తాడేపల్లి: సామాన్యులకు రాష్ట్రపతి భవనం తలుపులు తెరచిన మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని వైయస్ఆర్‌సీపీనాయకులు కొనియాడారు. ఆయన జీవితం, ఆయన ఆలోచనలు తరతరాలకు స్ఫూర్తినిచ్చే దివ్యదీపాలని చెప్పారు. మహోన్నతమైన స్థాయికి ఎదిగినా ఆయన చూపించిన వినయం, నిరాడంబరత ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో భారతరత్న, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కలాం చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశాన్ని అణు సాంకేతికతలో, రాకెట్ సైన్స్‌లో ప్రపంచ దేశాల సరసన నిలబెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని, అగ్ని, పృథ్వి లాంటి క్షిపణుల తయారీలో కీలక పాత్ర పోషించి, దేశ రక్షణ రంగాన్ని ఆత్మనిర్భరంగా మార్చారని కొనియాడారు. కలలు కనండి, వాటిని నెరవేర్చుకోవడం కోసం అనుక్షణం శ్రమించండి అని కలాం గారు చెప్పిన మాటలు నిరంతరం యువత మదిలో మెదలుతూనే ఉంటాయని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కలాం గారు చదువుకు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన బాటలోనే వైఎస్ జగన్ గారు తన ఐదేళ్ల పాలనలో విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి నాడు-నేడు ద్వారా విద్యారంగం రూపురేఖలు మార్చేశారని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని, మెగా డీఎస్సీలో అడుగడుగునా జరిగిన అవకతవకలతో నచ్చిన వారికి టీచర్ పోస్టులు కట్టబెట్టి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మార్గాని భరత్, పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్.ఆసిఫ్, ఎస్ఈసీ మెంబర్ డాక్టర్ మెహబూబ్ షేక్, నేషనల్ ప్యానలిస్ట్ షేక్ మెహబూబ్ షరీఫ్, స్టేట్ బీసీ సెల్ ప్రధాన్ కార్యదర్శి షేక్ దస్తగిరి, పంచాయితీరాజ్ స్టేట్ సెక్రటరీ ఎండీ ఫిరోజ్, పార్టీ మైనార్టీ విభాగం జాయింట్ సెక్రటరీ షేక్ అష్రాఫ్, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరు కనకారావు, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ప్రకాష్, షేక్ అబ్దుల్లా, షేక్ లతీఫ్, వివిధ పార్టీ అనుబంధ విభాగాలకు చెందిన మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.