నెల్లూరు జిల్లా: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ చలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని చేపట్టింది. చలో జువ్వలదిన్నెకు పిలుపునిచ్చిన వైఎస్సార్‌సీపీ.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్‌పరం కాకుండా నిరసనలు చేపట్టనుంది. వైయస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అధ్యక్షతన భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు కావలి నుంచి జువ్వలదిన్నెకు బయలుదేరారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు 70 ఎకరాల స్థలాన్ని సేకరించి అభివృద్ధి చేశారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. 29.5 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థ అయిన సాగర్ డిఫెన్స్ సంస్థకు అప్పజెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు తాము, తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. వారికి స్థలాన్ని వేరేచోట ఇచ్చి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తే మంచిదన్నారు. కానీ హార్బర్ కోసం సేకరించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.