అనంతపురం: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ విమర్శించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పుంగనూరులో వైయస్ఆర్‌సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి మద్దతుగా నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ఎంపీ, లోక్‌సభ వైయస్ఆర్‌సీపీ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై కూటమి వర్గాలు దాడికి పాల్పడ్డాయని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పరిస్థితులు సృష్టిస్తున్నారని బాబా సలామ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.