దిగ్గీరాజ దిగజారుడు వ్యాఖ్యలు: అంబటి

హైదరాబాద్, 9 అక్టోబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగ‌న్‌కు ప్రజల నుంచి వస్తున్న విశేషమైన ఆదరణను తగ్గించేందుకు కాంగ్రెస్, టిడిపిలు కలిసి కుట్రలు చేస్తున్నాయని పార్టీ నాయకుడు, అధికార ప్రతినిధి అన్నారు. అందులో భాగంగానే దిగ్విజయ్‌ సింగ్ బురద చల్లే వ్యాఖ్యలు చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి‌ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని అంబటి రాంబాబు అన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి తన కొడుకులాంటి వాడన్న దిగ్విజయ్‌ సింగ్‌ 16 నెలలు జైలులో శ్రీ జగన్ ఉన్నప్పుడు ఏ‌మి చేశారని ఆయన ప్రశ్నించారు.

మహానేత రాజశేఖరరెడ్డి తనకు మిత్రుడంటున్న దిగ్విజ‌య్‌ సింగ్‌.. ఆ మహానేత మరణాన్ని తట్టుకోలేక మృతిచెందినవారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న శ్రీ జగన్‌కు అడ్డుచెప్పిన సోనియాను ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లేఖ ఇచ్చిందని దిగ్విజయ్ చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. రాజకీయ లబ్ధి‌ కోసం కాంగ్రెస్, టిడిపి కలిసి రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించి.. ఆ నెపాన్ని తమ పార్టీపై మోపడం తగదన్నారు. చంద్రబాబు నాయుడిని, శ్రీ జగన్‌ను కలిపి ఒకే గాటన కట్టాలని దిగ్విజయ్ చేస్తున్న యత్నం అర్ధం లేనిద‌ని అంబటి అన్నారు.

దిగ్విజయ్‌సింగ్‌ తన స్థాయి నుంచి దిగజారిపోయి మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఇన్ని రోజులుగా శ్రీ జగన్‌పై కాంగ్రెస్, టిడిపిలు చేస్తున్న కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు అని దిగ్విజయ్‌ సింగ్‌ను సూటిగా ప్రశ్నించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయన కుమారుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి తన కొడుకులాంటి వాడని మీడియాలో దిగ్విజయ్‌ సింగ్‌ మాటలపై అంబటి పై విధంగా స్పందించారు.

Back to Top