బాబు చేతిలో బలి


పిచ్చి ముదిరింది రోకలి తలకు కట్టమంటాడట వెర్రి వాడు. కానీ మన బాబు వెర్రి వాడు గాదు గదా..అందుకే బాండ్లు మన తలకు కడతానంటున్నాడు. అఫ్ కోర్స్ పిచ్చి వాళ్లం మనం అయితే బాండ్లు బండలు గాక మరేమిటీ అంట???
చంద్రబాబుకు హఠాత్తుగా వచ్చే కొన్ని ఆలోచనలు తెలుగు ప్రజలకు సునామీల్లాంటివి. ఒక్కోసారి వాటి నుంచి ప్రజలు తప్పించుకోలేక తల్లడిల్లుతుంటారు. ప్రస్తుతం బాబు బ్రెయిన్ లో ఓ క్రూరమైన ఆలోచన రూపు దిద్దుకుంటోంది. కేంద్రమా నిధులు ఇయ్యను పొమ్మని తెగేసి చెప్పింది. ఇచ్చిన వాటికి లెక్కా పత్రం లేదు. పైగా నువ్విప్పుడు మా జట్టు గాదు. ఇకపై నీ బండారం అంతా బట్ట బయలు చేస్తాం. అవినీతి కథలన్నీ కంచికి చేరుస్తాం అని వార్నింగ్ కూడా ఇచ్చేసింది. సమస్యలు ఎదురైనప్పుడు మనిషి మెదడు చురుగ్గా పని చేస్తుందట. పరిష్కారాల అన్వేషణ కోసం. అవినీతి బాబు బుర్ర గుంటనక్కలా ఆలోచిస్తుంది జనాల నెత్తిన చేయ్యి పెట్టడం కోసం. 
గతంలో రాజధాని నిర్మాణానికి విరాళాలంటూ ఆఫీసుల్లో డొనేషన్ బాక్సులు పెట్టి అభాసు పాలయ్యాడు. వాటితో వచ్చేది చిల్లరే అని అర్థం అయ్యిందో ఏమో వాటిని ఎత్తేసి పెద్ద ఎత్తున కమీషన్ల ప్లాను గీసాడు. రాజధాని నిర్ణయాన్ని అడ్డుపెట్టుకుని బినామీలతో భూముల దందా చేయించేసాడు. ఆనక భూసేకరణ పేరుతో వేలాది ఎకరాలను నొక్కి పెట్టేసాడు. పోలవరం నేనే దగ్గరుండి కట్టిస్తానంటూ కేంద్రాన్ని మాయ జేసి, కాంట్రక్టర్లతో కుమ్మకు కథలు నడిపాడు. పట్టిసీమ పేరెట్టుకుని కోట్లు దండుకున్నాడు. కాగ్ అక్షింతలు వేసినా సరే తుడిచేసుకుని తిరిగేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా జనాలను ఎలా మోసం చేయాలా అని తెగ ఆలోచిస్తే బాబుకు కొత్త ఆలోచన తట్టింది అదే...బాండ్లు...నాకప్పివ్వండి..మీకు బ్యాంకుల మించి వడ్డీ ఇస్తా అని ఊరిస్తున్నాడు బాబు. రాజధాని కోసం పొలాలిచ్చిన రైతులకు, ఏటా పరిహారంగా ఇచ్చిన బాండ్లే...భోరు మంటున్నాయి. ఏ ఆఫీసుకు పోయినా ఛీదరింపులు తప్ప రైతులకు సవ్యంగా డబ్బు ముట్టడమే లేదు. ఇక రుణమాఫీ కోసం మూడు తడవలు విడుదల చేసిన బాండ్లు కూడా ముక్కీ మూలిగీ కానీ వడ్డీలకు జమ కాలేదు. అసలే బ్యాంకుల్లోంచి తమ డబ్బులు రాక జనాలు ఆపసోపాలు పడుతున్నారు. ఇట్టాంటి సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వ పెద్ద, ఉన్నదంతా నాకు ఊడ్చి పెట్టేయ్ అని అడుగుతున్నాడు...సింపుల్ గా చెప్పాలంటే బాబుకు ఓటేసి కత్తెర్లేయించుకున్న ప్రజలు, ఇప్పుడు ఎదురు అప్పులిచ్చి మరీ క్షవరం చేయించుకోవాల్ట.... 
కొన్ని ప్రభుత్వ సంస్థలు ప్రజా సక్షేమార్థం చేసే పనుల కోసం ప్రజల నుంచి నిధుల సమీకరణ జరుపుకుంటాయి. వారి దగ్గర తీసుకున్న సొమ్ముకు భద్రత ఉండేలా బాండ్లు జారీ చేస్తాయి. మరి చంద్రబాబు చేసే రాజధాని నిర్మాణం గ్రాఫిక్కుల్లోనూ, లండన్ వాళ్ల డిజైన్లు, నమూనాల్లోనూ తప్ప మరెక్కడా కనిపించదాయె?? అసలు బాబును నమ్మి సొమ్ము చేతిలో పెట్టడం అంటే...పులిని నమ్మి నోట్లో తల పెట్టినట్టే గదా...అందుకే మరి ఈమధ్య పాదయాత్ర సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పులి బంగారు కడియం కథ చెప్పింది. ఆశపెట్టి, వలలోకి లాగి అమాంతం మింగేసే పెద్దపులి మాదిరిగానే బాబు కూడా ప్రజలకు రుణమాఫీ, రాజధాని ఆశలు చూపి చివరికంటా ముంచేస్తాడన్నమాట...బెబ్బులిని చూసైనా భయపడతారో లేదో గానీ బాబు కనిపిస్తే ఎక్కౌంట్లో డబ్బులన్నీ బైటకు తీయ్యమంటాడేమో అని హడలిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 
 
Back to Top