తాడేపల్లి: రాష్ట్రంలో మత, కుల, ధన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ వెన్నుపోటు పార్టీ, చంద్రబాబు నాయుడేనని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి విలువలకైనా దిగజారి, అవసరానికి అనుగుణంగా ఒక్కో పార్టీతో పొత్తులు పెట్టుకోవడం చంద్రబాబు రాజకీయ విధానమని ఎండగట్టారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా లేకే కుల, మత రాజకీయాలకు చంద్రబాబు నాయుడు చిచ్చు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల అవసరాల కోసం గతంలో బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు, అనంతరం అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత మళ్లీ బీజేపీతో జతకట్టిన నీచమైన రాజకీయ చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు, నైతిక విలువల కంటే అధికారమే లక్ష్యంగా దిగజారే ఏకైక నాయకుడు దేశంలో చంద్రబాబు మాత్రమేనని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎల్లో మీడియా ద్వారా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కొనే సామర్థ్యం లేకే ఆయనపై వ్యక్తిగత, మతపరమైన ఆరోపణలు చేస్తున్నారని కన్నెర్ర చేసారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, ప్రజా సమస్యల నుంచి వారి దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా ఏం మాట్లాడరంటే... మీ హయాంలో ఘటనలకు ఏం సమాధానం చెబుతారు హిందూ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న టీడీపీ నేతలు గతంలో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలకు సమాధానం చెప్పాలి. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో పలు ఆలయాలు, ఇతర నిర్మాణాలు తొలగించిన ఘటనలకు ఏం సమాధానం చెబుతారు. ఆ సమయంలో ఆంజనేయస్వామి విగ్రహానికి సంబంధించిన ఘటనను విజయవాడ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. హిందూ ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పే చంద్రబాబు.. గతంలో జరిగిన ఈ ఘటనలపై ప్రజలకు ఏం సమాధానం చెప్తారు. శ్రీశైలంలో శివభక్తులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తిరుమలలో భక్తుల ప్రాణాలు కోల్పోయిన తొక్కిసలాట ఘటనపై కూడా ప్రభుత్వం బాధ్యత వహించి, భక్తుల భద్రతకు తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలి. దేవాలయాల్లో హుండీల లెక్కింపు, భద్రతకు సంబంధించిన అంశాలపై కూడా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుమలతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాల పవిత్రత, సంప్రదాయాలను కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు. తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు తీసుకున్న నిర్ణయాలు ఆదర్శప్రాయం. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో రాజకీయాలు చేయడం సరికాదు. లడ్డూ వ్యవహారంపై ఏం చెబుతారు తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు సమర్పించిన అంశాలను కూటమి ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా వివరించాలి. ఈ అంశంపై రాజకీయ ప్రచారం కాకుండా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిందే. చంద్రబాబు ప్రభుత్వం తన పాలనలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలు, ఎన్నికల హామీల అమలు, పరిపాలనా వైఫల్యాలపై సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోని విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా, అన్నీ అమలు చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలుపై ప్రజలకు వాస్తవాలను వివరించాలి. ప్రభుత్వం తన రెండేళ్ల పాలనలో చేసిన పనులపై సమాధానం చెప్పకుండా ప్రతిపక్షంపై విమర్శలు చేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోంది. సమాధానం చెప్పలేకే.. డైవర్షన్ పాలిటిక్స్.. విశాఖపట్నంలో ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం ప్రజలకు నీరు అందించడంపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి బీచ్‌లో కార్యక్రమాలు నిర్వహించడం, ప్రచార కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతున్నందునే ప్రతిరోజూ కొత్త అంశాలను తెరపైకి తెస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ప్రజా సమస్యలపై చర్చించాలి. వ్యక్తిగత విమర్శలు, మతపరమైన ఆరోపణలు చేయడం మానుకోవాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు లెక్కలు చెప్పాలి. డైవర్షన్ రాజకీయాలను పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలి. ఎల్లో మీడియా ద్వారా వైఎస్సార్‌సీపీపై బురదజల్లే ప్రయత్నాలు చేసినంత మాత్రాన ప్రజలు వాస్తవాలను మర్చిపోరు ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడం, ఇచ్చిన హామీలను అమలు చేయడమే ప్రభుత్వ బాధ్యత.