ఈనాడు త‌ప్పుడు క‌థ‌నాల ఆధారంగా అక్ర‌మ కేసులు 

వైయ‌స్ఆర్‌సీపీ  బీసీ నాయ‌కుల టార్గెట్‌గా వేధింపులు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ఫైర్ 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ 

నైతిక విలువ‌లు లేని ఈనాడుని ఫాలో అవుతున్న పోలీసులు

చ‌ట్టాలు, న్యాయ‌స్థానాల ఆదేశాలు కూడా బేఖాత‌ర్ 

సీదిరి అప్ప‌ల‌రాజు, చింతాడ ర‌వి, ఎమ్మెల్యే బూసిని విరూపాక్షిల‌పై ఈనాడు త‌ప్పుడు క‌థ‌నాలు

బీసీ నాయ‌కులే టార్గెట్‌గా ఎల్లో మీడియా త‌ప్పుడు ప్ర‌చారం 

పాల‌న‌లో విఫ‌ల‌మై, అన్యాయాల‌ను ప్ర‌శ్నిస్తుంటే ఓర్చుకోలేక‌పోతున్నారు

ఈ వెన్నుపోటు కూట‌మి ప్ర‌భుత్వం బంగాళాఖాతంలో క‌ల‌వ‌డం ఖాయం  

స్ప‌ష్టం చేసిన కొండా రాజీవ్ గాంధీ

తాడేప‌ల్లి:  వెన్నుపోటు కూట‌మి ప్రభుత్వంలో పోలీసులు చ‌ట్టాల‌ను, రాజ్యాంగాన్ని ప‌క్క‌న‌పెట్టి.. నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం, ఈనాడు క‌థ‌నాల ఆధారంగానే ప‌నిచేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల మీద అక్ర‌మ కేసులు బ‌నాయించి వేధింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని పార్టీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి కొండా రాజీవ్ గాంధీ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈనాడులో రాసిన క‌థ‌నాల ఆధారంగా కేసులు న‌మోదు చేసేట్ట‌యితే, ఈనాడు కార్యాల‌యాల‌నే పోలీస్ స్టేష‌న్‌లుగా మార్చుకోవ‌చ్చు క‌దా ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా బీసీ నేతలే టార్గెట్‌గా చంద్రబాబు అండ్ కో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అన్యాయాలను ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు, ఎమ్మెల్యే బూసిని విరూపాక్షి, మాజీ ఎమ్మెల్యే ముస్త‌ఫాల‌ను ఈనాడు క‌థ‌నాల ఆధారంగానే త‌ప్పుడు కేసులు న‌మోదు చేసి అక్ర‌మంగా అరెస్టు చేశార‌ని ఆరోపించారు. వైఎస్ జ‌గ‌న్ గారిని క‌ల‌వ‌డానికి వెళ్లిన వారిపైనా కేసులు న‌మోదు చేస్తున్నారంటే.. ఈ ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని చూసి ఎంత అభ‌ద్ర‌తా భావంలో ఉందో అర్థ‌మైపోతుంద‌ని స్ప‌ష్టం చేశారు. పోలీసులు బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి నేరస్థులను రక్షిస్తూ బాధితులనే శిక్షిస్తున్నారని కొండా రాజీవ్ గాంధీ ఆరోపించారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...  

'ఈనాడు' కథనాల ఆధారంగా పోలీసుల తప్పుడు కేసులు

టీడీపీ నాయకుడు నాగరాజు పోలీసుల సమక్షంలోనే తన భార్య దుస్తులు చించి అరాచకానికి పాల్పడితే వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి గారిపై కేసు పెట్టడం అత్యంత అమానుషం. ఆ ఘటనకు సంబంధించిన వీడియా బయటకు రాకపోతే నిజాలు ముసుగులోనే ఉండిపోయేవి.  
మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు, వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి, ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వర్ రెడ్డి, ఆముదాలవలస ఇంచార్జ్ చింతాడ రవి, మాజీ ఎమ్మెల్యే ముస్త‌ఫాల‌పై ఈనాడులో వ‌చ్చిన క‌థ‌నాలు ఆధారంగానే అక్ర‌మ కేసులు పెట్టారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి జాబితా 'ఈనాడు' ఆఫీసుకు చేరుతుంది. అక్కడి నుంచి తప్పుడు కథనాలు రాసి, మరుసటి రోజే వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈనాడు క‌థ‌నాల ఆధారంగానే కేసులు న‌మోదు చేసేట్ట‌యితే రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ బోర్డులు తీసేసి 'ఈనాడు కార్యాలయాలకే బోర్డులు పెట్టుకోవడం మంచిది. ప్రజాస్వామ్య విలువలను కాపాడటం మాని, చంద్రబాబు అబద్ధాలకు కాడి మోయడానికే ఈనాడు పనిచేస్తోంది. చ‌ట్టాల‌ను తుంగ‌లో తొక్కి, రాజ్యాంగాన్ని ప‌క్కన పెట్టి నైతిక విలువ‌లు లేని ఈనాడు క‌థ‌నాల ఆధారంగా పోలీసులు ప‌నిచేయ‌డం సిగ్గుచేటు. గతంలో ఎన్టీ రామారావు, వంగవీటి మోహన్ రంగా, మెగాస్టార్ చిరంజీవి, బెల్లి లలిత వంటి ప్రముఖులపై 'ఈనాడు' విష ప్రచారం చేసి వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసింది.  

భోగాపురం విమానాశ్రయం జగన్ ఘ‌న‌తే 

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వైఎస్ జగన్ గారి మానస పుత్రిక. ఆయన రెక్కల కష్టాన్ని చంద్రబాబు దోచుకోవాలని చూస్తున్నాడు. భూసేకరణ, పరిహారం, క్లియరెన్సులు, టెండర్లు, కన్సెషన్ అగ్రీమెంట్ ఇలా అన్ని కీలక పక్రియ‌లు జగన్ గారి హయాంలోనే పూర్తయ్యాయి. శిలాఫ‌ల‌కం వేయ‌డం మిన‌హా ఆయ‌న చేసింది శూన్యం. 2019 ఎలక్షన్ల ముందు చంద్రబాబు శంకుస్థాపన చేసిన కుప్పం, దగదర్తి ఎయిర్‌పోర్టుల ప‌రిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చెప్పాలి. జ‌గన్ గారిది హార్డ్ వర్క్, చంద్రబాబుది షో వర్కు.. "జగన్ గారిది సింప్లిసిటీ – చంద్రబాబుది పబ్లిసిటీ". గత ఐదేళ్ల జగన్ పాలనలో ఉత్త‌రాంధ్ర‌ అభివృద్ధి కోసం జ‌గ‌న్ గారు ఎంతగానో కృషి చేశారు. టిసిఎస్, ఇన్ఫోసిస్, యోకోహామా టైర్స్, బల్క్ డ్రగ్ పార్క్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, మూలాపేట పోర్ట్, ఉద్దానం తాగునీటి ప్రాజెక్ట్, మెడికల్ కాలేజీలు వచ్చాయంటే ఆయ‌న ఘ‌న‌తే. కూటమి ప్రభుత్వం వచ్చాక గత రెండేళ్లలో వచ్చిన పెట్టుబడులు కేవలం రూ. 6,962 కోట్లు మాత్రమే. కానీ వారు మాత్రం 
రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 25 లక్షల ఉద్యోగాలు అని పచ్చి అబద్ధాలు చెప్పుకోవ‌డం సిగ్గుచేటు. 

అమాయకులైన ప్రజలు, ఉత్తరాంధ్ర జనాలు ఈ దుర్మార్గ, అవినీతి పాలనను గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో జనుల తిరుగుబాటుతో కూటమి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడం ఖాయం. అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్న ప్రతీ ఒక్కరికీ వైఎస్ జగన్ గారి అండదండలు ఉంటాయి. కూటమి ప్రభుత్వం బీసీలను అణచివేసే ప్రయత్నం చేస్తోంది. బీసీలకు వైఎస్ జగన్ గారు వెన్నెముకలా నిలబడ్డారని కొండా రాజీవ్ గాంధీ స్ప‌ష్టం చేశారు.
 

Back to Top