కొడుకు కంటే ఎక్కువ‌గా ష‌ర్మిల‌కే వైయ‌స్ఆర్ ఆస్తులు ఇచ్చారు 

పెళ్లై ఆస్తి పంప‌కాలు జ‌రిగినా ప్రేమాభిమానాల‌తో డ‌బ్బులు ఇచ్చిన మీ అన్న జ‌గ‌న్ గొప్ప‌వాడు కాడా? 

షర్మిలను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి 

వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి

అన్న అనే ప‌దానికి క‌ళంకం అన్న షర్మిల వ్యాఖ్యల‌ను ఖండిస్తున్నాం

సునీత‌, ష‌ర్మిల ఇద్ద‌రూ చంద్ర‌బాబుతో చేయి క‌లిపి వైయ‌స్ జ‌గ‌న్‌పై వ్యక్తిత్వ హ‌న‌నం

కుటుంబ వ్య‌వ‌హారాలు బయట పెట్టి ర‌చ్చ చేయ‌డం చెల్లెళ్ల‌కు త‌గ‌దు 

వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ష‌ర్మిల‌కు భారీ ఆస్తులు, వాటా ఇచ్చినా ఆమెకు తృప్తి లేదు

వైయ‌స్ జగన్ నుంచి సుమారు రూ. 236 కోట్లు ఆర్థిక సహాయం పొందారు

సునీతమ్మ, షర్మిలమ్మలు ప్రతి విషయాన్ని చంద్ర‌బాబుకు చేరవేస్తున్నారు

వీరిద్ద‌రిని చంద్ర‌బాబు పావుగా వాడుకుంటున్నారు 

వైయ‌స్ జ‌గ‌న్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్ప‌డితే గట్టిగా ప్ర‌తి స్పందిస్తాం

హెచ్చ‌రించిన రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి

ప్రొద్దుటూరు : దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు తన కుమారుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కంటే కుమార్తె ష‌ర్మిల‌కు ఎక్కువ ఆస్తులు పంచిన గొప్ప నాయకుడని మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి పేర్కొన్నారు. ఆడబిడ్డకు సమాన హక్కులు కల్పిస్తూ ఆచరణలో చూపిన అరుదైన వ్యక్తి వైయ‌స్ఆర్‌ అని కొనియాడారు. అలాగే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు తన చెల్లెలు షర్మిలకు త‌న సొంత ఆదాయంలో అడిగినప్పుడల్లా ఆర్థిక సహాయం అందించి తండ్రి కంటే గొప్ప‌వాడు అని గుర్తుచేశారు. ఇంత ప్రేమగా చూసుకున్న అన్నపై విమర్శలు చేయడం, ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌తో చేతులు క‌లిపి దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేయ‌డం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఆడబిడ్డకు ఆస్తుల్లో వాటా ఇస్తే అనేక సందర్భాల్లో కుటుంబాల్లో విభేదాలు తలెత్తే పరిస్థితులు ఉంటాయని, అలాంటి సందర్భాల్లో కూడా వ‌దిన‌గా వైయ‌స్ భార‌త‌మ్మ ష‌ర్మిల‌కు ఆస్తిలో వాటా ఇవ్వ‌డ‌మే కాకుండా ఆమెకు రూ.236 కోట్లు ఆర్థికంగా వైయ‌స్ జ‌గ‌న్ సాయం చేసిన‌ప్ప‌టికీ కూడా భార‌త‌మ్మ స‌హ‌క‌రించి ఆడ‌ప‌డుచుగా ష‌ర్మిల‌ను గౌర‌వించ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. ఇన్ని ఆస్తులు, ఆర్థిక సహకారం పొందిన షర్మిలమ్మ త‌న అన్న‌పై వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డ‌టం దుర్మార్గ‌మ‌న్నారు.  దీనికేనా వైయస్‌ జగన్‌ “అన్న” అనే పదానికి కళంకం అని వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులోని క్యాంపు కార్యాలయంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి  ష‌ర్మిల‌మ్మ‌ను సూటిగా ప్ర‌శ్నించారు. 

ప్రెస్‌మీట్‌లో రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఇంకా ఏమ‌న్నారంటే.. 

హ‌ద్దులు దాటి వ్య‌క్తిత్వ హ‌న‌నం
ఇటీవ‌ల ష‌ర్మిల‌మ్మ మీడియా సమావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గారి వ్యక్తిత్వంపై హద్దులు దాటి దాడి చేశారు.  అన్న అనే పదానికి కళంకం అని వైయ‌స్ జ‌గ‌న్ గారి గురించి ష‌ర్మిల మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరం. వైయ‌స్ జగన్‌ను అపారంగా ప్రేమించే వ్యక్తులుగా షర్మిల తన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని, తన అన్న తనకు చేసిన అన్యాయం ఏమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. కుటుంబ విభేదాలను నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాల్సింది పోయి బ‌జారుకీడ్చ‌డం సరికాదు.   

ష‌ర్మిల‌మ్మా..నీకు జరిగిన అన్యాయం ఏంటి? 
ష‌ర్మిల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన అప‌కారం ఏంటి?.  నీకు వివాహం జరిగి సుమారు 30 సంవత్సరాలు అయ్యింది. 2004లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న ఎన్నిక‌ల‌ అఫిడవిట్‌లో చూపించిన ఆస్తులు, 2009 ఎన్నికల అఫిడవిట్‌లో కనిపించలేదు. ఎందుకంటే 2009 నాటికే ఆయన తన కుమారుడు, కుమార్తెకు ఆస్తులు రాసిచ్చారు.  మన సమాజంలో ఆడబిడ్డకు గౌరవంగా పెళ్లి చేసి, స్థోమతకు తగినట్లు డబ్బులు, బంగారం, భూములు ఇచ్చి పంపించడం ఒక ధర్మం. ఇది చట్టం కాకపోయినా సంప్రదాయం. అలాంటి పరిస్థితుల్లో కూడా వైయస్‌ఆర్ కొడుకు క‌న్నాఎక్కువ‌గా కూతురికి ఆస్తులు పంచిన గొప్ప వ్యక్తి. 

మీ వ‌దిన‌ భారతమ్మ వెయ్యి రెట్లు గొప్పది కాదా?
కొడుకుతో సమానంగా బిడ్డకు ఆస్తి పంచిన గొప్ప వ్యక్తి  వైయ‌స్ఆర్‌. వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో  ఉన్న త‌న ఇల్లు, ఇడుపులపాయలో 51 ఎకరాల భూమి, పలు హైడ్రో ప్రాజెక్టుల్లో వాటాలు, విజయవాడలోని రాజ్‌యువ‌రాజ్‌ థియేటర్‌ భాగస్వామ్యం, పులివెందులలో భూములు, కంపెనీలు, రైల్వే కోడూరులో ఇల్లు, చిట్టిగుంటలో 90 ఎకరాల భూమి..ఇలా అనేక ఆస్తులు షర్మిలమ్మకు ఇచ్చారు. ఇవన్నీ సరిపోలేదా?. కానీ మీ అన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా ఆస్తులు ఇవ్వడానికి అంగీకరించాడే. అప్పుడు మీ నాన్న కంటే మీ అన్న గొప్పవాడు కాదా?. ఒక తల్లికి పుట్టిన బిడ్డలుగా అన్న ప్రేమతో ఇచ్చి ఉండవచ్చు. మీ వదిన కూడా ఇందుకు అంగీకరించడం చిన్న విషయం కాదు. ఆడబిడ్డకు ఆస్తుల్లో సమాన భాగం ఇవ్వడాన్ని చాలా కుటుంబాల్లో అంగీకరించరు. అలాంటిది ఇన్ని ఆస్తులు తీసుకున్న తర్వాత కూడా, మీ తండ్రి వైయస్‌ఆర్‌, మీ అన్న వైయస్‌ జగన్‌ కంటే మీ వ‌దిన‌ భారతమ్మ వెయ్యి రెట్లు గొప్పది కాదా?. ఏ అన్న ఇంత గొప్ప‌గా చెల్లెలిని ప్రేమ‌గా చూసుకున్నాడు.  

చెల్లెలనే మమకారంతో వైయ‌స్ జ‌గ‌న్‌ రూ.236 కోట్లు ఇచ్చారు
వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు 2009లో మరణించిన తర్వాత 2023 వరకు అందరూ తమ తమ ఆస్తులు, వ్యాపారాలు చూసుకుంటూ వచ్చారు.  షర్మిలమ్మ అడిగినప్పుడల్లా వైయ‌స్ జగన్ గారు తన సొంత సంపాదన నుంచి రూ.236 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ లెక్కలు నేను చెప్పేవి కావు. బ్యాంకు లావాదేవీలు, చెక్కుల రూపంలో షర్మిలమ్మే అఫిడవిట్లలో చూపించారు. ఇంత ప్రేమగా చూసుకున్న అన్నపై ‘అన్న అనే పదానికి కళంకం’ అని ఎలా అంటారు? రాష్ట్రానికి మేలు చేసిన నాయకుడిగా వైయ‌స్ జగన్‌ను దేశం, ప్రపంచం ప్రశంసిస్తుంటే, అదే వ్యక్తిపై ఆరోపణలు చేయడం న్యాయమా? అంతేకాక, కుటుంబ వ్య‌వ‌హారాలు బహిరంగంగా తీసుకువచ్చి, తీవ్ర ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇవన్నీ చాలవ‌న‌ట్లు ఇతరులతో చేతులు క‌లిపి కుటుంబ గౌరవాన్ని బజారుకీడ్చడం సరైంది కాదు. వైయ‌స్ఆర్ కుటుంబ శ‌త్రువుల‌తో క‌లిసి ష‌ర్మిల మాట్లాడుతున్నారు. 

చంద్ర‌బాబు చేతుల్లో పావులుగా ష‌ర్మిల‌, సునీత‌
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏం చెబితే అది ముందుగా సునీతమ్మ మాట్లాడుతారు, తర్వాత రెండు రోజులకు ష‌ర్మిల అదే విషయాన్ని చెబుతున్నారు. కట్టుకథలు అల్లుతూ వైయ‌స్ జ‌గ‌న్ గారి రాజకీయ జీవితాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సరస్వతి పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించి విజయమ్మకు కొన్ని షేర్లు వైయస్‌ జగన్‌ గారు ఇస్తే..అది ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉంది. దానిని బదలాయించే అధికారం లేదు. ఈ విషయం షర్మిలమ్మకు తెలుసు. ఆ షేర్లకు సంబంధించిన స‌ర్టిఫికెట్లు వైయస్‌ జగన్‌ వద్దే ఉన్నాయి.  ఆ స‌ర్టిఫికెట్లు పోయాయంటూ జ‌గ‌న్ గారు రాయించిన ఎంవోయుల‌ను అడ్డుపెట్టుకొని చ‌ట్ట‌విరుద్ధంగా అక్ర‌మంగా షేర్లు బ‌దిలి చేసుకున్నారు.  అలా చేస్తే వైయస్‌ జగన్‌ బెయిల్‌ రద్దు అవుతుందని కూడా షర్మిలమ్మకు తెలుసు. అయినా సరే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఆస్తులు లాగేసుకోవాలి. అన్న బెయిల్ ర‌ద్దు చేయించాల‌న్న‌దే షర్మిలమ్మ ఉద్దేశం. వైయస్‌ జగన్‌ ఆ విషయాన్ని తెలుసుకొని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌(ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్ర‌యించారు. ఈ కేసులో షర్మిలమ్మ ఓడిపోయింది. దానిపై ఇటీవల విజయమ్మ మద్రాస్‌ కోర్టులో కేసు వేస్తే..మరుసటి గంటకే ఆ కాగితాలు చంద్రబాబు వద్దకు వెళ్లాయి. ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయం చంద్రబాబు, రాధాకృష్ణకు తెలుస్తున్నాయి.   

ముఖ్యమంత్రి పదవిలో వాటా కావాలా?
 వైయ‌స్ జ‌గ‌న్ గారు సొంతంగా పార్టీ పెట్టుకుని అధ్యక్షుడిగా ఎదిగారు. కుటుంబ స‌భ్యులుగా మీరు మాత్ర‌మే కాదు..మేమంతా కూడా ఆయనతో కలిసి పని చేశాం. వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందరికీ బాధ్యతలు ఇచ్చారు. మీకు ఏం తక్కువ చేశారు?. గొడవలు లేకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి పదవిలో వాటా పంచుకోవాలా? రెండేళ్లు వైయ‌స్ జగన్‌కు, మూడేళ్లు షర్మిలమ్మకు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వాలా? ఇదేనా పరిష్కారం? అలాగే వైయ‌స్ జగన్ స్వ‌ర్జితంగా  సంపాదించిన ఆస్తులు, పెట్టుబడుల్లో వాటా ఇస్తేనే సంతృప్తి పడతారా?. వైయ‌స్ జగన్‌ వ్యాపారాల్లో మీరు ఏమైనా పెట్టుబడులు పెట్టారా? ఏమైనా సహాయం చేశారా? ఎలాంటి సంబంధం లేకపోయినా ఏ హ‌క్కుతో ఆస్తిలో వాటా అడుగుతున్నారు?  ఇది ఎక్కడి న్యాయం? 

వైయ‌స్ఆర్ బిడ్డ‌వా?  టీడీపీ నాయ‌కురాలివా?  
వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారి బిడ్డ టీడీపీ అభిమాని అవుతుందా అన్నది బాధ కలిగించే విషయం.  ష‌ర్మిల‌, సునీత టీడీపీ కండువా కప్పుకోకపోయినా, సైకిల్ ఎక్కకపోయినా వారి చర్యలు చూస్తే అదే భావన కలుగుతోంది. చంద్ర‌బాబుపై మీరు ఒక్క విమర్శ చేయకుండా, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సమయంలో వైయ‌స్ జ‌గ‌న్‌ను టార్గెట్‌గా చేసుకోవడం బాధాకరం.

వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే మేము చూస్తూ ఊరుకోం. ఆయనపై ఇలాంటి ఆరోపణలు చేయడం అన్యాయం. కుటుంబ విషయాలను బయటకు తీసుకువెళ్లి ఇతరులకు ఆ విష‌యాలు చెప్పి ర‌భ‌స చేయ‌డం స‌రికాదు. అన్నపై ఆరోపణలు చేస్తూ, ఉద్దేశ‌పూర్వ‌కంగా ఆయ‌న ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీస్తూ బయట వారి వద్దకు వెళ్లడం కుటుంబ వ్యవస్థకు విరుద్ధం. ఇన్నాళ్లు మీరు ఎలా మాట్లాడినా వైయస్‌ జగన్‌ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది ఆయన సంస్కారం, ఓర్పు. కానీ దాన్ని బలహీనతగా భావించడం తగదు. చంద్రబాబు వద్దకు వెళ్లి ఆయ‌న ప్రోద్భ‌లంతో  మీకు న్యాయం జ‌రుగుతుందా?. 

డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగ‌మే
చంద్ర‌బాబు పాల‌న వైఫ‌ల్యాల నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించేందుకు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయ‌డం అల‌వాటు చేసుకున్నారు. తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో హెరిటేజ్ పాత్ర బ‌య‌ట‌ప‌డింది. హెరిటేజ్‌కి ల‌బ్ధి చేకూర్చ‌డానికే చంద్ర‌బాబు తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదానికి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లిపిన‌ట్టు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టు రుజువులు ల‌భ్య‌మ‌య్యాయి. దీంతో ఆయ‌న ప్ర‌తిష్ట పూర్తిగా దెబ్బ‌తింది. బీఆర్ నాయుడి రాస‌లీల‌ల వీడియో బ‌య‌ట‌కొచ్చింది. ఇప్పుడు టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్ వ్య‌వ‌హారంతో దేశ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పరువు వీధిన‌ ప‌డింది. వీట‌న్నింటి నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి చంద్ర‌బాబు అక్క‌చెల్లెల్లు ష‌ర్మిల‌, సునీత‌ల‌ను రంగంలోకి దించి వివేకా హ‌త్య పేరుతో రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందాల‌ని చూస్తున్నాడు. 2029 ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఈ కేసును స‌జీవంగా ఉంచ‌డమే చంద్ర‌బాబు ల‌క్ష్యం. 

రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు వైయస్‌ జగన్‌ను ప్రేమతో ఆదరిస్తున్నారు. ఆయన కోసం ప్రాణం పెట్టే అభిమానులను ‘సైతాన్’ అని అనడం సరికాదు. ఆస్తులకు మీరు భాగస్వాములు అయితే, అభిమానానికి మేము భాగస్వాములం. వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వంపై దాడులు ఇలాగే కొన‌సాగితే మేము గట్టిగా ప్రతిస్పందిస్తాం అని మాజీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

 

Back to Top