భూ ఆక్రమణపై మాజీ ఎమ్మెల్యే  కైలే అనిల్ కుమార్ ఆందోళ‌న‌

కృష్ణాజిల్లా : పామర్రు నియోజకవర్గంలోని పామర్రు మండలం అయినంపూడి గ్రామంలో గంగానమ్మ గుడి సమీపంలో ఉన్న భూమి ఆక్రమణపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. గంగానమ్మ గుడి వద్దకు చేరుకున్న ఆయన, దళితుల కులదైవమైన గంగానమ్మ ఆలయాన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆక్రమణకు గురైన భూమిని త‌హ‌సిల్దార్ తక్షణమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దళితుల ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గంగానమ్మ గుడిని తొలగించడం అన్యాయం” అని స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా స్పందించిన కైలే అనిల్ కుమార్, త‌హ‌సిల్దార్ సంఘటన స్థలానికి వచ్చేవరకు అక్కడి నుంచి కదలబోనని బైఠాయించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసనకు స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Back to Top