అంబటి కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నేత‌ల ప‌రామ‌ర్శ‌

గుంటూరు: టీడీపీ గూండాల దాడిలో గాయపడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నేతలు శుక్ర‌వారం పరామర్శించారు. గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్న పార్టీ సీనియర్ నాయకులు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ వ‌రుదు క‌ళ్యాణి, త‌దిత‌రులు రాంబాబు కుటుంబ సభ్యులతో భేటీ అయ్యి సంఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. దాడి ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, రాజకీయ ప్రతీకార ధోరణితోనే ఇటువంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ మంత్రిపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ తేల్చే ఘటనగా వారు పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులతో మాట్లాడిన నాయకులు, వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున న్యాయపరంగా, ప్రజాస్వామ్యపరంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాజకీయ నాయకులపైనే దాడులు జరగడం ఆందోళనకరమని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. 

Back to Top