తాడేపల్లి: దివ్యాంగులకు సంక్షేమం అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రగామిగా నిలిచిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. వైయస్ఆర్ సీపీ దివ్యాంగుల విభాగ సమావేశాన్ని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేలాదిమంది దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు పెన్షన్ అందిస్తూ వారికి అండగా నిలుస్తోందన్నారు. 14 రకాల రోగ పీడితులు, వైకల్యాలున్న 7,98,352 మందికి నెలకు రూ.255 కోట్లు పైగా పింఛన్లు అందిస్తుందన్నారు. దివ్యాంగులకు రాష్ట్రంలో నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం ప్రతినెల 1వ తేదీనే వలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా దివ్యాంగుల వద్దకే పెన్షన్ అందిస్తుందన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,000 మంది వైకల్యంతో ఉన్నటువంటి దివ్యాంగులు కూడా వలంటీర్లుగా నియమించిందని గుర్తుచేశారు. అలాగే 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేసిందని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు నాలుగు శాతం పెంచి ఉద్యోగ నియామకల్లో, ప్రమోషన్స్‌లో దివ్యాంగులకు అవకాశం కల్పించారని చెప్పారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వారికి బలంగా వినిపించాలని ఈ సమావేశంలో ఆయన కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయం లేదా తన దృష్టికి గానీ తీసుకురావాలని చెప్పారు. దివ్యాంగుల విభాగ కమిటీ నియామకాలు త్వరగా పూర్తి చేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. పార్టీ దివ్యాంగుల విభాగ అధ్యక్షుడు కిరణ్ రాజ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు, జోనల్ ఇంచార్జిలు పాల్గొన్నారు. వినతులు స్వీకరణ కేంద్ర పార్టీ కార్యాలయంలో వరసగా మూడో రోజు బుధవారం కూడా ఎంపీ విజయసాయిరెడ్డి గ్రీవెన్స్ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.