నల్లజర్ల వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీసుల వేధింపులు దారుణం

అక్రమ కేసులపై న్యాయ పోరాటం తప్పదు: వైయస్‌ జగన్‌

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలానికి చెందిన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇటీవల వైయస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా నల్లజర్ల మండలం తూర్పు చోడవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్ద పొట్టేలు బలి ఇచ్చారనే ఆరోపణలతో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడమే కాకుండా, నడిరోడ్డుపై నడిపిస్తూ అవమానకరంగా ప్రవర్తించారని కార్యకర్తలు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసుల బెదిరింపులు, దాడులు, కొట్టడం వంటి చర్యలతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యామని వారు వివరించారు.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన వైయస్‌ జగన్‌, ప్రభుత్వ దన్నుతో పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరించడం అత్యంత ఖండనీయం అని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో విపక్ష పార్టీ కార్యకర్తలను ఈ విధంగా వేధించడం వ్యవస్థల పతనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

వైయ‌స్ఆర్‌సీపీ క్యాడర్‌ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తామని వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. అక్రమ కేసులు, పోలీసు వేధింపులపై పార్టీ లీగల్‌ సెల్ ద్వారా అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ అక్రమాలపై న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ను మాజీ హోంమంత్రి, గోపాలపురం వైయ‌స్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ తానేటి వనిత, నల్లజర్ల మండలానికి చెందిన స్థానిక నాయకులు, పార్టీ లీగల్‌ సెల్ సభ్యులు కూడా కలిశారు.

Back to Top