కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరులో సామాజిక సాధికారత వెల్లివిరిసింది. సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం జేజేలు పలికారు. జగనన్న అండతో సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత పొందిన తీరును నేతలు సభలో వివరించగా, జనం కరతాళధ్వనులతో అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, నటుడు ఆలీ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మాట్లాడుతూ.. ఏపీలో అందరి అవసరాలు తీర్చే పాలన, పేదల కష్టాలను గట్టెక్కించే పాలన చూస్తున్నాం. లంచాలు, రికమెండేషన్ లేకుండా నేరుగా మన ఖాతాల్లోకి పథకాల లబ్ధి వచ్చేలా చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రూ.5 లక్షల కోట్లకుపైగా అర్హత ఒక్కటే ప్రామాణికంగా అందించారు. గతంలో ఎవరూ చేయని విధంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న. గత ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వలేదు. మన ముఖ్యమంత్రి జగనన్న ఇద్దరికి మంత్రిపదవులే కాదు, ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. గిరిజన సహకార సంస్థకు చైర్మన్ కూడా వేయని దద్దమ్మ ప్రభుత్వం గత ప్రభుత్వం. గిరిజనుల పేరుతో వారి కార్యకర్తలకు, నచ్చిన వారికి నిధులు దోచేశారు. 14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన చంద్రబాబు గిరిజనులకు ఇచ్చిన భూమి కేవలం 17 వేల మందికి 40 వేల ఎకరాలే. మన జగనన్న మనమీద ప్రేమతో 3 లక్షల ఎకరాలకుపైగా, 2 లక్షల మంది గిరిజనులకు భూములిచ్చారు. పోడు భూములకు రైతు భరోసా ఇచ్చిన నాయకుడు మన జగనన్న. 3.45 లక్షల మందికి రైతు భరోసా ఇస్తున్నారు. అమ్మ ఒడి, చేయూత, చేదోడు, జగనన్న తోడు, పింఛన్.. ఇన్ని పథకాలు ఎప్పుడైనా చూశామా? నవరత్నాలు లేకపోతే గిరిజన కుటుంబాలు ఆకలితో ఉండాలి. ఇప్పుడు ఒక్క కుటుంబం కూడా ఆకలితో లేరు. 44 లక్షల మందికి అమ్మ ఒడి ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇలా ఇవ్వడం లేదు. 52 లక్షల మందికి వైయస్సార్ రైతు భరోసా, 25 లక్షల మందికి వైయస్సార్ చేయూత ఇస్తున్నారు. 79 లక్షల మందికి వైయస్సార్ ఆసరా, 31 లక్షల మందికి ఇంటి పట్టాలిచ్చారు. రూ.25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఉచితంగా ఇస్తున్నారు. గిరిజనులకు టీడీపీ 20 హామీలిచ్చింది. ఎన్ని హామీలు అమలు చేశారు? ఒక్క ఎకరం భూమి అయినా కొని ఇచ్చారా? ఎస్టీ కమిషన్ మీరు ఇచ్చారా? జగనన్న ఎస్టీ కమిషన్ ఇచ్చారు. రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబు. 79 వేల మంది మహిళలను మోసం చేసిన పార్టీ టీడీపీ, దానికి తోడు పవన్ కల్యాణ్. వైయస్సార్ ఆసరా కింద ఇప్పటికే మూడు విడతలు ఇచ్చాం. మరో విడత జనవరిలో ఇస్తున్నాం. బాబొస్తాడు. జాబొస్తుందన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇచ్చారా? జగనన్న 4 లక్షలకుపైగా ఉద్యోగాలిచ్చారు. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. దేశంలో ఒక్క జగనన్న మాత్రమే ఏపీలో సామాజిక విప్లవానికి తెర తీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల స్థితిగతులు పెరగాలని, కుటుంబాలు బాగుండాలని, మిగిలిన వారితో సమానంగా బతకాలనే ఉద్దేశంతో పాలన చేస్తున్న సీఎం జగనన్న. పేదవాడి పిల్లలు బాగా చదవాలని, ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఇంగ్లీషు మీడియం తెచ్చారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పేదవాడి పిల్లాడికి ఇంగ్లీషు మీడియం తెస్తే చంద్రబాబు కోర్టుకెళ్తాడు. రామోజీరావు మనవళ్లు, రాధాకృష్ణ చుట్టాలు ఇంగ్లీషు మీడియం చదవొచ్చు. ఎస్సీ, ఎస్టీల పిల్లలు చదవొద్దట. తెల్ల రేషన్ కార్డు ఉంటే ఏ రాష్ట్రంలోనైనా చూపించుకొనేలా రూ.25 లక్షల దాకా వైద్యం ఉచితంగా అందిస్తున్న జగనన్న. వైద్యం చేయించుకొని ఇంటికొచ్చాక ఖర్చులకు డబ్బులిస్తున్న సీఎం జగన్. చంద్రబాబు ఏనాడూ ఇలా చేయలేదు. పేదవారికి 31 లక్షల ఇంటి పట్టాలిచ్చి, ఇళ్లు కట్టిస్తున్న సీఎం జగననన్న. రూ.2.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తే 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలు ఇచ్చారు. ఉద్యోగాలిస్తానని పారిపోయిన చంద్రబాబు. రూ.4 లక్షల ఉద్యోగాలిస్తే 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. మూలన ఉన్న కులాలకు వెతికి కార్పొరేషన్, డైరెక్టర్, ఎమ్మెల్యే, మేయర్ పదవులిచ్చిన జగనన్న. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, వెలివేతలు జరిగాయి. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు. బీసీలు జడ్జిలుగా పనికి రారని ఉత్తరం రాసిన నీచుడు చంద్రబాబు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆయనకు అవసరం లేదు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేద వారికి అవసరం. భావితరాల భవిష్యత్ చూసే సీఎం దొరికాడు. కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ప్రభుత్వ సలహాదారు, నటుడు ఆలీ మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్‌ను ప్యాలెస్‌లో ఉన్న నాయకుడని చాలా మంది అంటారు. ఆయన రాజన్న బిడ్డ. పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి పేదవాడినీ కడుపు పట్టుకొని చూశాడు. ఆకలితో ఉన్నాడని గుర్తించాడు. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాలు తీసుకొచ్చారు. ఏమీ చేయలేదని కొందరు రాతలు రాస్తుంటారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రజలకు తెలుసు. రాబోయే కాలంలో ఎంత డెవలప్‌మెంట్ జరుగుతుందనేది ప్రజలే నిర్ణయిస్తారు. పేద వాడి ఇంట్లో దేవుడి ఫొటో పక్కన వైయస్సార్ ఫొటో ఉంటుంది. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో డబ్బున్న వ్యక్తి ఒక బెడ్డుపై పడుకుంటే పక్క బెడ్డుపై పడుకొని ఆపరేషన్ చేయించుకుంటున్న పేదవాడు. తండ్రి పెట్టిన ఆరోగ్యశ్రీని వైయస్ జగన్ కొనసాగిస్తున్నారు. పేదవాడికి గూడు ఉండాలనే ఆలోచన వైయస్ జగన్ గారికి రావడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. రాష్ట్రంలో చాలా మందికి ఇంటి పట్టాలు దక్కాయి. 2024.. జగనన్న వన్స్ మోర్.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను గుండెల్లో పెట్టుకున్న జగనన్న. ప్రతి బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. 2019కి ముందు పింఛన్ కావాలన్నా, సర్టిఫికెట్లు కావాలన్నా ఆ ఊర్లో ఉన్న నాయకుడి గుమ్మం వద్దకు వెళ్లి అడగాల్సిన పరిస్థితి. 2019 తర్వాత నేరుగా వాలంటీర్‌ను ఇంటికి పంపి నేనున్నానని చెప్పి.. తలెత్తుకొని పథకాలు అందుకొనేలా చేసిన జగనన్న. వాలంటీర్లను పీకేస్తామని, మా నాయకుల చుట్టూ తిరగాల్సిందేనని లోకేష్, చంద్రబాబు చెబుతున్నారు. ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి వారు రకరకాల మాటలు చెబుతారు. స్వాతంత్ర్యం వచ్చాక ఈ జిల్లాలో బీసీనైన నన్ను మంత్రిగా చేసిన ఘనత జగనన్నదే. 2024లో జగనన్నను మన భుజస్కందాలపై మోసి మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందాం. పవన్, చంద్రబాబు ఒకే లక్ష్యంతో వస్తున్నారు. మీ దీవెనలు ఉన్నంత వరకు వీళ్లు జగనన్న వెంట్రుక కూడా పీకలేరు. మా జిల్లాలో ముగ్గురు పనికి రారని జగనన్న తీసేస్తే వారిని చేర్చుకున్న దిక్కులేని పార్టీ టీడీపీ. ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 1.28 లక్షల కుటుంబాల అభివృద్ధికి మన జగనన్న నేరుగా ఖాతాల్లో రూ.981 కోట్లు వేశారు. నాన్ డీబీటీ ద్వారా రూ.394 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో బీసీలకు నేరుగా రూ.564 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.214 కోట్లు ఇచ్చారు. ఎస్సీలకు నేరుగా రూ.256 కోట్లు, నాన్ డీబీటీ కింద రూ.103 కోట్లు ఇచ్చారు. ఎస్టీలకు నేరుగా రూ.139 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.68 కోట్లు మైనార్టీలకు నేరుగా రూ.22 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.9 కోట్లు ఇచ్చారు. ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో కనబడని వ్యక్తులు రకరకాల చొక్కాలు వేసుకొని దసరా వేషాలతో వస్తున్నారు. జగనన్న రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని అందరం కోరుకోవాలి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన ప్రభుత్వాలు గతంలో లేవు. మిమ్మల్ని ఆదుకున్న జగనన్నను మీ బిడ్డగా ఆశీర్వదించండి. మరోసారి వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని, కొడవలూరు మండలం నార్తురాజుపాలెం గ్రామంలో 2024 జనవరి 20న శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరస మహా రుద్రాభిషేకం చేయిస్తున్నాం. లక్షా 108 కొబ్బరికాయలు కొడతాం. మీరంతా భాగస్వాములై ఒక్కో కొబ్బరికాయ కొట్టాలి. లక్ష రుద్రాక్షలతో అభిషేకం, లక్ష బిళ్వార్చనతో అభిషేకం, లక్ష కుంకుమార్చన చేస్తాం. అందరి ఆశీర్వాదం జగనన్నకు ఉండాలి.