి వచ్చిందో మీ అందరికీ తెలుసన్నారు. రాజన్న పథకాలకు తూట్లు పొడుస్తుండడమే దీనికి కారణమన్నారు. రాజన్న మరణం తట్టుకోలేక గుండెలు పగిలి మరణించిన వారిని ఓదార్చడానికి బయలుదేరితే కష్టాలు వస్తాయని జగన్ బాబు ఊహించారనీ, దానికి సిద్ధపడ్డారనీ చెప్పారు. రెండేళ్ళలోనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటింటి పార్టీ అయ్యిందని తెలిపారు. అన్ని వర్గాలకూ పార్టీ ప్రాతినిథ్యం కల్పిస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షమేనని శ్రీమతి విజయమ్మ స్పష్టంచేశారు. ఆమె ఈ మాటలన్నప్పుడు జై జగన్, విజయమ్మ నాయకత్వం వర్థిల్లాలి అనే నినాదాలు మార్మోగాయి. రాజశేఖరరెడ్డిగారిలాగే జగన్ బాబు కూడా ప్రజల పక్షానే నిలబడ్డారని ఆమో చెప్పారు. ఆయన నెలకు 25 రోజులు ప్రజల మధ్యనే ఉన్నారన్నారు. సమస్యలపై ఉద్యమాలు చేశారని పేర్కొన్నారు. జగన్ బాబు జైలులో కూడా ప్రజల గురించే ఆలోచిస్తున్నాడు. ప్రజలు కోసం ఈ ఉద్యమం చేయాలని చెబుతూనే ఉన్నాడు. 52వ ముద్దాయిగా ఉన్న జగన్ బాబును మొదటి ముద్దాయిగా మార్చి వేధిస్తున్నారు. సీబీఐ విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేశారన్నారు. పదినెలల్లో ఏ రుజువు చూపించలేకపోయారు. పార్టీ అధ్యక్షుడైనంత మాత్రాన సాక్షుల్ని ప్రభావితం చేస్తారనడం వాస్తవం కాదన్నారు. ప్రజలు చూపిస్తున్న అభిమానం మరిచిపోలేనిదన్నారు. ఉప ఎన్నికలలో ఎంతో ఆదరించారు. అఖండమైన మెజారిటీతో గెలిపించారన్నారు. కుమ్మక్కు, కుట్ర రాజకీయాలు జగన్ ముందు నిలవలేదన్నారు. దీనంతటికీ మీ అభిమానమే కారణమని శ్రీమతి విజయమ్మ తెలిపారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు షర్మిల సాగిస్తున్న పాదయాత్రను కూడా ఆదరిస్తున్న ప్రజలకు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. జన సంతకం కార్యక్రమాన్ని రెట్టింపు ఉత్సాహంతో విజయవంతం చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.  పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాల్సి ఉందని జగన్ బాబు సూచించారన్నారు. జగన్ బాబు ప్లీనరీలో ఏదైతే చెప్పారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీని బలపరచాలని కోరారు.

Back to Top