హైకోర్టులో వైయ‌స్ఆర్‌సీపీ హౌస్‌ మోషన్‌ పిటిషన్ 

తాడేపల్లి: పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. పుంగనూరులో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంపై పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని, పోలీసు రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ వివాదంపై తిరుపతిలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికలలో  పార్టీ అభ్యర్థుల పోటీపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ అడ్డంకులు సృష్టించినా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల బరిలో నిలిచి తీరుతామని వెల్లడించారు. ‘పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడంపై వైయ‌స్ఆర్‌సీపీ ఎక్కడా రాజీ పడదు. ఇది మా అభ్యర్థుల హక్కు. నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలను అడ్డుకోవడానికి, మా అభ్యర్థుల న్యాయమైన హక్కులను కాపాడటానికి ఎంతటి న్యాయ పోరాటానికైనా మేము సిద్ధం’అని ప్రకటించారు.

Back to Top