ప్రకాశం జిల్లా: దర్శిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు బయలుదేరిన వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడినట్లు సమాచారం. అభ్యర్థులకు మద్దతుగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. టవర్ సెంటర్‌లో పోలీసులు భారీ కేడ్లు ఏర్పాటు చేసి అభ్యర్థుల రాకపోకలకు అడ్డంకులు కల్పించారు. నామినేషన్ కేంద్రాల లోపల, బయట టీడీపీ కార్యకర్తలు, రౌడీషీటర్లు హల్‌చల్ చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. చైర్మన్ అభ్యర్థితో పాటు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైయస్ఆర్‌సీపీ వర్గాలు ఆరోపించాయి. అభ్యర్థులందరికీ నామినేషన్లు వేసే అవకాశం కల్పించి, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.