నెల్లూరు: ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు చర్చకు వచ్చిన ప్రతిసారీ లిక్కర్ కేసును తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. లేని స్కామ్‌ను ఉన్నట్టుగా చూపించి వైయస్ఆర్‌సీపీని బద్నాం చేసేందుకు కుట్ర జరుగుతోందని, లిక్కర్ స్కామ్ విషయంలో చెబుతున్న లెక్కల్లోనే భారీ తేడాలు ఉన్నాయని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కాకాణి.. కూటమి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు రూ.లక్ష కోట్లుగా చెప్పిన లిక్కర్ స్కామ్ ఇప్పుడు రూ.3 వేల కోట్లకు చేరిందని, రూ.3 వేల కోట్ల అక్రమాలు జరిగాయని చెబుతున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి అక్రమ లావాదేవీకి కూడా నిర్దిష్ట ఆధారం చూపలేకపోయారని కాకాణి పేర్కొన్నారు. సిట్ దర్యాప్తు పేరుతో వ్యక్తులను ఒత్తిడికి గురిచేసి, ప్రలోభపెట్టి వాంగ్మూలాలు తీసుకుంటున్నారని, సత్యప్రసాద్‌ను అప్రూవర్‌గా మార్చి ఆయన వాంగ్మూలాల ఆధారంగా కేసును ముందుకు నడిపించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ప్రెస్‌మీట్‌లో కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఏమన్నారంటే.. - రూ.లక్ష కోట్ల నుంచి రూ.3 వేల కోట్లకు.. లిక్కర్ స్కామ్ లెక్కల్లోనే తేడాలు “ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరుగుతున్న ప్రతిసారీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు లిక్కర్ కేసును తెరపైకి తెస్తున్నారు. ఎన్నికలకు ముందు లిక్కర్ స్కామ్ రూ.లక్ష కోట్లు అని చెప్పిన చంద్రబాబు.. పవన్ కల్యాణ్ రూ.44 వేల కోట్లు, టీడీపీ నేతలు రూ.33 వేల కోట్లు, అసెంబ్లీ శ్వేతపత్రంలో రూ.18 వేల కోట్లు, చివరకు సిట్ రూ.3 వేల కోట్లు అంటోంది. ఒకే కేసులో ఇన్ని రకాల లెక్కలు రావడం వెనుక వాస్తవాలు లేవనే విషయం స్పష్టమవుతోంది. రూ.3 వేల కోట్ల స్కామ్ జరిగిందని చెబుతున్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి అక్రమ లావాదేవీని కూడా నిర్దిష్ట ఆధారాలతో చూపలేకపోయారు. రెండేళ్లుగా దర్యాప్తు సాగుతున్నా కొత్త పాత్రలు, కొత్త వాంగ్మూలాలతో కేసును సాగదీస్తున్నారు.” - సత్యప్రసాద్‌ను అప్రూవర్‌గా మార్చి కేసును నడిపించే ప్రయత్నం “సత్యప్రసాద్‌ను అప్రూవర్‌గా మార్చి ఆయన వాంగ్మూలం ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఆయన 2025 ఫిబ్రవరి 21న దర్యాప్తు అధికారి ముందు, ఫిబ్రవరి 25న మేజిస్ట్రేట్ ముందు, జూలై 16న మరోసారి, తాజాగా మరో వాంగ్మూలం ఇచ్చారు. ఆయన చెబుతున్న భారీ మొత్తాల చెల్లింపులను స్వయంగా చూశారా? సంబంధిత వ్యక్తులతో సమావేశాల్లో పాల్గొన్నారా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 57 మంది వ్యక్తులు, సంస్థలను కేసులోకి లాగి 17 మందిని అరెస్ట్ చేశారు. పలువురికి బెయిల్ వచ్చింది. కుటుంబ సభ్యులను బెదిరించడం, వ్యక్తులను ప్రలోభపెట్టడం, ఒత్తిడి చేయడం వంటి పద్ధతులతో వాంగ్మూలాలు తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.” - దర్యాప్తు పేరుతో ఒత్తిళ్లు.. హైకోర్టు వరకు వెళ్లిన బాధితులు “దర్యాప్తు అధికారుల మాట విన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గన్‌మ్యాన్‌కు జీతం పెంపు, ప్రమోషన్లు ఇచ్చిన వ్యవహారం ఉంది. మరో గన్‌మ్యాన్ వాస్తవాలు చెప్పినందుకు థర్డ్ డిగ్రీకి గురై హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. వెంకటేష్ నాయుడిని కూడా తమకు అనుకూలంగా స్టేట్‌మెంట్ ఇవ్వాలని డబ్బులు ఇస్తామంటూ ప్రలోభపెట్టిన విషయాన్ని కోర్టులో వెల్లడించారు. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలోని ఫార్మ్‌హౌస్‌లో రూ.11 కోట్ల నగదు వ్యవహారంలోనూ హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. సీజ్ చేసిన ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడంలో ఆలస్యం జరిగింది. ఇలాంటి పరిణామాలు దర్యాప్తు తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.” - వైయస్ జగన్ హయాంలో మద్యం దుకాణాలు తగ్గించాం.. కూటమి పాలనలో విచ్చలవిడిగా విక్రయాలు “వైయస్ జగన్ హయాంలో మద్యం దుకాణాలను 4,380 నుంచి 2,934కి తగ్గించాం. సుమారు 43 వేల బెల్ట్ షాపులను నియంత్రించాం. కొత్త డిస్టిలరీలకు అనుమతులు ఇవ్వకుండా, క్యూఆర్ కోడ్, డైనమిక్ ఆర్డర్లతో మద్యం సరఫరాలో పారదర్శకత తీసుకొచ్చాం. దీనికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయ కేంద్రాలు, బార్లు, పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు పెరిగాయి. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదులను కూడా పునర్విచారణ చేయాలి. ప్రస్తుతం జరుగుతున్న మద్యం వ్యవహారాలపై ప్రభుత్వం మారిన తర్వాత సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం.”