ప్రాదేశిక ఫలితాలతో మరింత ఉత్సాహం

హైదరాబాద్:

పంచాయతీరాజ్ ఎన్నికలలో తొలిసారి‌గా పోటీచేసిన వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీకి తాజా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల పట్ల పార్టీ నేతల్లో సంతృప్తి వ్యక్తమైంది. పార్టీ నిర్మాణం పూర్తిగా జరగక ముందే తొలిసారి ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ గ్రామీణ ఓటర్లలో వైయస్ఆర్‌సీపీ పట్టు సాధించడం పార్టీలో మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచిందని తెలిపారు. సీమాంధ్రలోని మొత్తం 653 జడ్పీటీసీల్లో 50 నుంచి 60 జడ్పీటీసీల వ్యత్యాసంతో ఏడెనిమిది జిల్లా పరిషత్‌లు వైయస్ఆర్‌సీపీ చేజారాయని వారు పేర్కొన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించేవి కావని, వీటికి సాధారణ ఎన్నికలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందని‌ వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 ఎంపీటీసీ, జడ్‌టీసీ ఎన్నికలు పూర్తయిన తర్వాత నెల రోజులకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, ఈ నెల రోజుల వ్యత్యాసంలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ సీమాంధ్రలో విస్తృతంగా పుంజుకున్నదని మంగళవారం పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విశ్లేషించారు. మరో రెండు రోజుల్లో వెలువడే లో‌క్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయన్న దృఢమైన విశ్వాసం తమకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

'పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన సమయంలో సుప్రీంకోర్టు తీర్పుతో ఒకటి రెండు రోజుల్లోనే అకస్మాత్తుగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. అయినప్పటికీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసి ఈ స్థాయిలో ఫలితాలు సాధించడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. 10,092 ఎంపీటీసీల్లో 44 శాతం సీట్లను మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పార్టీ దక్కించుకుంటే... మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన మా పార్టీ 37 శాతం సీట్లు సాధించుకుంది. 19 శాతం ఇతర పార్టీలు గెలుచుకున్నాయి‌' అని అంబటి అన్నారు.

'పార్టీ నిర్మాణమే లేని దశలో వచ్చి పడిన ఎన్నికలను ఎదుర్కొనడం ఏ పార్టీకైనా కత్తిమీద సాము లాంటిదే. అలాంటిది 653 జడ్పీటీసీల్లో దాదాపు సగభాగం స్థానాలు గెలుచుకోవడం సాధారణ విషయం కాదు. మంగళవారం అర్ధరాత్రి వరకు అందిన ఫలితాలను బట్టి మొత్తం జడ్పీటీసీల్లో టీడీపీ 53 శాతం సీట్లను సాధించగా... వైయస్ఆర్‌సీపీ 46 శాతం సీట్లు సాధించింది. మాకన్నా 50 జడ్పీటీసీ స్థానాలను అదనంగా గెల్చుకున్న టీడీపీ 9 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకున్నప్పటికీ... ఓట్ల పరంగా, సీట్ల పరంగా మా పార్టీది గొప్ప విజయంగా చెప్పుకోవాలి' అని విశ్లేషించారు.

'సాధారణ ఎన్నికల ఘట్టం ఊపందుకోవడానికి ముందుగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలపై ఉండబోవు. ఏప్రిల్ 6, 11 వ తేదీల్లో రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఆ తర్వాత నెల రోజులకు సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ నెల రోజుల్లోపు సీమాంధ్ర ఓటర్లలో ఎంతో వ్యత్యాసం కనిపించింది. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాల ప్రభావం పెద్దగా ఉండదు. స్థానికంగా ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల ప్రభావం ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఉంటుంది‌' అన్నారు.

'పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత 12న లో‌క్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయింది. 14 న వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అసెంబ్లీ, లో‌క్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో పాటు పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్ జనభేరీ పేరుతో ప్రచారం ప్రారంభించారు.‌ శ్రీ జగన్‌తో పాటు పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, ఆయన సోదరి శ్రీమతి షర్మిల మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సామాజిక సమతూకం పాటిస్తూ పార్టీ టికెట్లను ఖరారు చేయడం, పార్టీ ముఖ్య ప్రచారకర్తల విస్తృత ప్రచారం, పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొనడం వంటి అంశాలు వైయస్ఆర్‌సీపీ గెలుపు ధీమాను పెంచాయి' అని అంబటి తెలిపారు.

Back to Top