57వ రోజు ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

నాదర్గుల్ (రంగారెడ్డి జిల్లా):

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని నాదర్గుల్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. నాదర్‌గుల్ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.  కాంగ్రెస్ పాలనలో విద్యుత్ చార్జీలు, పన్నులు మరింత భారమయ్యాయని గ్రామస్తులు శ్రీమతి షర్మిలతో చెప్పుకున్నారు.  రెండేళ్ల నుంచి  తమకు పించన్లు నిలిపివేశారని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా పించన్లు వచ్చేలా చూడాలని శ్రీమతి షర్మిలను వేడుకున్నారు.

     ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల పట్ల ఈ ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. కరెంటు బిల్లులు పెంచి పేద ప్రజల నడ్డి విరిచారని ధ్వజమెత్తారు. పన్నులు పెంచి బలవంతంగా వసూలు చేస్తున్నారని అన్నారు. త్వరలో జగనన్న వస్తారని, కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తారని హామీ ఇచ్చారు. మీరంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.

     అక్టోబర్ 18న ఇడుపులపాయలో ప్రారంభమైన శ్రీమతి షర్మిల పాదయాత్ర కడప, కర్నూలు, అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. గురువారం నాటికి 56 రోజుల్లో 807.70 కిలో మీటర్లు పాదయాత్ర కొనసాగింది.  రంగారెడ్డి జిల్లాలో నాలుగో రోజు శుక్రవారం (57వ రోజు) నాడు 16.3 కిలో మీటర్ల మేరకు శ్రీమతి షర్మిల పాదయాత్ర చేయనున్నారు.

Back to Top