ఐదవరోజు కొనసాగుతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ దీక్ష

హైదరాబాద్, 6 ఏప్రిల్‌ 2013: రాష్ట్ర ప్రజలపై పెను భారం మోపుతూ విద్యుత్ ఛార్జీ‌లు పెంచడాన్ని, కరెంట్ కోత‌లకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేస్తున్న 'కరెంట్‌ సత్యాగ్రహం' దీక్ష శనివారం ఐదవ రోజున కొనసాగుతోంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మద్దతుగా నిలిచిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఈ దీక్ష చేస్తున్నారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సు ప్రాంగణంలో దీక్షలు కొనసాగుతున్నాయి.

కాగా, శనివారం ఐదవ రోజు ఉదయానికి పలువులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆరోగ్యం క్షీణిస్తున్నది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మతో పాటు పలువురు దీక్షాపరులకు వైద్యులు శనివారం ఉదయం పరీక్షలు నిర్వహించారు. శ్రీమతి విజయమ్మ తలనొప్పితో బాధపడుతున్నారు. ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, సుజయ కృష్ణ రంగారావులకు చక్కెర స్థాయిలు పడిపోయాయని వైద్యులు తెలిపారు.

మరోవైపున శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో దీక్షా ప్రాంగణం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రశాంతంగా జరుగుతున్న దీక్షా శిబిరంలోకి పోలీసులు రావడంతో కొంచెం హడావుడి నెలకొంది. దీక్షను పోలీసులు భగ్నం చేయకుండా రాత్రంతా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ అభిమానులు దీక్షా శిబిరం వ‌ద్దనే కాపలాగా ఉన్నారు.
Back to Top