పేద విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా ట్రై పార్టీ అగ్రిమెంట్‌ పేరుతో డ్రామా

ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజం

నెల్లూరులోని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పి.చంద్రశేఖరరెడ్డి

ఏపీ స్టేట్‌ ఫైనాల్షియల్‌ సర్వీస్‌ కార్పొరేషన్, వేల్‌ఫేర్‌ కార్పొరేషన్, కాలేజీలను కలిపి ట్రైపార్టీ అగ్రిమెంట్‌

ఈ అగ్రిమెంట్‌ బ్యాంకులో సడ్మిట్‌ చేస్తే ఆ కాలేజీలకు బ్యాంకు లోన్‌ ఇస్తుందట

ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే కాలేజీ ఆస్తులు జప్తు చేసుకోవచ్చని మెలిక

సీఎం చంద్రబాబు ట్రై పార్టీ అగ్రిమెంట్‌ను ఈ ఒక్క ఏడాదికి సవరించినా రూ.300 కోట్లు మాత్రమే విడుదల  

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

లేకపోతే విద్యార్థుల తరఫున వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమం

తేల్చి చెప్పిన ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి

నెల్లూరు: పేద విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌ రెడ్డి మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా ట్రై పార్టీ అగ్రిమెంట్‌ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. నెల్లూరులోని వైయ‌స్ఆర్‌సీపీ  జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యార్థుల చదువులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. 
ప్రెస్‌మీట్‌లో పి.చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

జగన్‌గారి హయాంలో పూర్తి ఫీజు చెల్లింపు:
    2019లో జగన్‌గారు సీఎం అయ్యే నాటికి రూ.1,880 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలుండగా, వాటిని 2020 ఏప్రిల్‌ 28న విడుదల చేశారు. అదే రోజు ఆ ఏడాదికి సంబంధించి మరో రూ.2,328 కోట్లు కలిపి మొత్తం రూ.4,208 కోట్లను విడుదల చేసి సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు ఊరటనిచ్చారు. అంతే కాకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని నేరుగా కాలేజీలకు కాకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసి వారు స్వయంగా కాలేజీలకు చెల్లించే విధానాన్ని తీసుకువచ్చారు. ప్రతి మూడు నెలలకోసారి, క్రమం తప్పకుండా నిధులు విడుదల చేశారు. 2024 మార్చి వరకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే 2024 మార్చిలో ఎన్నికల కోడ్‌ వచ్చిన సమయంలో విడుదల చేయాల్సిన రూ.700 కోట్ల నిధులను కూటమి నేతలు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించి అడ్డుకున్నారు.

ఏటా వసతి దీవెన కింద రూ.1100 కోట్లు చెల్లింపు:
    గతంలో ఎంపీఎఫ్‌గా ఉన్న  పథకాన్ని వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత వసతి దీవెనగా మార్పు చేసి విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూర్చారు. డిగ్రీ విద్యార్థులకు రూ.10 వేల వరకు, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు రూ.20 వేల వరకు పెంచి ప్రతి సంవత్సరం సుమారు రూ.1000 కోట్ల నుంచి రూ.1100 కోట్ల వరకు నిధులను విడుదల చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలులో తీవ్ర నిర్లక్ష్యం చోటుచేసుకుంది. 

పేద విద్యార్థులకు రూ.7,241 కోట్లు బాకీ:
    కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండేళ్లుగా వసతి దీవెన, విద్యా దీవెన పథకాలను పూర్తిగా తుంగలో తొక్కింది. విద్యా దీవెన కింద 2024 మార్చి నుంచి 2026 మార్చి వరకు మొత్తం 9 క్వార్టర్లకు ఒక్కో క్వార్టర్‌కు రూ.700 కోట్లు అవసరం. అంటే ఈ కాలానికి రూ.6,300 కోట్లు విడుదల చేయాలి. ప్రస్తుత బడ్జెట్‌లో మరో నాలుగు క్వార్టర్లు కూడా కలిపితే మొత్తం 13 క్వార్టర్లకు రూ.9,100 కోట్లు అవసరం అవుతాయి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం కేవలం రూ.1,859 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు అసెంబ్లీలో సమాధానం ఇచ్చింది. అంటే సుమారు రూ.7,241 కోట్లు పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద బాకీ పడ్డారు.

అసెంబ్లీ సమావేశాలకు ఒక్క రోజు ముందు..:
    అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభమయ్యే ముందు రోజు ప్రభుత్వం నాలుగు బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్లు (బీఆర్‌వోలు) జారీ చేసి రూ.1,200 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రతిపక్షం ప్రశ్నించడం ఆగిపోతుందని ప్రభుత్వం అనుకుంది. కానీ ఆ తర్వాత మరో కుట్ర ప్రారంభమైంది.

ట్రైపార్టీ అగ్రిమెంట్‌ కుట్ర:
    కాలేజీ యాజమాన్యాలను పిలిపించి ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్, వెల్ఫేర్‌ కార్పొరేషన్, కాలేజీల మధ్య ట్రై పార్టీ అగ్రిమెంట్‌ రూపొందించారు. ఈ ఒప్పందం ప్రకారం ఆ అగ్రిమెంట్‌ను బ్యాంకులో సమర్పిస్తే కాలేజీలకు లోన్‌ ఇస్తారని చెప్పారు. ప్రభుత్వం లేదా వెల్ఫేర్‌ కార్పొరేషన్లు డబ్బులు చెల్లించకపోతే కాలేజీల ఆస్తులను జప్తు చేసుకునే నిబంధనలు కూడా పెట్టారు. లోన్‌పై ఏడాదికి 7.5 శాతం వడ్డీ బ్యాంకులు ముందుగానే కోత పెట్టి ఇస్తారట.  ప్రభుత్వం సకాలంలో ఆ డబ్బులు ఇవ్వకపోతే ఆ భారాన్ని కూడా కాలేజీలే భరించాలనే విధంగా మరో నిబంధన పెట్టారు. ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కడైనా ఉంటాయా?.
    ఈ ట్రై పార్టీ అగ్రిమెంట్‌పై ఏ కాలేజీ కూడా సంతకం చేయలేదు. దీంతో చంద్రబాబు ట్రైపార్టీ అగ్రిమెంట్‌ను ఈ ఒక్క ఏడాదికి వాయిదా వేస్తూ రుణాలు ఇవ్వాలని  బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయినా ప్రకటించిన రూ.1,200 కోట్లలో కేవలం రూ.300 కోట్లు మాత్రమే బ్యాంకులు విడుదల చేశాయి. ఇంకా ఈ ఏడాదికి సుమారు రూ.6,900 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. విద్యార్థులకు ఇకనైనా న్యాయం చేయకపోతే వైయ‌స్ఆర్‌సీపీ వారికి అండగా నిలబడి పోరాడుతుందని ఎమ్మెల్సీ పి.చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top