పల్నాడు జిల్లా: కూటమి ప్రభుత్వ పాలనలో ఆర్యవైశ్యులను చులకనగా చూస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఒక్క సంఘం కూడా స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఆర్యవైశ్య సంఘాలు కూటమి ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఆర్యవైశ్యులపై జరుగుతున్న దాడులు వెంటనే ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఆర్యవైశ్యుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు పేరుతో ఆర్యవైశ్యుల నుంచి చందాలు వసూలు చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సత్తెనపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యాపారాలు పూర్తిగా డౌన్ అయ్యాయని అన్నారు. ఎలాంటి వ్యాపారం జరగని పరిస్థితి నెలకొందని, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడంలేదని అన్నారు. అమరావతిని రాజధానిగా కోరిన రైతులే ఇప్పుడు రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందని పేర్కొంటూ, ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆర్యవైశ్యులపై దాడులు విపరీతంగా పెరిగాయని, ప్రభుత్వం ఆర్యవైశ్యులను చులకనగా చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఎన్టీ రామారావు విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి నిధులు ఉన్నప్పుడు, పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయడానికి నిధులు లేవా? అని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు విగ్రహం పేరుతో వ్యాపారస్తులను చందాల కోసం ఒత్తిడి చేయడం బాధాకరమని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఖండిస్తున్నామని వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.