ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

అనంత‌పురం జిల్లా క‌లెక్ట‌ర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేత‌ల విన‌తి

అనంత‌పురం:  జిల్లాలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రించాల‌ని వైయ‌స్ఆర్ విద్యార్థి విభాగం జిల్లా అధ్య‌క్షుడు చంద్ర‌శేఖ‌ర్ డిమాండ్ చేశారు.  అనంతపురం జిల్లాలో ప్రభుత్వపాఠ‌శాల‌ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు గురించి వైయ‌స్ఆర్‌ విద్యార్థి విభాగం తరపున సోమ‌వారం జిల్లా క‌లెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేక మండుటెండలో కూర్చోవాల్సిన దుస్థితి నెల‌కొంద‌న్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తుంద‌ని, తద్వారా పదవ తరగతి పిల్లలు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంద‌ని ఆందోళ‌న‌వ్య‌క్తం చేశారు.  వర్క్ అడ్జస్ట్మెంట్ ద్వారానైనా పోస్టులు భర్తీ చేసి ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి అర్హత ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు లెక్చరర్లుగా ఉద్యోగోన్నతులు కల్పించాలని క‌లెక్ట‌ర్‌ను కోరారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌ విద్యార్ధి విభాగం రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి  నవీన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్ రెడ్డి, నగర అధ్యక్షుడు కైలాష్, నగర ప్రధాన కార్యదర్శులు జగన్ రెడ్డి,సాయి యాదవ్,హరీష్, మేహారాజ్, ఇమ్రాన్, సాయిచరణ్, వినయ్ కుమార్,తేజ, అశోక్ రాయల్ తదితరులు పాల్గొన్నారు

Back to Top