విశాఖపట్నం: విశాఖపట్నంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు మండిపడ్డారు. విశాఖపట్నం వైయస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చారిత్రాత్మక జీవోలు తీసుకొచ్చి పెద్దఎత్తున నిరుపేదలకు ఉచితంగా, రాయితీలతో హక్కులు కల్పించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే వాటిని ఈరోజు తామే చేసినట్లు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం పచ్చి మోసమని ఆయన ఆక్షేపించారు. టీడీపీ నేతలకు 20 శాతం మామూళ్లు, కప్పం కట్టిన వారికే అక్రమంగా పట్టాలు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. నగరంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి, అధ్వాన పారిశుధ్య సమస్యలను గాలికొదిలేసి, బీచ్ రోడ్డులో 7 కెమెరాలు, 7 మంది డైరెక్టర్లతో ముందస్తుగా తెచ్చి వేసిన చెత్తను ఎత్తుతూ చంద్రబాబు సినిమా షూటింగ్ తరహా స్కిట్లు నడిపారని ఎద్దేవా చేశారు. సెక్యూరిటీ లేకుండా నగరంలోని కాలనీల్లోకి కూటమి ప్రజాప్రతినిధులు అడుగుపెడితే మహిళలు చీపుర్లు, కర్రలతో తరిమికొట్టడం ఖాయమని స్పష్టం చేశారు. కేవలం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికే చంద్రబాబు ఈ పబ్లిసిటీ డ్రామాలకు తెరలేపారని కేకే రాజు తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక జీవోలకే చంద్రబాబు పబ్లిసిటీ: విశాఖపట్నంలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న నిరుపేదలకు సంపూర్ణ హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జీవో 463, జీవో 225, జీవో 60లను విడుదల చేశారు. 100 గజాల లోపు నివాసాలకు రూపాయికే ఉచితంగా శాశ్వత హక్కులు కల్పించడంతో పాటు, 101 నుంచి 200 గజాల వరకు 50 శాతం రాయితీ ఇచ్చి కన్వేయెన్స్ డీడ్లు అందించిన ఘనత వైఎస్ జగన్ గారిదే. విశాఖ, గాజువాక ప్రాంతాల కోసం జీవో 71, జీవో 301లను జారీ చేసి పేదల సొంతింటి కల నెరవేర్చాం. జగనన్న సంపూర్ణ గృహ హక్కు (ఓటీఎస్) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మందికి రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి, దాదాపు రూ.16 వేల కోట్ల మేర పేదలకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చాం. ఆనాడు వైఎస్ జగన్ గారు సిద్ధం చేసిన పట్టాలను, ఇచ్చిన హక్కులను ఈరోజు చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటూ ఆర్బాటాలు చేయడం 'ఎవరి బిడ్డకో తానే తండ్రి' అని చెప్పుకునే చంద్రబాబు నైజానికి నిదర్శనం. కప్పం కట్టిన వారికే పట్టాలు – టీడీపీ నేతల అడ్డగోలు దోపిడీ: నిన్న చంద్రబాబు చేతుల మీదుగా పంపిణీ చేసిన కన్వేయెన్స్ డీడ్ లలో అత్యధికులు ఏడాది క్రితమే ప్రభుత్వానికి రుసుములు చెల్లించిన బాధితులే. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏడాదిపాటు ఆ పట్టాలను పక్కనబెట్టి ఇప్పుడు పంపిణీ డ్రామా మొదలుపెట్టారు. 200, 300 గజాల పట్టాలు కావాలంటే అధికార టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులకు, వారి తొత్తులైన అధికారులకు 20 శాతం ముడుపులు, కప్పం కట్టాలని లబ్ధిదారులను వేధించిన మాట వాస్తవం కాదా? లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే ఎంపిక చేసి పట్టాలు ఇచ్చారు. 30 వేల మందిలో ఎంతమందికి అవినీతి రహితంగా పట్టాలు ఇచ్చారో తెలియ చేయాలి. ప్రభుత్వ నిధులను, ఆర్టీసీ బస్సులను విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తూ, డ్వాక్రా మహిళలను అదిరించి బెదిరించి సభకు తరలించారు. బీచ్ రోడ్డులో 7 కెమెరాలు, 7 డైరెక్టర్లతో చీప్ స్కిట్: బీచ్ రోడ్డులో చంద్రబాబు చేసిన స్వచ్ఛంద సేవ.. ఒక ముందస్తు స్క్రిప్ట్ ప్రకారం నడిచిన సినిమా షూటింగ్. ముందుగానే బీచ్‌ను శుభ్రం చేసి, ముఖ్యమంత్రి కారు దిగే సమయానికి ప్రత్యేకంగా కొన్ని చాక్లెట్ రేపర్లు, బిస్కెట్ ప్యాకెట్లు, ఖాళీ వాటర్ బాటిళ్లు తెచ్చి అక్కడ పడేశారు. 7 కెమెరాలు, 7 మంది డైరెక్టర్లతో చంద్రబాబు చెత్త ఏరుతున్నట్లు నాటకం ఆడారు. ఆయన వెళ్లగానే సెట్‌లో ఏర్పాటు చేసిన మురీ మిక్చర్ బండిని ప్రొడక్షన్ బృందం గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లిపోయింది. నిత్యం చిరువ్యాపారులను వేధిస్తూ, కప్పం కడితే తప్ప బీచ్ రోడ్డులు మురీమిక్చర్ బండ్లు పెట్టుకోనివ్వని కూటమి నేతలు.. నిన్న బీచ్‌లో ఆడిన ఈ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కాలనీల్లోకి వస్తే చీపుర్లు, కర్రలతో తరిమికొడతారు: ఎక్కడైనా సమస్యలపై ప్రజలు గళమెత్తితే, చంద్రబాబు సమాధానం చెప్పలేక అధికారులపై కేకలు వేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని కే కే రాజు మండిపడ్డారు. పనులకు నిధులు ఇవ్వకుండా, ప్రజల పన్నుల సొమ్మును దోచుకుంటూ అధికారులను తిడితే నగరంలో పారిశుధ్యం, రోడ్లు ఎలా బాగుపడతాయి? అని నీలదీశారు. ప్రస్తుతం విశాఖ నగరంలో తీవ్రమైన తాగునీటి కొరత, పారిశుధ్య లోపాలతో ప్రజలు అల్లాడుతున్నారని... భారీ పోలీసు బందోబస్తు లేకుండా, సెక్యూరిటీని పక్కనపెట్టి చంద్రబాబు గానీ, కూటమి ప్రజాప్రతినిధులు గానీ విశాఖ కాలనీల్లోకి అడుగుపెడితే మహిళలు, ప్రజలు చీపుర్లు, కర్రలతో తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు.