న్యూఢిల్లీ: అవినీతి, అక్రమాల ఊబిలో కూరుకుపోతూ అనేక కోఆపరేటివ్ సొసైటీలు ఖాయిలా పడుతున్నాయని వీటిని అరికట్టేందుకు చట్టపరంగా పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే సహకార స్ఫూర్తికే ముప్పు వాటిల్లుతుందని వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల సవరణ బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. ఖాయిలా పడిన కోఆపరేటివ్ సొసైటీలకు పునరుజ్జీవం కల్పించేదుకు కోఆపరేటివ్ పునరావాస, పునర్నిర్మాణ, అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. అయితే దీనికోసం బడ్జెట్ గ్రాంట్ చేయడం లేదు. లాభాల్లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీల లాభాల నుంచి కొంత మొత్తం ఈ నిధికి జమ చేసేలా బిల్లులో నిబంధన రూపొందించారు. ఈ నిధి సక్రమ వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఒక పటిష్టమైన యంత్రాంగానికి రూపకల్పన చేయాలి. బోర్డును ఏర్పాటు చేసి ఖాయిలా పడిన సొసైటీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించాలి. పునరావాసం, పునర్నిర్మాణం, అభివృద్ధికి నిజంగా అర్హులైన సొసైటీలను గుర్తించి వాటికి మాత్రమే ఈ నిధి నుంచి ఆర్థిక సహాయం అందించాలని ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. రాజకీయ జోక్యం, అవినీతి, అక్రమాలే సహకార సంఘాలు ఖాయిలా పడటానికి ప్రధాన కారణాలు. ఉదాహరణకు ఒక సొసైటీలో అధ్యక్షుడు, బోర్డు కుమ్మక్కై సభ్యులకు మంజూరు చేసే రుణాల్లో 5 నుంచి 50 శాతం కిక్ బ్యాక్ కింద వసూలు చేస్తున్నారు. ఈ విధంగా మంజూరు చేసిన రుణాలు ఎప్పటికీ వసూలు అయ్యే అవకాశమే లేదు. ఇలాంటి ధోరణులు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలలో జరగకుండా నిరోధించాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రప్రభుత్వానికి సూచించారు. అసెంబ్లీ, లోక్‌సభకు దీటుగా సొసైటీ ఎన్నికలు.. కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు దీటుగా జరుగుతున్నాయి. లాభాల్లో నడుస్తున్న కోఆపరేటివ్ సొసైటీలకు ఎన్నిక అయ్యేందుకు అభ్యర్ధులు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెడుతున్నారు. గెలిచిన తర్వాత ఖర్చు చేసిన మొత్తాన్ని అక్రమమార్గంలో సొసైటీ నుంచి రాబట్టుకోవచ్చన్నదే వారి ధీమా. కోఆపరేటివ్ సొసైటీల్లో ఎన్నికల నిర్వహణ కోసం ఈ బిల్లులో ప్రతిపాదించిన కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కోఆపరేటివ్ ఎన్నికలలో ఇలాంటి అవాంఛనీయ రాజకీయ శక్తులు ప్రవేశించి తద్వారా సొసైటీలను అవినీతి, అక్రమాలమయం చేయకుండా నిరోధించే బాధ్యతను ఈ ఎలక్షన్ అథారిటీకి అప్పగించాలని ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.