తాడేపల్లి: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తే టీడీపీ మంత్రులు, నేతలు దానికి సమాధానం చెప్పకుండా తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాధ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంని నిలిపివేయడం ద్వారా కూటమి ప్రభుత్వం రాయలసీమకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ను ఆపేసి అమరావతిలో లిప్ట్ లు మాత్రం కట్టుకోవడం ఏంటని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అరాచకాలపై వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... అమరావతిలో లిఫ్ట్ లకు వెయ్యి కోట్లా ? ఈ ప్రపంచంలో ఎక్కడైనా నిరంతరం నీళ్లు పంపింగ్ చేసే ప్రాంతం అమరావతి తప్ప ఏదైనా ఉందా ? అమరావతిలో నిరంతరం హైపవర్ పంపులు అక్కడ నీరు ఊరుతుంటే వాటిని బయటికి పంపేస్తుంటారు. దీని కోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టుకునే బాపతు మీరు. మరోవైపు అక్కడ రైతాంగం ప్రభుత్వం మాకు కేటాయించిన ప్లాట్లు కాల్వలు, కుంటల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ మంత్రి నారాయణకు ఏమీ తెలియదు, చంద్రబాబు చెప్పిన విషయాలే మాట్లాడుతుంటారు. విజయవాడలో రాజధాని పెడతామంటే ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. అసెంబ్లీ రికార్డులు ఓసారి పరిశీలించండి. కానీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలతో మాట్లాడకుండా మీకు, మీ బినామీలకు భూములున్న అమరావతిలో రాజధాని ప్రకటించారు. మరోవైపు అమరావతిలో నిర్మాణాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో చదరపు అడుగు నిర్మాణాని రూ.11,500 చెల్లిస్తున్నారు. రాజధాని మీ జాగీరు కాదు, రాష్ట్ర ప్రజల సొత్తు... అమరావతిలో మీ నిర్వాకం వల్ల రామారావు అనే రైతు మరణిస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడం తప్ప.. జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. రాజధాని గురించి మాట్లాడితే నేరం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. రాజధాని మీ జాగీర్దారు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి రాజకీయ పార్టీలతో, ప్రజలతో మాట్లాడాలి. ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ కట్టాలి గానీ, రియల్ ఎస్టేట్ కు అనువుగా ఉండే ప్రాంతంలో పెడతామంటే మేం అడగకూడదా.? ఎకరా అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. ఈ లెక్కన 50 వేల ఎకరాలకు లక్షకోట్లు, లక్ష ఎకరాలకు రెండు లక్షల కోట్లు ఖర్చుపెడతారా ? ఈ డబ్బులు ఎవరివి ? మంత్రి నారాయణ కాలేజీల్లోనో, పాల వ్యాపారాల్లోనో సంపాదించిన డబ్బులు కావు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన మొత్తం అది. రెండు లక్షల కోట్లకు వడ్డీ ప్రతీ సంవత్సరం 16 వేల కోట్లు అవుతోంది. ఇప్పటికీ ప్రతీ మంగళవారం అప్పులకు పోయే పరిస్దితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల సముద్రంలో ముంచేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే మీకు కోపం వస్తుందా ? కమిషన్లు రాలేదనే రాయలసీమ లిఫ్ట్ ఆపేశారా ? రాజధాని ప్రాంతంలో ఆరు ఎత్తిపోతల పథకాలు, మూడు రిజర్వాయర్లా ? మతి ఉండే పనిచేస్తున్నారా ? రాజ్యాంగంలో రాజధానిపై ఏం ఉందో ఓసారి చదువుకోవాలి. ప్రజల కోసం వైయస్.జగన్ మాట్లాడుతున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత కూడా అక్కడి రైతులు తమకు నష్టం జరిగిందని మాట్లాడుతుంటే .. అవేవీ విననట్లు, చూడనట్లు నటిస్తున్నారు. మీ బిల్డింగ్ లు నదీ గర్భంలో కట్టుకోండి, రాజధాని కాదు. మీరు కట్టే నగరం నీటిపై తేలియాడేలా ఉంటుంది. మీ అసమర్ధత, చేతకానితనాన్ని ప్రశ్నిస్తే మీకు కోపం వస్తుంది. అమరావతిలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ కడితే అక్కడ ఎవరు వస్తారు?. విజయవాడ ఎయిర్ పోర్టును, రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకంలాగే ఆపేస్తారా ? మీకు రావాల్సిన కమిషన్లు రాలేదని రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపారని అర్థమవుతోంది. అమరావతికి సెల్ఫ్ ఫైనాన్స్ ఏదీ ? ఎవరైనా సరే మునిగిపోయే ప్రాంతంలో ఇల్లు కడతారా?, మెరక ప్రాంతంలో ఇల్లు కడతారా? కామన్ సెన్స్ తో ఆలోచించాలి. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భూములు కొనుక్కున్న వాళ్లు తప్ప రైతులకు అక్కడ ఏ మేలూ జరగలేదు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పిన ముఖ్యమంత్రి..ఇప్పటిదాకా ఎంత సేకరించారో చెప్పాలి?. అమరావతి సెల్ఫ్ పైనాన్స్ తో పూర్తయితే ఇక అప్పులు చేయడం ఎందుకు ?, అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఆపి అమరావతిలో లిఫ్ట్ లు కట్టుకుంటారా ? చంద్రబాబు సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన దాన్నే చంద్రబాబు సమర్థించారని ప్రజలు భావిస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ వైయస్.జగన్ ముఖ్యమంత్రిగా ముందుచూపుతో చేసిన గొప్ప ప్రయత్నం. కూటమి అరాచకాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం అమరావతి రైతుల బతుకుల్లో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబే. ఆయనే వారి భవిష్యత్తు అంధకారం చేస్తున్నారు. మంత్రి నారాయణకు వడ్లమానులో ఏం జరిగిందో తెలియదా ? మిమ్మల్ని ఛీ కొట్టిన విషయం మర్చిపోయారా ? గ్రామ సభ తర్వాత భూసమీకరణ చేయాలి కదా అని రైతులు అడిగితే ఇప్పటికే జరిగిపోయిందని చెప్పుకున్నారు. మీ ఆఫీసులో జరిగిందా.. మంత్రి నారాయణ దీనికి సమాధానం చెప్పాలి. భూములు ఇచ్చే వాళ్లు ఇస్తారు, ఇవ్వకపోతే లాక్కుంటాం అన్నట్లుగా మీ వైఖరి ఉంది. రాజధాని వ్యవహారాల్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. మీ దేవతా వస్త్రాల్ని చూస్తున్నారు. రాయలసీమ ప్రజలకు అమరావతిపై మాట్లాడే హక్కు లేదా ? గోదావరి, ఉత్తరాంధ్ర వాసులకు దీనిపై మాట్లాడే హక్కు లేదా ? అమరావతికి తెస్తున్న అప్పులు రాష్ట్రానికి సంబంధించిన విషయం, వ్యక్తులకు సంబంధించింది కాదు. దానిపై పెట్టే ప్రతీ రూపాయి రాష్ట్రం భరించాల్సిందే. మా మీద కోప్పడే వాళ్లంతా అమరావతి ఎత్తిపోతల పథకంలో సేద్యం చేసుకోండి. తద్వారా సంపద సృష్టించవచ్చని సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలి అమరావతికి అప్పులు తెస్తూ దానికి రుణసమీకరణ అని పేరుపెట్టడాన్ని శైలజానాధ్ తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్ర చరిత్రలో భారీగా అప్పులు చేస్తూ.. రుణసమీకరణ అంటూ పేర్లు మార్చినంత మాత్రాన అర్ధం మారిపోదని తేల్చి చెప్పారు.