అన్నా..నీవే మాకు దిక్కు

 

– మారాల గ్రామంలో రైతులతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి
– రైతుల సలహాలు, సూచనలు స్వీకరించిన ప్రతిపక్ష నేత
– సాధ్యసాధ్యాలను పరిశీలించి మేనిఫెస్టోలు చేర్చుతామని హామీ
అనంతపురం: నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో తీవ్రంగా నష్టపోయామని, నీవే మాకు దిక్కు అని కరువు కాటకాలతో అల్లాడుతున్న అనంతపురం ప్రజలు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని వేడుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గం మారాల గ్రామంలో మంగళవారం రైతులతో వైయస్‌ జగన్‌ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు టీడీపీ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. మాకు మీరే అండ అని, రాజన్న బిడ్డకు తోడుగా ఉంటామని, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ముక్తకంఠంతో నినదించారు. ముఖాముఖి కార్యక్రమంలో రైతులు ఏమన్నారంటే..

ఇసుక, మట్టి మాఫీ చేశారు..
అన్నా..చంద్రబాబు ప్రకటించిన రుణమాఫీ ఎరుగం కానీ..మా జిల్లాలో టీడీపీ నాయకులు ఇసుక, మట్టి మాఫీ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మా ప్రాంతానికి సాగునీరు ఇచ్చేందుకు 2011లోనే హంద్రీనీవా పనులు చేపట్టారు. అయితే మహానేత అకాల మరణంతో మాకు నీరు అందడం లేదు. జగనన్న మీరు ముఖ్యమంత్రి కాగానే మా చెరువులకు నీరిచ్చి ఆదుకోవాలని కోరుతున్నాను. మీరు తొందర్లోనే ముఖ్యమంత్రి అయి రైతుల పక్షాన నిలవాలని కోరుతున్నాను. 
–––––––––––––––––––
రైతు భరోసా కింద రూ. లక్ష ఇవ్వండి అన్నా..:  రమేష్‌ నాయక్‌
అన్నా..మీరు నవరత్నాల్లో ప్రకటించిన రైతు భరోసా పథకం చాలా బాగుంది. ఐదేళ్లలో రూ.50 వేలు ఇస్తామన్నారు. దీన్ని లక్ష రూపాయలకు పెంచితే ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే గ్రామం యూనిట్‌గా వెదర్‌ బెల్టు ఏర్పాటు చేసి  బీమా సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామం యూనిట్‌గా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇచ్చే ఏర్పాటు చేయండి. 
––––––––––––––––––
గిట్టుబాటు ధర లేదు: వేణుగోపాల్‌రెడ్డి
అన్నా..టీడీపీ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.మీరొచ్చాక గిట్టుబాటు ధరలు కల్పించి మాలాంటి రైతులను ఆదుకోండి. 
–––––––––––––––––
నీరిస్తే చాలు నీ వెంటే: రమణారెడ్డి, రైతు
అన్నా..మీరు రైతులకు సాగు నీరిస్తే చాలు మీ వెంటే ఉంటాం. బుక్కపట్నం మండలంలో మామిడి తోటలు పెంచుతున్నారు. భూగర్భజలాలు దారుణంగా ఉన్నాయి. తాగునీరు, సాగునీరు లేదు. ఏప్రిల్, మే నెలల్లో దాదాపు 46 డిగ్రీల వేడి ఉంటుంది. ఎండలకు మామిడి చెట్లు చనిపోయిన విషయాన్ని మీడియా ప్రచురిస్తే మంత్రులు వచ్చి పంటలు పరిశీలించారు. అయినా ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. నీళ్లు చల్లుకోండని చెప్పి పది మందికి అరకొరగా డబ్బు ఇచ్చారన్నా..మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత డ్రైల్యాండ్‌ హర్టికల్చర్‌ కింద ఆదుకోవాలని కోరుతున్నాను. చంద్రబాబు ఒక్క రూపాయి కూడా రుణం మాఫీ చేయలేదు. మీరు నీరిస్తే చాలు మీకు అండగా ఉంటామని చెబుతున్నాను.
 
వైయస్‌ జగన్‌: ఇన్సూరెన్స్‌ పరిస్థితి దారుణంగా ఉంది. అక్షరాల రూ.116 కోట్లు రైతుల నుంచి ప్రీమియం కట్టించుకున్నారు. అరకొరగా ఇన్సూరెన్స్‌ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితులు మారాలి. మనమోచ్చాక ఇన్సూరెన్స్‌ పథకాన్ని మెరుగుపరుస్తాం.
––––––––––––––––––––––––––––
జగన్‌ సీఎం అయితే మనందరికి న్యాయం :  దండోరా నారాయణ
 చంద్రబాబు అందర్ని మోసం చేశాడు.  నేను 1990 నుంచి టీడీపీ కార్యకర్తనే. అయితే వైయస్‌ రాజశేఖరరెడ్డి వచ్చిన తరువాత నాకు బియ్యం కార్డు ఇచ్చారు. టీడీపీలో రెండు బస్సులు పగులగొట్టాను. చంద్రబాబు పాదయాత్ర చేసిన సమయంలో నేను చెప్పులు కుట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పూరి గుడిసే ఉంది.  మా  ఓట్లు వేయించుకునేందుకు దొంగ నాటకాలు ఆడారు. రెండు ఎకరాల భూమి ఉన్న చంద్రబాబు ఆ నాడు వైయస్‌ఆర్‌ వెనుక ఉండి ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు కోట్లు సంపాదించాడు. మంద కృష్ణ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాడు చంద్రబాబుకు ఓట్లు వేయమని చెప్పాడు. ఆయన మాట విని ఊరూరా ఓట్లు వేయించాను. అయితే ఏ ఒక్కరికి కూడా బాబు న్యాయం చేయలేదు. తెలివిగా ఉండే రైతులారా ఒక్కసారి ఆలోచించండి. వైయస్‌ జగన్‌ సీఎం అయితే టీడీపీ అనేది ఉండదు. జగన్‌ సీఎం అయితే మనందరికి న్యాయం జరుగుతుంది. ఒక్కసారి ఆ తండ్రి లేని బిడ్డకు మనమందరం తోడుగా ఉందాం.  వైయస్‌ జగన్‌ ఎవర్ని మోసం చేసే వ్యక్తి కాదు. మన రాజశేఖరరెడ్డి కొడుకును ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్నా..ఒక్క మాట ..ఎస్సీలకు, రైతులకు న్యాయం చేయండి, మీకు అండగా ఉంటాం. అబద్ధాలు చెప్పేది చంద్రబాబే, అది ఆయనకే చెల్లు. 
––––––––––––––––––––––––
డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు: సునిత, అగ్రహారం
బ్యాంకులో వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. తీరా రూ.10 వడ్డీ వేస్తున్నారు. మీరు వడ్డీ కట్టకుంటే చంద్రబాబు ఇస్తారా అని బ్యాంకు మేనేజర్‌ అంటున్నారు. డబ్బులు కట్టినా కూడా మా రుణాలు తీరడం లేదు. చంద్రబాబు మాత్రం రుణాలు కట్టవద్దు, మాఫీ చేస్తామన్నారు. ఎందుకు మాఫీ కాలేదు సారూ. మాకు తాగేందుకు నీరు లేకుంటే శ్రీధర్‌రెడ్డి ట్యాంకర్లు పంపించారు.
––––––––––––––––
మా బిడ్డలు చల్లగా ఉండాలంటే..
అన్నా.. మా బిడ్డలు చల్లాగా ఉండాలంటే నీవు రావాలి. అన్నా..మేం చాలా బాధపడుతున్నాం. మీరు రావాలి. బ్యాంకుల్లో రూ.20 వేలు అప్పు ఇచ్చి రూ.50 వేలు కట్టించుకుంటున్నారు. అన్నా..నీవే మాకు దిక్కు. మా రాజువు. మాకు నాలుగు ఎకరాలు భూమి ఉంది. నిరుడు రూ.50 వేలు నష్టం వచ్చింది. అన్నా..నీవే ఆదుకోవాలన్నా..
–––––––––––––––––––––– 
చెరువులు నింపాలి:  జగన్‌మోహన్‌ చౌదరి, ఎంపీటీసీ సభ్యులు
నియోజకవర్గంలో పనులు లేక వ్యవసాయ కూలీలు అవస్థలు పడుతున్నారు. రైతు భరోసా కింద ఒక్కసారే రూ.లక్ష ఇస్తే బాగుంటుంది. లిప్టు ఇరిగేషన్‌ ద్వారా చెరువులు నింపాలి. 
–––––––––––––––––
బుక్కపట్నం మండలాన్ని దత్తత తీసుకోండి:  రమణారెడ్డి, మాజీ సర్పంచ్‌ 
రాయలసీమలో అత్యంత వెనుకబడిన జిల్లా అనంతపురం మాత్రమే. జిల్లాలోనే బుక్కపట్నం మండలం చాలా వెనుకబడింది. ఈ మండలాన్ని మీరు దత్తత తీసుకోవాలనికోరుతున్నాను.
– దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో మా ప్రాంతాన్ని ఓడీసీ మండలంగా ప్రకటించారు. మీరే ఆదుకోవాలని రైతు భాస్కర్‌రెడ్డి కోరారు. వైయస్‌ఆర్‌సీపీ సానుభూతి పరులు అంటూ తమకు ఇల్లు, పింఛన్లు ఇవ్వడం లేదని మరో ఇద్దరు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.  
 
వైయస్‌ జగన్‌: ఈ రోజులు రైతులందరు కూడా కష్టాల్లో ఉన్నా  ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని తనకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సూచలను సాధ్యసాధ్యలపై బేరిజు వేసుకొని ఏ మేరకు చేయగలుగుతామో అంతమేరకు మన మ్యానిఫెస్టోలో పెడతామని మాట ఇస్తున్నాను. మీ అందరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
 
Back to Top