నాడు వైయస్‌ఆర్‌..నేడు వైయస్‌ జగన్‌ను అడ్డుకునేందుకు కుట్రలు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని
 

వైయస్‌ జగన్‌ పాదయాత్రకు భారీ స్పందన వచ్చింది
 

ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు
 

వైయస్‌ఆర్‌ అధికారంలోకి రాకుండా చంద్రబాబు చాలా విధాల అడ్డుపడ్డారు
 

వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాకుండా టీడీపీ నేతలు ఆరోపలు చేస్తున్నారు
 

చంద్రబాబు రూ.6లక్షల కోట్లు దోపిడీ చేశారు

 

విజయవాడ: 2014 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని అధికారంలోకి రాకుండా అడ్డుకున్న చంద్రబాబు..ఇప్పుడు వైయస్‌ జగన్‌కు కూడా ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్‌ జగన్‌పై టీడీపీ నేతలు రాసిన లేఖను కొడాలి నాని తీవ్రంగా ఖండించారు. సోనియాను ఎదురించిన ధీరుడు వైయస్‌ జగన్‌ అని, చంద్రబాబు  అధికారం కోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

2017 నవంబర్‌ 6వ తేదీన ఇడుపులపాయ నుంచి వైయస్‌ జగన్‌ ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర సుదీర్ఘంగా 14 నెలల పాటు సాగిందన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు వచ్చిన ప్రజాదరణ చూసిన టీడీపీ నేతలు మతి తప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తి లేడని విమర్శించారు. 2004 కంటే ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏ ఒక్క వర్గానికి మేలు చేయకపోవడంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. దీంతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వైయస్‌ రాజశేఖరరెడ్డిపై అనేక కుట్రలు, ఆరోపణలు చేశారని, తనకు అనుకూలంగా ఉన్న ఓ వర్గం మీడియాతో వైయస్‌ఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయించి అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు.

చంద్రబాబు మాటలు నమ్మని ప్రజలు మహానేతను ముఖ్యమంత్రిని చేశారన్నారు. వైయస్‌ఆర్‌ సీఎం అయ్యాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంతో పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందిందన్నారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఆశ్రయం కల్పించారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంతో పేదల ఇళ్లలో వెలుగులు నింపారన్నారు. వైయస్‌ఆర్‌ చనిపోయినా ఆయన అమలు చేసిన పథకాలు పేదల గుండెల్లో చెరగని ముద్ర వేశాయన్నారు.

మహానేత మరణించిన తరువాత ఆ కుటుంబంపై కాంగ్రెస్‌ పార్టీ కక్షగట్టిందన్నారు. కాంగ్రెస్‌కు టీడీపీ జత కట్టి అక్రమ కేసులు పెట్టించి వైయస్‌ జగన్‌ను జైలుకు పంపించినా ధృఢ సంకల్పంతో ముందుకు సాగారన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం సోనియాను ఎదురించారన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఆయన్ను దించడం సాధ్యం కాదని చంద్రబాబు మళ్లీ కుట్రలు చేస్తున్నారన్నారు. చంద్రబాబును మించిన అవినీతి చక్రవర్తి లేడని స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడు దిగిపోతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు పెద్ద సైకో అని విమర్శించారు. 

 

Back to Top