తాడేపల్లి: ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసి గ్రామ స్వరాజ్యానికి సిసలైన అర్ధం చెబుతూ ఐదేళ్ల క్రితం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూపొందించిన సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తుందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు. దేశంలో తొలిసారిగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలతో వైయస్ జగన్ విప్లవాత్మక వ్యవస్థకు శ్రీకారం చుట్టారని, రేషనలైజేషన్ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదించాలని కూటమి సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం దారుణమన్నారు. సోమవారం వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శివశంకర్ మీడియాతో మాట్లాడారు. సచివాలయాల సిబ్బందిని జనాభా ప్రాతిపదికన తగ్గించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం సరికాదన్నారు. 2,500 కంటే జనాభా తక్కువ ఉండే చోట ‘ఏ’ కేటగిరీ గ్రామ సచివాలయాలుగా పరిగణించి ఆరుగురు ఉద్యోగులను కేటాయిస్తున్నారు. 2,500–3,500 జనాభా ఉండే ‘బీ’ కేటగిరీ గ్రామ సచివాలయాలలో ఏడుగురు చొప్పున, అంతకు మించి జనాభా ఉంటే ‘సీ’ కేటగిరీగా పరిగణించి కనీసం 8 మంది చొప్పున సచివాలయాల ఉద్యోగులను పరిమితం చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ చర్యలతో సుమారు 23,600 మంది ఉద్యోగులకు కోతపెడుతూ..మరోవైపు పౌర సేవలను దూరం చేస్తుందని ధ్వజమెత్తారు. నాడు వాలంటీర్లు..నేడు సచివాలయ ఉద్యోగులు ఎన్నికల సమయంలో వాలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవవేతనం రూ.10 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారని వైయస్ఆర్‌సీపీ నాయకుడు శివశంకర్‌రెడ్డి విమర్శించారు. ఇవాళ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా తప్పించేందుకు రేషనలైజేషన్ పేరుతో ఒక్కో సచివాలయంలో 6 మంది ఉద్యోగులను కుదిస్తున్నారు. ఇలా ఉద్యోగులను తొలగిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయా? అని ప్రశ్నించారు. పట్టణ ప్రాంతాల్లో భూములకు సంబంధించి రెవెన్యూ సేవలు అందించే వీఆర్‌వోలను తగ్గిస్తే భూ తగాదాలు, సమస్యలు అధికమవుతాయన్నారు. ఈ వ్యవస్థ ద్వారా వైయస్ఆర్‌సీపీ హయాంలో 11 లక్షల సమస్యలకు పరిష్కారం చూపించామన్నారు. అద్భుతమైన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను నీరుగార్చేందుకు కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయాలకు 2.90 లక్షల స్మార్ట్‌పోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు..ఇలా ఫ్లంగ్ ప్లే వ్యవస్థను ఏర్పాటు చేస్తే..ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులందరిని కొనసాగించాలని, ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని శివశంకర్‌రెడ్డి డిమాండు చేశారు. శివశంకర్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎలాంటి పక్షపాతం లేకుండా సంక్షేమ పథకాలను గడప వద్దకే పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ జగన్ తీసుకొచ్చిన ఈ విప్లవాత్మక వ్యవస్థను దేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధుల బృందాలు పరిశీలించి ప్రశంసించడం జరిగింది. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందు విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం, రైతులు తమ పనుల కోసం లంచాలిచ్చి రోజుల తరబడి మండల అధికారుల చుట్టూ తిరిగే దుస్థితి ఉండేది. జగన్ సీఎం అయ్యాక సచివాలయ వ్యవస్థ ద్వారా ఆ సేవలన్నీ గ్రామాల్లోనే అందించి అండగా నిలిచారు. ఎన్నికలప్పుడు వలంటీర్ల వేతనాలను రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక వారిని పూర్తిగా పక్కన పడేశారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కూడా రేషనలైజేషన్ పేరుతో నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారు. గత జగన్ పాలనలో ఒక్కో సచివాలయంలో పది మంది ఉద్యోగులు సేవలందిస్తే, కూటమి ప్రభుత్వం రేషనలైజేషన్ పేరుతో సచివాలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి ఉద్యోగులను కుదిస్తున్నారు. ఉద్యోగులను కుదించడం ద్వారా సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. గత ప్రభుత్వంలో సచివాలయాల ద్వారా 545 రకాల సేవలు అందించడం జరిగింది. గడిచిన ఐదేళ్లలో 11.48 కోట్ల వినతులు స్వీకరించి పరిష్కరించడం జరిగింది. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా ఇకపై ప్రజలకు వేగవంతంగా సేవలందే అవకాశం ఉండదు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ద్వారా కేవలం ప్రజలకు సేవలందించడం మాత్రమే కాకుండా 2.66 లక్షల మందిని వలంటీర్లుగా నియమించి, 1.36 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించడం జరిగింది. . మొక్కుబడి వ్యవహారంలా కాకుండా ఒక్కో సచివాలయంలో రెండేసి కంప్యూటర్లు, ప్రింటర్లు, స్మార్ట్ ఫోన్లు, యూపీఎస్‌లు, సిమ్ కార్డులు, ఫింగర్ ప్రింట్ డివైజ్‌లు ఇచ్చి ఒక పటిష్టమైన వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరుతో చేస్తున్న ఉద్యోగుల తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. వలంటీర్లకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం మేరకు వారిని కొనసాగించడంతోపాటు వేతనాలు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచాలి. అంతేకాకుండా జూన్ నుంచి వేతనాలు చెల్లించాలని పుత్తా శివశంకర్ రెడ్డి కోరారు.