ప్రజాప్రతినిధులపై రౌడీషీట్లు, అర్ధరాత్రి అరెస్టులా? 

రాష్ట్రంలో నడుస్తున్నది రాజ్యాంగమా... రెడ్ బుక్ పాలనా?: 

వైయ‌స్ఆర్‌సీపీ  లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఫైర్ 

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి.

నారా లోకేష్‌ది యువగళం కాదు... రౌడీ దళం:

డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తే రక్తాలు కారేలా దాడి చేస్తారా?

బాధితులపైనే తిరిగి అక్రమ కేసులు నమోదు చేస్తారా?

సూటిగా ప్రశ్నించిన  మనోహర్ రెడ్డి.
 
అధికారం ఎల్లకాలం ఎవరికీ శాశ్వతం కాదు... 

తప్పుడు కేసులు బనాయిస్తున్న వారికి భవిష్యత్తులో చట్టం రుచి చూపిస్తాం: 

హెచ్చరించిన మనోహర్ రెడ్డి.

తాడేపల్లి : డీఎస్సీ అక్రమాలపై శాప్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నిరుద్యోగులపై టీడీపీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా తిరిగి... బాధితులపై అక్రమ కేసులు బనాయించడంపై వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళల్లో నేతల ఇళ్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. మరోవైపు ఐదేళ్ల నాటి కేసును అడ్డం పెట్టుకుని ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో పాటు ప్రజాప్రతినిధులపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని విజయవాడ సీపీ సర్క్యులర్ జారీ చేయడం రాజకీయ కక్షసాధింపుకు పరాకాష్ట అని ఆయన స్పష్టం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం, అధికారం ఎల్లకాలం శాశ్వతంగా ఉండవన్న విషయాన్ని వెన్నుపోటు పాలకులు, వారికి తొత్తులుగా మారిన పోలీసులు గుర్తుంచుకోవాలని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఇవాళ  అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ చట్ట ప్రకారం కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. వ్యవస్థలను నాశనం చేస్తున్న తీరుపై న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే... 
ఉపాధ్యాయుల ముసుగులో టీడీపీ రౌడీ మూకల దాడి..:
డీఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని, నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరుతూ శాప్ కార్యాలయం వద్ద నిరుద్యోగులతో కలిసి శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ముందస్తు సమాచారం ఇచ్చాం. అయితే, సెక్షన్ 30 అమలులో ఉందని మాకు అనుమతి నిరాకరించిన పోలీసులు, మరోవైపు మూడు బస్సుల్లో టీడీపీ రౌడీ మూకలను అక్కడికి రప్పించారు. వారికి ఉపాధ్యాయుల ముసుగు వేసి, లోపల షామియానాలు వేసి పంచభక్ష పరమాన్నాలు వడ్డించారు. చివరకు పోలీసుల చేతుల్లోని లాఠీలను లాక్కుని, వికలాంగులని కూడా చూడకుండా నిరుద్యోగులపై, మా పార్టీ కార్యకర్తలపై నెత్తురోడేలా దాడి చేశారు. లోకేష్‌ది యువగళం కాదు, అది పక్కా రౌడీ దళం.

చంద్రబాబు డైరెక్షన్‌లోనే రక్తపాతం..:
 దాడి ముమ్మాటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు డైరెక్షన్‌లో జరిగిందేననడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ నిరసన ప్రారంభం కాకముందే కుప్పం మీటింగ్‌లో చంద్రబాబు మాట్లాడుతూ ‘శాప్ ఆఫీస్ వద్ద గొడ్డలి పార్టీ వారు ఉపాధ్యాయులపై దాడి చేస్తున్నారు’ అని ప్రకటించారు. అక్కడ దాడి జరిగింది టీడీపీ రౌడీల చేతుల మీదుగా అయితే, ఎల్లో మీడియా గురువులపై దాడి అంటూ తప్పుడు కథనాలు వండి వార్చింది. ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోకుండా, బాధితులైన మా నేతలపైనే అక్రమంగా ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

అర్ధరాత్రి వేధింపులు.. అక్రమ ఎఫ్‌ఐఆర్‌లు..:
రాష్ట్రంలో పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణను విస్మరించి, అధికార పార్టీకి తొత్తులుగా మారారు. అర్ధరాత్రి పూట టాస్క్ ఫోర్స్ పేరిట సత్తెనపల్లి ఇంచార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ హాస్పిటల్, ఇళ్లలోకి చొరబడి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్లడం ఏ రాజ్యాంగం ఇచ్చిన హక్కు? ఎఫ్‌ఐఆర్‌లలో ‘ఇతరులు’ అనే పదాన్ని చేర్చి, స్థానిక టీడీపీ నేతలు ఎవరి పేర్లు చెబితే వారిని నిందితులుగా చేరుస్తున్నారు. మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లలో ఆధారాలతో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ప్రభుత్వానికి లేదు కానీ, ప్రశ్నించిన వారిపై వందల సంఖ్యలో కేసులు పెడుతున్నారు. డీఎస్సీలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్ పేరిట జరిగిన దొంగ సర్టిఫికెట్ల స్కామ్‌ మీద దర్యాప్తు చేయడానికి లేని అత్యుత్సాహం ప్రతిపక్షాలపై ఎందుకు చూపిస్తున్నారు?

కోర్టు చెంపపెట్టు.. తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులు..:
నిరసనకారులతో ఏమాత్రం పరిచయం లేని నంద్యాలకు చెందిన ఉపాధ్యాయుడితో వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారు. అసలు ఆ ఉపాధ్యాయుడికి ఇక్కడి నేతలెవరో కూడా తెలియదు. చివరకు ఎస్సీలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం చెల్లదంటూ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించి, ఆ సెక్షన్లను కొట్టివేయడం పోలీసుల దిగజారుడుతనానికి నిదర్శనం.

ఎన్నికల కుట్రతోనే ప్రజాప్రతినిధులపై రౌడీషీట్లు..:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు పోటీ చేయకుండా అడ్డుకోవడానికే ప్రభుత్వం రౌడీషీట్ల వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఐదేళ్ల క్రితం టీడీపీ ఆఫీసు ఘటన కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టుల నుంచి బెయిళ్లు వచ్చిన వారిపై, నోటీసులు ఇచ్చిన వారిపై మళ్లీ రీఇన్వెస్టిగేషన్ పేరుతో వేధిస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, కార్పొరేటర్లపై రౌడీషీట్లు ఓపెన్ చేయాలని విజయవాడ సీపీ మెమో ఇవ్వడం అత్యంత హేయమైన చర్య. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రౌడీ ముద్ర వేసి గొంతు నొక్కేయాలని చూస్తున్నారు..

చంద్రబాబు,పవన్, లోకేష్‌లపై రౌడీషీట్లు ఓపెన్ చేస్తారా?:
పోలీస్ వ్యవస్థను, డీజీపీని సూటిగా ప్రశ్నిస్తున్నాం... చంద్రబాబుపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి, లోకేష్‌పై కేసులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్‌పై పదికి పైగా కేసులు ఉన్నాయి. మరి వాళ్లందరిపై కూడా రౌడీషీట్లు ఓపెన్ చేసే దమ్ము మీకుందా? రాష్ట్రంలో నడుస్తున్నది రాజ్యాంగ పాలనా లేక రెడ్ బుక్ పోలీసు రాజ్యమా? తక్షణమే అక్రమంగా నమోదు చేసిన ఐదు ఎఫ్‌ఐఆర్‌లను, రౌడీషీట్ల మెమోను బేషరతుగా ఉపసంహరించుకోవాలి. దీనిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం.

పోలీసులకు, కూటమి పాలకులకు హెచ్చరిక..:
ఈ నేపధ్యంలో అధికారం ఎల్లకాలం ఎవరికీ శాశ్వతం కాదని.. వెన్నుపోటు పార్టీ కూటమి నేతలు చేస్తున్న అధికార దుర్వనియోగం, అధికార పార్టీ ఆదేశాలతో చట్టాన్ని తుంగలో తొక్కి కక్ష సాధింపులకు పాల్పడుతున్న అధికారులు ఈ నిజాన్ని గుర్తుంచుకోవాలని మనోహర్ రెడ్డి హెచ్చరించారు. రేపు వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా వ్యవహరించిన ప్రతి అధికారి వ్యక్తిగతంగా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది, చట్టం అంటే ఏంటో వారికి రుచి చూపిస్తామని స్పష్టం చేశారు.

Back to Top