విజయవాడ: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం పేరుతో చేస్తున్న అరెస్ట్‌లన్నీ అక్రమమేనని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడలోని ఏసీబీ కోర్ట్ బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేవలం వైయస్ఆర్‌సీపీని వేధించేందుకే లేని లిక్కర్ స్కాంను సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఎల్లో మీడియా చెబుతున్న లిక్కర్ స్కాంలో ఒక్క ఆధారాన్ని కూడా గుర్తించలేకపోయామని స్వయంగా సిట్ బృదమే అంగీకరిస్తోందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఆ కక్షతోనే ఈ కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... వైయస్ జగన్ హాయంలో మద్యం విక్రయాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోంచి తీసుకుని ప్రభుత్వమే నిర్వహించింది. దీనిలో కుంభకోణం ఎలా జరుగుతుంది? వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మద్య నియంత్రణ కోసం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మద్యం పాలసీని రూపొందించింది. గతంలో మద్యం విచ్చలవడిగా ఏరులై పారుతున్న పరిస్థితిని నిర్మూలించి, నిర్ధిష్టమైన వేళల్లో మాత్రమే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన షాప్‌ల్లోనే మద్యం లభించేలా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల దాదాపు 20 వేల మందికి ఉపాధిని కూడా కల్పించాం. ప్రతి మద్యం బాటిల్ వినియోగదారులు కొనుగోలు చేసిన తరువాత మాత్రమే ఆ చెల్లింపు డిస్టిలరీకి వెళ్ళే విధానంను అమలు చేశాం. డిస్టిలరీల నుంచి కొనుగోలు చేసిన మద్యం కూడా చాలా వరకు తగ్గిపోయింది. బీర్లలో దాదాపు 40 శాతం, ఇతర మద్యంలో 50 శాతం వరకు తగ్గుదల కనిపించింది. డిస్టిలరీలకు ఎక్కువ ఆర్డర్లు వస్తేనే, వారికి లాభాలు వస్తాయి, అప్పుడే వారు ఎవరికైనా లంచాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది, కానీ మా ప్రభుత్వం మద్యం ఆర్డర్లను తక్కువగా ఇవ్వడం వల్ల డిస్టిలరీలకు ఆదాయం తగ్గిపోయింది, అలాంటప్పుడు వారు లంచాలు ఇచ్చే స్థాయిలో ఉంటారా? లిక్కర్ స్కాంలో అవినీతిపైనే తలోమాట మద్యం స్కాం పేరుతో మొదట్లో రూ.50 వేల కోట్లు, ఆ తరువాత రూ.30వేల కోట్లు, మళ్లీ 18వేల కోట్లు, ఇప్పుడు రూ.3 వేల కోట్ల అవినీతి అంటున్నారు. అంటే అసలు నిజంగా ఈ స్కాం జరిగి ఉంటే ఎంత అవినీతి జరిగిందో మీ వద్దే సరైన ఆధారాలు లేవు. కేవలం ఏదో ఒకరకంగా దీనిని స్కాం అని చూపించేందుకు ఇలా రూ.50 వేల కోట్ల నుంచి రూ.3వేల కోట్లకు తమ లెక్కలను మార్చుకుంటూ వచ్చారు. దీనిని బట్టే ఇదంతా అబద్దమని తేలిపోతోంది. ఈ మద్యం డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టారని, ఆస్తులు కొన్నారని, దుబాయ్, ఆఫ్రికా దేశాల్లో పెట్టబడులు పెట్టారంటున్నారు, సినిమాలు తీశారంటున్నారు, బంగారం కొన్నారని ఇలా నోటికి ఏది వస్తే అది మాట్లాడారు. ఈ మూడు వేల కోట్లను ఇన్నింటిలో పెట్టారా? ఇది ఒక సినిమా కథలా, టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారు. పైగా దీనికి సంబంధించిన కోట్ల జీబీల డేటాను తొలగించారంటూ ఎల్లో మీడియా ఈనాడులో ఒక పెద్ద కథనం రాయించారు. అంటే అసలు ఏమీ లేని దానిని, ఏదో ఉందీ అని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారనేందుకు మీరు చేస్తున్న ఈ హంగామానే ఒక నిదర్శనం. ఆధారాలు లేని కేసుని వైయస్ జగన్ వరకు తెచ్చారు కూటమి పేరుతో అధికారంలోకి వచ్చిన తరువాత సీఎంగా చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను అమలు చేయడం విస్మరించారు. నిత్యం వైయస్ఆర్‌సీపీని ఎలా దెబ్బతీయాలి, వైయస్ జగన్‌ను ఎలా వేధించాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రానికి గాలికి వదిలేశారు, శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యం చేశారు. తనకు అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు, వారితో సిట్ అనే దానిని ఏర్పాటు చేసి, న్యాయ ప్రక్రియను అడ్డం పెట్టుకుని వేధింపులకు దిగారు. మద్యం స్కాంలో చార్జ్‌షీట్ వేసి 90 రోజులు అయ్యింది. ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. ఆధారాల కోసం సమయం కావాలని కోరుతున్నారు. ఈ చార్జ్‌షీట్‌లో వైయస్ జగన్ పేరు పెట్టడం కుట్ర కాదా? గతంలో చంద్రబాబు చేసిన అవినీతికి అన్ని ఆధారాలు ఉన్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఫైళ్ళపై చంద్రబాబు సిఫారస్‌లు, సంతకాలు ఉన్నాయి. దీనిని కేంద్ర ఈడీనే గుర్తించి కేసు నమోదు చేసింది. మద్యం స్కాంలో ఇలా ఏదైనా ప్రాథమిక ఆధారాలు చూపగలరా? లిక్కర్ స్కాం ముసుగులో చంద్రబాబు చేస్తున్న ఈ దాడికి ప్రతిఫలం ఆయన, ఆయన పార్టీ అనుభవించక తప్పుదు. ఈ అక్రమ అరెస్ట్‌లకు కుట్రదారులుగా మారి, తప్పులు చేస్తున్న వారిని వదిలిపెట్టం. న్యాయ ప్రక్రియ ద్వారా వారిపై చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు హయాంలోనే కొత్త డిస్టిలరీలకు అనుమతులు, మద్యం దుకాణాలను పెంచారు, మద్యం ఆర్డర్లు పెంచారు. దీనిలో అవినీతి చోటుచేసుకుంది. దీనిపైనే కేసు నమోదయ్యింది. ఆ కేసును రూపుమాపుకునేందుకు, కక్షసాధింపుతో ఎదురు కేసులు పెడుతున్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఆయన హయాంలో జరిగిన లిక్కర్ స్కాం, మా హయాంలో జరిగిన లిక్కర్ స్కాం ఆరోపణలను కేంద్ర సంస్థలకు ఇచ్చి రెండింటిపైనా విచారణ చేయమని అడగాలి. గతంలో వైయస్ఆర్ హయాంలో పరిటాల రవి కేసులో ఆరోపణలు వస్తే, సీఎంగా ఉండి ఆయన కేంద్ర దర్యాప్తుకు సిద్దమని ప్రకటించారు. ఎందుకు చంద్రబాబు ఈ విషయంలో ధైర్యం చేయలేకపోతున్నారు? ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ప్రమేయం ప్రత్యక్షంగా కనిపించింది. ఆయన ఫోన్ సంభాషణను ఫోరెన్సిక్ కూడా నిర్ధారించింది. ఆ కేసునే బయటకు రానివ్వకుండా చేసుకున్నారు. అన్ని ఆధారాలు దొరికినా దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇలా కేసుల్లోంచి తప్పించుకోవడం చంద్రబాబుకు అలవాటు. లిక్కర్ స్కాంపై మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి వైయస్ఆర్‌సీపీలో లేరు. ఆయన చేస్తున్న ఆరోపణలకు ఆయనే వివరణ ఇవ్వాలి.