తిరుపతి: డీఎస్సీ అక్రమాలపై చంద్రగిరి పట్టణంలో వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీ విజయవంతమైంది. ర్యాలీకి వేలాది మంది ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ పంపిణీతో పాటు తొక్కిసలాటకు తావులేకుండా నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ర్యాలీకి భద్రత కల్పించిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని చంద్రగిరి పోలీసులు రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు. ఖాకీ దుస్తులు వేసుకుంటే అరెస్టు చేస్తారా? ఖాకీ దుస్తులు వేసుకున్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తారా? అంటూ వైయస్ఆర్‌సీపీ నేతలు పోలీసుల తీరును ప్రశ్నించారు. పంచాయతీ కార్మికులు, ఆటో డ్రైవర్లు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు కూడా ఖాకీ రంగు దుస్తులు ధరిస్తారని, వారందరినీ కూడా ఇదే విధంగా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రముఖుల వివాహాలు, జన్మదిన వేడుకలు, సినీ కార్యక్రమాలు, ఇతర భారీ ఈవెంట్లలో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడం సాధారణమే. అదే విధంగా డీఎస్సీ అక్రమాలపై నిర్వహించిన భారీ ర్యాలీలో వేలాది మంది ప్రజలు పాల్గొన్న నేపథ్యంలో వారి భద్రత, రద్దీ నియంత్రణ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వైయస్ఆర్‌సీపీ నేతలు తెలిపారు. శాంతియుత నిరసనతో పోలీసుల తీరుపై ప్రశ్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించి ఇబ్బందులకు గురిచేయడం అనైతిక చర్యలకు నిదర్శనమని వైయస్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. పోలీసుల అత్యుత్సాహాన్ని ప్రశ్నిస్తూ చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట శాంతియుతంగా నిరసన చేపట్టారు. డీఎస్సీ అక్రమాలపై నిరసన తెలిపే హక్కును అణచివేసేందుకు పోలీసు వ్యవస్థను ఉపయోగించడాన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు నిర్వహించే హక్కును కాపాడాలని, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయడం తక్షణమే నిలిపివేయాలని కోరింది. డీఎస్సీ అక్రమాలపై పోరాటం కొనసాగుతుంది డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలీసుల ఆంక్షలు, కేసులు, నిర్బంధాలతో ప్రజా ఉద్యమాన్ని అడ్డుకోలేరని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా వైయస్ఆర్‌సీపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.