న్యూఢిల్లీ: తెలంగాణలో ఓటుకు రూ.5కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రిని కోరుతామని వైయస్ఆర్‌సీపీ ఎంపీలు పేర్కొన్నారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు అసత్యాలు ప్రచారం చేశారని, కేంద్ర హోం మంత్రిని టీడీపీ ఎంపీలు కలువడాన్ని తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో వైయస్ఆర్‌సీపీ ఎంపీలు బాలశౌరీ, పిల్లి సుభాష్‌చంద్రబోస్ తదితరులు మీడియాతో మాట్లాడారు. అందితే జుట్టు..అందకపోతే కాళ్లు పట్టుకోవడం టీడీపీ నైజం: ఎంపీ బాలశౌరీ టీడీపీ నైజం ఎలా ఉంటుందంటే.. అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ఇది వెన్నతో పెట్టిన విద్య. యథా రాజా తథా పార్టీ అన్నట్టు ఆయన పార్టీకి చెందిన ఎంపీలు కూడా ఢిల్లీలో అదే పనిచేస్తున్నారు. అబద్ధాలు, అసత్యాలతో కూడిన వినతిపత్రాన్ని ఒకటి తీసుకుని నిన్న టీడీపీ ఎంపీలు అమిత్ షాను కలిశారు. గతంలో ఇదే అమిత్ షా తిరుమల వచ్చినప్పుడు ఆయన కారు మీద చెప్పులు వేసిన పనిని తెలుగు ప్రజలు, బీజేపీ నేతలు ఇంకా మరచిపోయి ఉండరు. దీనినిబట్టే టీడీపీ నైజం ఏమిటో తెలుసుకోవచ్చు. ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి, కుటుంబం గురించి అనరాని మాటలు చంద్రబాబు మాట్లాడారు. గుజరాత్ లో పుట్టిన మహాత్మా గాంధీ ఒక్క అబద్ధం ఆడరు అని.. అక్కడే పుట్టిన మోడీ ఒక్క నిజం కూడా మాట్లాడరు అని చంద్రబాబు మాట్లాడారు. ఇవన్నీ ఎవరూ మరిచిపోరు. ఆ తర్వాత కాంగ్రెస్ తో చెట్టాపట్టాలేసుకుని రాష్ట్రాలలో తిరిగి, రాహుల్ గాంధీతో కలిసి వందల కోట్లు రూపాయలు ఆరోజు ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆయా రాష్ట్రాల్లో పంచింది నిజం కాదా..? పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో .. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయినా, అది ఆయన వాయిసేనని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు ఇచ్చినా.. ఇంతవరకు ఆయనపై చర్యలు తీసుకోవడం లేదు. అదే ప్రభుత్వ అధికారులు వెయ్యో, రెండు వేలో, ఐదు వేలో లంచం తీసుకుంటూ పట్టుబడితే.. తక్షణం వారిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు. మరి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఓటుకు కోట్ల కేసుపై.. సీబీఐ చేత విచారణ జరిపించాలని, అందులో ప్రధాన పాత్రధారుడు, సూత్రధారుడు అయిన చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని మేం కేంద్రాన్ని కోరబోతున్నాం. ఈ అశంపై మేం రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసి సీబీఐ విచారణ కోరతాం. దొంగతనం చేసిన వాళ్ళే.. దొంగా.. దొంగా అని అరవడం టీడీపీకి బాగా అలవాటు. గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి చెప్పినట్టు.. ఒక వ్యక్తి నేరం చేసి కోర్టుకు వెళ్ళి.. తల్లిదండ్రులు లేరు రక్షించండి అని కేకలు వేస్తారు.. వాస్తవం ఏమిటని జడ్జి గారు ఆరా తీస్తే.. అతని తల్లిదండ్రులను చంపి కోర్టులో కేకలు వేస్తున్నాడని తేలింది. అలాంటి కేకలే ఈ రోజు చంద్రబాబు నాయుడు వేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, అరాచకం జరుగుతుందని చంద్రబాబు, ఆయన పార్టీ ఎంపీలు మాట్లాడుతున్నారు. గతంలో ఎప్పుడో జరిగిన దాడులను ఇప్పుడు జరిగినట్టు చూపిస్తూ.. అమిత్ షాకు ఫిర్యాదులు చేస్తున్నారు. వీరు ఆ సమయంలో మోడీ గురించి, ఇదే చంద్రబాబు మాట్లాడిన వీడియోలు కూడా చూపిస్తే బాగుండేది. ఆ వీడియోలు అందరి దగ్గరా ఉన్నాయి. అమరావతి అవినీతిపై విచారణకు సిద్ధమా: పిల్లి సుభాష్ చంద్ర బోస్ సవాల్ రాజధాని పేరుతో అమరావతిలో చేసిన అవినీతిపై చంద్రబాబు విచారణకు సిద్ధమా అని వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సవాలు విసిరారు. కొత్తగా చంద్రబాబు నాయుడు హిందూ మతం జపం చేస్తున్నారు. ఆయనకు సహజంగా అటువంటి అలవాటు లేకపోయినా.. రాజకీయంగా గత్యంతరం లేక ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దేవాలయాలపై దాడులు అంటూ గగ్గోలు పెట్టి.. తీరా ఆ పార్టీ వాళ్ళే దొంగల్లా దొరికారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో దేవాలయాలంలోని నంది విగ్రహాన్ని తీసుకొచ్చి నాలుగు రోడ్ల కూడలిలో అచ్చెన్నాయుడు అనుచరులే పెట్టారు. దీనిపై కేసు నమోదైంది. అరెస్టులు జరిగాయి. ఎవరైనా దేవాలయంలో నంది విగ్రహాన్ని రోడ్డు మీదకు తెస్తారా.. ఇదెక్కడి సంప్రదాయం..? హిందూ మతాన్ని తానే పుట్టించానన్నట్టుగా ఈరోజు చంద్రబాబు మాట్లాడుతున్నారు. హిందూమతం మీద అంత అభిమానమే ఉంటే.. దేవాలయాలపై దాడులు ఎందుకు చేయిస్తున్నారో సమాధానం చెప్పాలి. హిందూ మతాన్ని, దేవాలయాలను కూడా రాజకీయంగా వాడుకోవడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అనుచరులు విగ్రహానికి అవమానం చేసి దొరికితే అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు 12 దేవాలయాల్లో దాడులకు సంబంధించిన కేసుల్లో ఉన్నారని డీజీపీ గారే సాక్ష్యాధారాలతో సహా చెప్పారు. మరోవైపు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు అవినీతి బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నారు. అమరావతిలో టెంపరెరీ రాజధాని కట్టడానికి, అంటే మొత్తం 500 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండే బిల్డింగ్ లు కట్టడానికి రూ. 10 వేల కోట్లు ఖర్చు చేశారు. అదే పార్లమెంటులో 1500 మంది కూర్చోవడానికి కేవలం రూ. 976 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే రాజధాని పేరుతో చంద్రబాబు ఎంత దోపిడీ చేశారో అర్థం చేసుకోవచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో చ. అడుగుకి రూ. 10. 500 ఖర్చు పెట్టారు. అదే న్యూఢిల్లీలో చూసినా చ. అడుగుకి రూ. 2000-2500 మాత్రమే. దీనిపై విచారణ చేయమని ప్రధానమంత్రిని కోరతాం. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేస్తే.. అవినీతి జరిగిందని మాట్లాడతారా..? టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 30 శాతం కంటే తక్కువే జరిగాయి. ఇది వాస్తవం. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో 70 శాతంకు పైగా ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని జనంలోకి వెళ్ళకుండా... పచ్చి అబద్ధాలు టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. పోలవరంలో ఎవరి హయాంలో ఎంత పనులు జరిగాయో మీరు వస్తే.. చూపించటానికి సిద్ధం. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా నిర్మించాలని ఉంది. అయినా, మేమే కడతామని, పైగా 2014లో ఏ రేట్లు ఉన్నాయో.. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కూడా అదే రేట్లతో కడతామని చంద్రబాబు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నాడు. కేవలం కిక్ బ్యాగ్స్ మీద ఉన్న మోజుతో గత ఐదేళ్ళు టీడీపీ ప్రాజెక్టును అటకెక్కించింది. చంద్రబాబు, టీడీపీ నాయకులు పదే పదే వంకర మాటలు, అసత్యాలు మాట్లాడుతూ.. ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. మతోన్మాదుల్లా తయారై.. హిందూ మతానికి మేమే ఆద్యులం అని మాట్లాడటం కరెక్టు కాదు. ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎన్నికల కమిషన్ ను ప్రలోభమెట్టి, ఎన్ని మాయలు చేసినా అంతిమంగా విజయం మాదే. చంద్రబాబు- ఎన్నికల కమిషన్ రెండు నెలలుగా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తైన తర్వాత ఎవరి బాగోతం ఏమిటో కచ్చితంగా తెలుస్తుందని పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.