నెల్లూరు : సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విసురుతున్న సవాళ్లన్నింటినీ స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నీతి, నిజాయితీ, పౌరుషం ఉంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన ఇరిగేషన్ పనుల పూర్తి వివరాలను ప్రజల ముందు వెల్లడించాలని ఆయన సవాల్ విసిరారు. సిగ్గు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలని సోమిరెడ్డికి హితవు పలికారు. కాన్పూర్ కాలువ పనుల్లో అవినీతి చూడటానికి తాను బయలుదేరితే తనపై హౌస్ అరెస్ట్ చేయించారని ఆరోపించారు. నిజంగా నీతి వంతుడివైతే భయం ఎందుకని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో నిత్యం అవినీతి అంశాలపై సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించిన కాకాణి, తన కాల్ లిస్ట్ డేటాను బయటపెట్టే ధైర్యం ఉందా అంటూ సవాల్ విసిరారు. ఇరిగేషన్‌పై అవగాహన లేకపోతే తాను వివరించి నేర్పుతానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇరిగేషన్ మేనేజర్ గంగాధర్ అవినీతి వ్యవహారంలో ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉందన్నారు. తన కుమారుడి వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డబ్బులు తన ఖాతాలో పడ్డాయని చెప్పడం చూస్తే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. అల్లిపురంలో మీ ఇంటి నిర్మాణానికి సంబంధించిన నిజాలు బయటపెడితే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, తాను పెదవి విప్పితే రక్త కన్నీళ్లు కారుతాయని హెచ్చరించారు. సోమిరెడ్డి జీవితం మొత్తం అవినీతి మయమని ఆరోపిస్తూ, నాగంబట్లకండ్రిగలో గ్రావెల్, సూరయ్యపాళెంలో ఇసుక, పామ్ ఆయిల్ ట్రాన్స్‌పోర్ట్‌లో కమిషన్లు తీసుకున్నారని అన్నారు. చివరికి శివాలయ భూములను కూడా వదలలేదని విమర్శించారు. ముత్తుకూరులో స్టేడియం నిర్మిస్తానని చెప్పి, పోర్టు సంస్థ నిర్మించేందుకు ముందుకు వస్తే కమిషన్ రాదని అడ్డుపడ్డారని ఆరోపించారు. తాజాగా సీఎస్‌ఆర్ నిధుల్లో కూడా అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పొదలకూరు ఆసుపత్రికి కాయ్ కల్ప అవార్డు తమ హయాంలో వచ్చిందని, దానికి క్రెడిట్‌ను దొంగిలించారని మండిపడ్డారు. తనపై మోపిన తప్పుడు కేసులపై సీబీఐ ఎంక్వరీ వేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు. సీఎం స్పందించకపోవడంతో హైకోర్టులో పిల్ దాఖలు చేశానని వెల్లడించారు. దమ్ముంటే సీబీఐ ఎంక్వరీకి సిద్ధమా? కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా? లైవ్ డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమా? అంటూ మూడు సవాళ్లు విసిరారు. ఈ మూడు సవాళ్లలో ఏదికైనా తాను సిద్ధమని, సిగ్గు ఉంటే సోమిరెడ్డి ముందుకు రావాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.