లక్ష్యం లేని యాత్ర చేసిన "నారా సింగడు" లోకేష్

వెన్నుపోటుకు చంద్ర‌బాబు, పప్పుకు లోకేష్ బ్రాండ్‌ అంబాసిడర్లు

అరవడం.. బెదిరించడం.. కామెడీ చేయడమే.. లోకేశ్‌ యాత్ర

పాదయాత్రకు పేటెంట్‌దార్లు మహానేత వైయ‌స్‌ఆర్, వైయ‌స్ జగన్‌..

బాబు, పవన్, లోకేశ్‌లు ఏపీకి నాన్‌లోకల్స్

2024లో 175కి 175స్థానాలూ వైయ‌స్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంటుంది

వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి 

తాడేప‌ల్లి: ‘సింగడు అద్దంకి వెళ్లాడు వచ్చాడు..’ అన్న చందంగా చంద్రబాబు నాయుడు కొడుకు నారా సింగడు అలియాస్ నారా లోకేశ్‌ రాష్ట్రంలో పాదయాత్ర మొదలుపెట్టి ముగించాడని వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. అసలెందుకు యాత్ర చేశాడంటే.. ఏమో చేశాను.. ముగించాననే స‌మాధాన‌మే చెబుతున్నాడన్నారు. యువగళం పేరిట లోకేష్ చేసిన యాత్రకు ఒక లక్ష్యమంటూ లేదన్నారు. లోకేష్‌ ఎవరి కోసం పాదయాత్ర చేశాడో అతనికే తెలియడంలేదని విమ‌ర్శించారు. రాత్రిపూట నడిచాడో.. పగటిపూట పడుకున్నాడో గానీ.. మొత్తానికి అక్కడక్కడా రుచికరమైన వంటలు తింటూ సవాలక్ష కామెడీలతో యువగళం యాత్రను మమ అనిపించేశాడని ఎద్దేవా చేశారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా కారుమూరి వెంక‌టరెడ్డి ఏం మాట్లాడారంటే..
రాజకీయాల్లో విలువైన పాదయాత్ర లక్ష్యాన్ని, అర్ధాన్ని పూర్తిగా మార్చేసిన వ్యక్తి నారా లోకేశ్‌. మరి, చంద్రబాబు కూడా పాదయాత్ర చేశానంటాడు కదా..? నువ్వు గానీ మీ నాన్న గానీ ఎందుకు పాదయాత్ర చేపట్టారో.. మీ ఉద్దేశాలేంటో కనీసం ప్రజలకైనా వివరించారా..? అసలు, మీ ఇద్దరి పాదయాత్ర ఎవరికి గుర్తుంటుంది. ఆ యాత్ర ద్వారా ప్రజలకు ఏమైనా మేలు కలిగితే గుర్తుంచుకుంటారు గానీ.. ఎవరికీ ఏ ప్రయోజనం లేనప్పుడు మీ యాత్రలతో ఎవరికి అవసరముంటుంది..? 

మీ నాన్న చంద్రబాబు హయాంలో పేదలకు మేలు చేసిన ఏదైనా ఒక మంచి సంక్షేమ పథకం అమలైందో చెప్పగలవా..? మీ తాత ఎన్టీఆర్‌ను పొడిచిన వెన్నుపోటు పథకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు అని అందరికీ గుర్తుకొచ్చే విషయం తప్ప ఆయనొక పరిపాలనాదక్షుడిగా మాత్రం గుర్తుకు రారు. 

మీ అనుకూల పచ్చమీడియా ఎలివేషన్స్‌ ఇచ్చినంత మాత్రానా నువ్వు పెద్ద నాయకుడివైపోవు లోకేశ్‌..? నాయకుడంటే ప్రజల్లో నుంచి రావాలి. వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలి. మీ నాన్నకు మాదిరిగా పచ్చమీడియా హైప్‌ చేసి చూపించినంత మాత్రానా నువ్వు ప్రజల్లో హీరోగా ఎదగలేవని తెలుసుకోవడం మంచిదని చెబుతున్నాను. చంద్రబాబుకు వెన్నుపోటుదారుడు అని పేరెంత ఫేమసో.. లోకేశ్‌ కూడా జీవితాంతం పప్పుగానే మిగిలిపోవడం ఖాయం. అడ్డదారిలో మంత్రి పదవి వెలగబెట్టి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలవనోడివి.. ఇప్పుడు యాత్ర చేసినంత మాత్రానా నువ్వు మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలుస్తానని గాల్లో మేడలు కట్టుకోకు. నీ జీవితాంతంలో ఎమ్మెల్యే కాలేవు. 

అరవడం.. బెదిరించడం..కామెడీ చేయడం.. ఇదీ లోకేశ్‌ యాత్ర తీరు
లోకేశ్‌ యాత్ర అనగానే మొదట్లో ఎల్లోమీడియా హంగామా అంతా ఇంతా కాదు. మొత్తం 400 రోజులపాటు కొనసాగి 4వేల కిలోమీటర్లు నడుస్తారంటూ టీడీపీ అనుకూల ఎల్లోమీడియా ఎన్నెన్నో ఎలివేషన్స్‌ ఇచ్చాయి. తీరా, 226 రోజులకే పాదయాత్ర ముగిస్తున్నానంట్నునాడు. 3వేల  కిలోమీటర్లు లోకేశ్‌ ఎప్పుడు నడిచాడో కూడా ఎవరికీ తెలియదు. యాత్ర మధ్యలో మూడ్నెల్లపాటు బ్రేక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ ప్రారంభమైన యాత్రలో అర్ధరాత్రినో, తెల్లవారుజామున నడిచాడో గానీ మొత్తానికి యాత్ర మమ అనిపించాడు. ఈ యాత్రతో అతను ఏం సాధించాడంటే, అరిచాడు.. పోట్లాడాడు.. తిట్టాడు... కొందరిని అంతు చూస్తానన్నాడు. ఎర్రబుక్కులో రాసుకున్న పేర్లందరికీ మేము అధికారంలోకి రాగానే జైలుకు పంపుతామంటూ బెదిరించాడు. వీటన్నింటితో పాటు అనేక రకాలుగా కామెడీలు కూడా చేశాడు. ఇవి తప్ప యువగళం పాదయాత్రతో లోకేశ్‌ సాధించిందేంటి..? అని సూటిగా ప్రశ్నిస్తున్నాను. 

పాదయాత్రంటే గుర్తొచ్చే నేతలు వైయ‌స్‌ఆర్‌, వైయ‌స్ జగన్ 
రాజకీయాల్లో పాదయాత్రకు అత్యంత ప్రాధాన్యతను తెచ్చిన నేతగా ఆనాడు మహానేత దివంగత వైయ‌స్‌ రాజశేఖర రెడ్డినే చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ మహాఘట్టానికి పేటెంట్‌గా ఆయన తనయులు  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డినే చెప్పాలి. పాదయాత్రలో అప్పుడు వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి పల్లెపల్లెకు కనెక్ట్‌ అయ్యారు. పల్లెలకు, రైతులకు ఒక భరోసానిచ్చారు. ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ .. ఇలా అనేకరకాల మంచి పథకాలకు రూపకల్పన, పాదయాత్ర నుంచే మొదలయ్యాయని మనందరికీ గుర్తుకొస్తాయి. ఆ తర్వాత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి యాత్ర చేపట్టగానే.. ప్రజలు ఎదురొచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు. మీ నాన్న ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పుడు అమలు కావడంలేదయ్యా అని చెప్పారు. మరలా వాటిని అమలు చేయాలని వారు కోరినట్లు.. జగనన్న అధికారంలోకి రాగానే చెప్పిన హామీలతోపాటు చెప్పనటువంటి మరో 40 హామీలనూ అమలు చేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే కాకుండా దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా ఆయన చరిత్రలో నిలిచారు. 

సింగిల్‌గా పోటీ చేసే దమ్ములేని బాబు
లోకేశ్‌.. వచ్చీరాని తెలుగు మాట్లాడుతూ పచ్చిబూతులు తిడుతూ ఎర్రబుక్కు అంటూ బెదిరించడం కాదు. లేనిపోని కబుర్లు చెప్పి ప్రభుత్వం మీద, సీఎం వైయ‌స్‌ జగన్‌పై అదేపనిగా బురదజల్లే ప్రయత్నం చేసినంత మాత్రానా నువ్వు మా నాయకుడి స్థాయికి ఎదగలేవని తెలుసుకో. నీకు నువ్వు వైయ‌స్‌ జగన్‌తో పోల్చుకుంటూ మాట్లాడుతున్నావు. సీఎం వైయ‌స్‌ జగన్‌ని తట్టుకోవడం సింగిల్‌గా నీ తండ్రి వల్లనే కాలేక.. పదిమందిని పోగేసుకుని గుంపుగా వస్తున్నాడు. అలాంటిది, పిల్ల బచ్చావు నీకూ మా నాయకులు వైయ‌స్ జగన్‌కి పోలికా..? 

బాబు, పవన్, లోకేశ్‌లు నాన్‌లోకల్స్
గుర్తుకొచ్చినప్పుడు ఏపీకి వచ్చి యాత్రలు చేసి పోవడానికి ఈ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు ఎవరని అడుగుతున్నాను. మీరంతా ఏపీకి నాన్‌లోకల్స్‌ అని ప్రజలకు మాత్రం తెలియదనుకుంటున్నారా..? మీతో పాటు మిమ్మల్ని భుజాలనెత్తుకుని మోస్తున్న పచ్చమీడియా ఛానెళ్ల యాజమాన్యాల శాశ్వత నివాసం కూడా తెలంగాణ రాష్ట్రమైతే.. మరి, మీకు- మా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలతో సంబంధం ఏంటని నిలదీస్తున్నాను. మీరంతా తెలంగాణ వాసులుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల నాశనాన్ని కోరుకునే వారని మేము స్పష్టం చేస్తున్నాము. దీన్నిబట్టి ప్రజలు కూడా నాన్‌లోకల్‌ పొలిటికల్‌ టూరిస్టుల తప్పుడు ప్రచారానికి ఆకర్షితులు కారాదని విజ్ఞప్తి చేస్తున్నాను.

2019లోనే మీ పతనం మొదలైంది
ఏపీలో బలమైన వైయ‌స్‌ఆర్‌సీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన పార్టీలు మిగతావారిని కూడా కలుపుకుని గుంపుగా పోటీకొస్తారంట. అందులో భాగంగా ఇప్పుడు ఒకే వేదికపై గుంపు కడతారంట. లోకేశ్‌ ముగింపు సభలో ఈ గుంపంతా ఒకచోటికి చేరి ఏం సాధిస్తారు..? గతంలో ఇదే చంద్రబాబు మ్యానిఫెస్టోలో 650 హామీల్ని గాలికొదిలేసి.. చివరికి ఎవరైనా నిలదీస్తారేమోననే భయంతో పార్టీ వెబ్‌సైట్‌ నుంచి కూడా మ్యానిఫెస్టోను తొలగించుకున్న వైనం అందరికీ తెలిసిందే. మరి, అప్పట్లో నిలబెట్టుకోలేని హామీలకు నేను జవాబుదారీగా ఉండి చంద్రబాబును ప్రశ్నిస్తానన్న పవన్‌కళ్యాణ్‌ నోరుతెరవలేదు. కాబట్టే, 2019 ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు పుట్టగతుల్లేకుండాపోయాయి. నిజానికి అప్పుడే టీడీపీ, జనసేన పతనం మొదలైందని చెప్పుకోవాలి. మళ్లీ, వీరిద్దరూ కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టోతో కలిసి పోటీచేస్తున్నామంటే .. ఈ కూటమిని నమ్మడానికి ప్రజలంత పిచ్చోళ్లా..? ఇప్పుడు రాజకీయం పూర్తిగా మారిందని.. ప్రజల్ని గతంలో మాదిరిగా ప్రలోభపెట్టి మాయ చేయలేరని బాబు, పవన్, లోకేశ్‌లు గుర్తుచేసుకోవాలి. 

2024 ఎన్నికల్లో టీడీపీ , జనసేన పార్టీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవు. ఎందుకంటే, ప్రజలు ఆ రెండు పార్టీలను 2019లోనే బహిష్కరించి మూలనకూర్చోబెట్టాయి. 2024 ఎన్నికల్లో వైయ‌స్‌ఆర్‌సీపీ 175 స్థానాలకు 175 చోట్ల గెలుపొంది విజయం కైవసం చేసుకుంటుందనే సమాచారం ఆ రెండుపార్టీల అధినేతలకూ అర్ధమైనందునే వారిలో రోజురోజుకూ ఫ్రస్టేషన్‌ పెరిగి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని కారుమూరి వెంకటరెడ్డి అన్నారు.

Back to Top